– కార్పొరేట్‌స్థాయిలో శాశ్వత భవనాలు
– త్వరలో గచ్చిబౌలిలో భవన శంకుస్దాపనకు ఏర్పాట్లు
– రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 2: ఇప్పటికే స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకొచ్చి ప్రజలకు మెరుగైన సేవలందిస్తున్న స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మరో అడుగు ముందుకేసింది. ప్రజలకు మరింత సమర్థవంతంగా పారదర్శకంగా ఒకేచోట సేవలందించడానికి వీలుగా సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను పునర్వ్యవస్థీకరించడం (రీఆర్గనైజేషన్)తోపాటు కార్పొరేట్ స్థాయిలో అత్యాధునిక సౌకర్యాలతో కార్యాలయాలను నిర్మించాలని నిర్ణయించింది. దీనిపై రాష్ట్ర సచివాలయంలో రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం రెవెన్యూ కార్యదర్శి డి.ఎస్.లోకేశ్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజి రాజీవ్ గాంధీ హనుమంతుతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా వాటిలో 37 మాత్రమే సొంత భవనంలో ఉన్నాయని, మిగిలినవన్నీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయని, ఈ పరిస్థితిని మార్చడానికి అన్ని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను కార్పొరేట్‌స్థాయిలో ఆధునిక సౌకర్యాలతో దశలవారీగా నిర్మించాలన్న ఆలోచన చేస్తున్నామని తెలిపారు. మొదటి విడతలో ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో నాలుగు లేదా ఐదు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలుగా నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకుగాను రెండుచోట్ల, రంగారెడ్డి జిల్లాలో 14కు గాను మూడుచోట్ల, మేడ్చల్ జిల్లాలో 12కు గాను మూడు చోట్ల, సంగారెడ్డి, పటాన్‌చెరు కలిపి ఒకటి మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల భవనాలను నిర్మించాలని నిర్ణయించినట్లు వెల్లడిరచారు. ఇంటిగ్రేటెడ్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల వల్ల పనితీరు మెరుగుపడడమేకాక పర్యవేక్షణ సులభమవుతుందని, అవినీతిని కూడా తగ్గించవచ్చని, కార్యాలయాల మధ్య పనిభారం సమానంగా ఉండడంతోపాటు దస్త్రాల ప్రాసెసింగ్ వేగవంతమవుతుందని చెప్పారు. మొదటగా హైదరాబాద్‌లోని గండిపేట, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను, గచ్చిబౌలిలోని తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్‌మెంట్ (తాలిమ్) కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం నిర్మిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రితో చర్చించి ఈ భవన నమూనాకు తుది రూపునిస్తామని, వీలైనంత త్వరగా శంకుస్ధాపన చేసేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.



