మరికొన్నాళ్లు వరంగల్‌ రేక్‌ పాయింట్‌ కొనసాగాలి

– గత సీజన్‌లో కేటాయించిన ప్రకారం సరఫరా లేదు
– ఈ సీజన్‌లో అయినా సరిపడ ఎరువులు సరఫరా చేయాలి
– సమీక్షా సమావేశంలో వ్యవసాయ మంత్రి తుమ్మల

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 6: రైల్వే శాఖ వరంగల్‌ రేక్‌ పాయింట్‌ను మూసివేసి గూడ్స్‌ హ్యాండ్లింగ్‌ను చింతలపల్లి పాయింట్‌కు మార్చాలని నిర్ణయించిందని, దీనివల్ల ఉమ్మడి వరంగల్‌ జిల్లావ్యాప్తంగా ఎరువుల సరఫరాలో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అందువల్ల 4 నుండి 5 నెలలపాటు వరంగల్‌ రేక్‌ పాయింట్‌ను కొనసాగించాలని రైల్వే మంత్రిని లేఖ ద్వారా అభ్యర్థించారు. యాసంగి సీజన్‌కు సంబంధించిన ఎరువుల సరఫరాపై అధికారులతో సచివాలయంలో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. గత సీజన్‌ ప్రారంభం కాకముందే కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినా ఎరువులు కేటాయించిన ప్రకారం సరఫరా చేయలేదని గుర్తు చేశారు. ఈ సీజన్‌లో అయినా ఎరువులను 60 నుంచి 70 శాతం మేర అక్టోబర్‌, నవంబర్‌, డిసెంబర్‌లలో సరఫరా చేస్తే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పంపిణీ చేయవచ్చనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కేటాయించిన దానిలో 70 శాతం ముందస్తుగా తెప్పించుకుంటే తరువాత వచ్చే ఎరువులతో కలిపి రైతులకు అవసరమున్నంత మేరకు గత యాసంగి, అంతకుముందు వానాకాలంలో ఇబ్బందులు లేకుండా పంపిణీ చేయగలిగిన తీరులో ఈ యాసంగిలో కూడా చేయవచ్చని అధికారులకు మంత్రి సూచించారు. కేంద్రం అక్టోబర్‌, నవంబర్‌ నెలలకు రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లు నెలకు 2 లక్షల మెట్రిక్‌ టన్నుల మేర యూరియా కేటాయించిందని, అయితే గత నెలలో ఇంకా 37 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా ఓడరేవుల నుండి రాష్ట్రానికి చేరుకోవాల్సి ఉందని, ఈ నెలలో ఇప్పటికే 25 వేల మెట్రిక్‌ టన్నులు రాష్ట్రానికి చేరుకుందని, దీంతో 1.88 లక్షల మెట్రిక్‌ టన్నులు అక్టోబర్‌ నుండి ఇప్పటివరకు సరఫరా అయినట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.43 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా, 58 వేట టన్నుల డీఏపీ, 2.09 లక్షల మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులు అందుబాటులో ఉన్నాయని, ఈ బఫర్‌ నిల్వలు రానున్న రోజుల్లో మరింతగా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు నవంబర్‌ నెల యూరియా సరఫరా ప్రణాళిక ప్రకారం రాష్ట్రానికి 2.00 లక్షల మెట్రిక్‌ టన్నులను కేంద్ర ఎరువుల శాఖ కేటాయించగా అందులో 1.29 లక్షల మెట్రిక్‌ టన్నులు దిగుమతి యూరియా కాగా మిగతా 0.71 లక్షల మెట్రిక్‌ టన్నులు దేశీయ వనరుల నుండి కేటాయించినవని చెప్పారు. అక్టోబర్‌లో సీఐఎల్‌, ఐపీఎస్‌ కంపెనీల నుండి రాష్ట్రానికి రావాల్సిన దిగుమతి యూరియాలో 0.37 లోటు ఏర్పడిరదన్నారు. రాష్ట్రంలో యూరియా వినియోగం ప్రధానంగా డిసెంబర్‌ మూడో వారం నుండి ఉంటుందని, అపుడు రాకుండా ఉండేలా కేంద్రం వెంటనే 0.50 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుమతి యూరియా కేటాయించడంతోపాటు, సీఐఎల్‌ ద్వారా త్వరితగతిన రవాణా చేయాలని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రిని కోరినట్లు మంత్రి తెలిపారు.

డైరెక్టర్‌ గోపి మాట్లాడుతూ యాసంగి సీజన్‌ కోసం 10.40 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా, 1.45 లక్షల మెట్రిక్‌ టన్నుల డీఏపీి, 7 లక్షల మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులు, 0.65 లక్షల మెట్రిక్‌ టన్నులు ఎమ్‌వోపీ, 0.60 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎస్‌ఎస్పీ ఎరువులను రాష్ట్రానికి కేటాయించారని చెప్పారు. రాష్ట్రానికి కేటాయించిన 10.40 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియాలో 6 లక్షల మెట్రిక్‌ టన్నులను అక్టోబర్‌, నవంబర్‌, డిసెంబర్‌లలో నెలకు 2 లక్షల మెట్రిక్‌ టన్నుల చొప్పున సరఫరా చేయాల్సిందిగా కోరామని, సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదిస్తూ ఎరువులను ముందుగానే తెప్పించే ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వివరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *