– మోటివేషనల్ స్పీకర్ దామోదర్
వరంగల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని కృషి, పట్టుదలతో చదివితే విజయం సాధిస్తారని మోటివేషనల్ స్పీకర్, సైకాలజిస్ట్ కజాంపురం దామోదర్ అన్నారు. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హనుమకొండ ఆధ్వర్యంలో వరంగల్ కృష్ణ కాలనీలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మంగళవారం ఏర్పాటు చేసిన సామాజిక, సంస్కార విద్యా వికాస ప్రేరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. సమకాలీన సమాజంలో పోటీతత్వాన్ని అలవరచుకుని చాలెంజింగ్‌గా ఎదగాలని సూచించారు. పేదరికం నుంచి వచ్చిన విద్యార్థుల్లో ఉన్నతంగా ఎదగాలనే పట్టుదల ఉండాలని, చదువుపై ఏకాగ్రతతో దృష్టి నిలపాలని అన్నారు. నీతి, నిజాయతీ, కష్టపడే స్వభావం ప్రతీ విద్యార్ధికి ఉండాలని, అప్పుడే అనుకున్న లక్ష్యానికి చేరుకోగలరని అన్నారు. కౌమార వయస్సులో తెలిసీ తెలియక అసాంఘికమైన, అనైతికమైన మార్గాల వైపు మొగ్గుచూపే అవకాశామున్నందున స్వీయ నియంత్రణతో తమను తాము సన్మార్గాల వైపు మళ్లించుకోవాలని, ఉత్తమమైన ఆలోచనలతో ఉన్నత స్థితికి ఎదగాలని ఉద్బోధించారు. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి తేరాల యుగంధర్ మాట్లాడుతూ సెల్‌ఫోన్‌కు దూరం కండి.. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలకు దగ్గర కండి అని అన్నారు. తల్లిదండ్రులు, వయోవృద్ధులు, పెద్దల పట్ల గౌరవ భావం పెంచుకోవాలన్నారు. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ శరధ్రుతి అధ్యక్షత వహించాగా లెక్చరర్స్ శర్మ, హరికృష్ణ, రమణారెడ్డి, వనమాల, హేమలత, కరుణశ్రీ, మరియా, ప్రవళిక, శబానా, సంగీత, ఉమ, విజయలక్ష్మి, మంజుల, కవిత, స్వప్న విద్యార్థినులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




