– ఏ ఒక్కరికీ అన్యాయం జరగరాదు
– రెండు లక్షల ఉద్యోగాల హామీ నెరవేర్చండి
– గన్‌పార్క్ వద్ద విద్యార్థుల ఆందోళనలో పాల్గొన్న కవిత
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 8: గ్రూప్-1 అభ్యర్థులకు అండగా ఉంటామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. గన్ పార్కు అమరవీరుల స్తూపం వద్ద గ్రూప్-1 అభ్యర్థులు బుధవారం చేపట్టిన ఆందోళనలో ఆమె మాట్లాడారు. ప్రిలిమ్స్ నుంచే అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పేరు కోసం బోగస్ ఉద్యోగాలు ఇవ్వొద్దన్నారు. అభ్యర్థులు ఏళ్లతరబడి ఉద్యోగాల కోసం కష్టపడుతున్నారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ అశోక్ నగర్‌కు వచ్చి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు.. కానీ అధికారంలోకి వొచ్చాక పాత ఉద్యోగాలే ఇచ్చారు. ఇవి తప్పుడు పరీక్షలు. కాంగ్రెస్ వారిని ఎంపిక చేశారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడాలి. మిమ్మల్ని విద్యార్థులు నమ్మారు. వారి పక్షాన నిలబడండి. మూల్యాంకనం సరిగ్గా జరగాలి. కోర్టుల్లో జడ్జీలకు అర్థం అయ్యేదాకా పోరాటం చేస్తాం. గ్రూప్-1 నియామకాలను రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని కవిత డిమాండ్ చేశారు. విద్యార్థుల గోస కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో కొంతమందికి ఉద్యోగాలు ఇవ్వడానికి గ్రూప్-1 పెట్టారా అని ప్రశ్నించారు. తెలిసో తెలియకనో గత పదేళ్లలో గ్రూప్-1 పెట్టలేదన్నారు. నిరుద్యోగుల అండతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి వారినే మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పరీక్ష రాసిన విద్యార్థులు ఉద్యోగాలు వచ్చిన విద్యార్థులు రాసిన పేపర్లు బయట పెట్టమని అడుగుతున్నారన్నారు. 50 వేల పాత ఉద్యోగాలు ఇచ్చి తాము ఇచ్చినం అని అంటున్నారని విమర్శించారు. ప్రొఫెసర్ హరగోపాల్‌ను స్వయంగా కలుస్తామని, వ్యవస్థను ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా ఆగ్రహానికి గురికావొద్దని ప్రభుత్వానికి సూచించారు. ఉద్యోగాలు వచ్చిన వారిపై తమకు కోపం లేదని, అక్రమంగా తెచ్చుకున్న వారిపైనే కోపమని కవిత స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





