– ఆకట్టుకున్న వివిధ స్టాల్స్
– విద్యార్థుల కోసం 56 బస్సుల ఏర్పాటు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 10 : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈనెల 8 ,9 తేదీలలో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ స్టాళ్లు, కార్పొరేట్ కంపెనీల స్టాళ్లను విద్యార్థినీవిద్యార్థులు బుధవారంపెద్ద ఎత్తున సందర్శించారు. స్టాళ్లలో తమ ప్రొడక్టులను ప్రైవేటు సంస్థలు ప్రదర్శించాయి. నేడు ప్రధానంగా నగరంతోపాటు వివిధ జిల్లాల నుండి ప్రత్యేకంగా వచ్చిన ప్రభుత్వ సంక్షేమ గురుకుల పాఠశాలలు, డిగ్రీ కళాశాలలు, ఎన్ఎస్ఎస్ విద్యార్థులను స్టాళ్లు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రధానంగా ఏరోస్పెస్, మూసీ రివర్ డెవలప్‌మెంట్, హ్యాండీ క్రాఫ్ట్స్, టూరిజం, ఎడ్యుకేషన్, కరీంనగర్ ఇక్కత్, ఫిలిగ్రి, చేర్యాల పెయింటింగ్స్, సైబర్ క్రైమ్ ఛేదనలో ఉపయోగించే పలు ఆధునాతన పరికరాలు, డ్రోన్స్ , రోబో తదితర 27కు పైగా స్టాళ్లు ఏర్పాటు చేశారు. ప్రధానంగా, ఆధునిక పరికరాలు, వైమానిక అంశాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. కాగా, ఫ్యూచర్ సిటీలో బుధవారం నుండి 13వ తేదీ వరకు నిర్వహిస్తున్న ప్లీనరీ సెషన్లలో నేడు జరిగిన యూత్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనే అంశంపై జరిగిన రెండు సదస్సులలో దాదాపు మూడు వేల మంది పాల్గొన్నారు. వీరిలో గురుకుల పాఠశాలల నుండి వెయ్యిమంది లార్డ్స్ కళాశాల నుండి 700 మంది, వివిధ డిగ్రీ కళాశాల నుండి 1,200 మంది, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు 500మంది పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. ఉదయం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వీ -హబ్ సీఈవో విద్యార్థులతో సమావేశమయ్యారు. మధ్యాహ్నం సదస్సులో ప్రముఖ సినీ నటుడు రానా దగ్గుబాటి విద్యార్థులతో ముచ్చటించారు. సాయంత్రం మనో జాగృతి సంస్థ కౌమార దశలో మానసిక పరిపక్వత అనే అంశంపై వివరించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థుల కోసం దాదాపు 56 బస్సులను ఏర్పాటు చేశారు. ప్లీనరీ సెషన్ లో భాగంగా మహిళా సంక్షేమం, సంస్కృతి (విమెన్ రైజింగ్ ) అనే అంశంపై రెండు సదస్సులు జరుగుతాయని నిర్వాహకులు వెల్లడించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




