హిడ్మా ఎన్‌కౌంటర్‌పై నిజనిర్ధారణకు విద్యార్థుల బృందం

– బూటకపు ఎన్‌కౌంటర్‌ ఆరోపణల నేపథ్యంలో నిర్ణయం
– తమకు ఇబ్బందులు కలిగించవద్దని మావోయిస్టులకు లేఖ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1 : ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో నవంబర్‌ 18న జరిగిన ఎదురుకాల్పుల ఘటనపై వాస్తవాలు తెలుసుకోవడానికి దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థుల బృందం నిజనిర్ధారణ యాత్రకు సిద్ధమైంది. ఓయూ ఆర్ట్స్‌ కాలేజీ వద్ద సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యార్థి ప్రతినిధులు ఈ వివరాలను వెల్లడిరచారు. గత నెల 18న జరిగిన కాల్పుల సంఘటనలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మాద్వి హిడ్మా, అతని భార్య రాజే సహా మరో నలుగురు చనిపోయారని పోలీసు అధికారులు ప్రకటించినప్పటికీ ఈ ఘటనపై అనేక అనుమానాలున్నాయని విద్యార్థులు ఆరోపించారు. మోస్ట్‌ వాంటెడ్‌గా ఉన్న హిడ్మా ఎప్పుడూ మూడంచెల భద్రతా వలయంతో సంచరిస్తుంటాడని, అలాంటి వ్యక్తిని చంపడం అంత సులభం కాదని గతంలో పోలీసు అధికారులు మాట్లాడిన మాటలను వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. హక్కుల సంఘాలు దీన్ని బూటకపు ఎన్‌కౌంటర్‌గా ఆరోపిస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇది ప్రజాస్వామ్య హక్కుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. నిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని, విద్యార్థుల బృందం డిసెంబర్‌ 4న హైదరాబాద్‌ నుంచి బయలుదేరి 5న మారేడుమిల్లి సంఘటన స్థలాన్ని సందర్శించనున్నట్లు విద్యార్థి ప్రతినిధులు తెలిపారు. అంతేకాక మృతిచెందిన మావోయిస్టుల కుటుంబ సభ్యులను కూడా కలుస్తామని చెప్పారు. త‌మ నిజ‌నిర్ధార‌ణ‌ను అడ్డుకోవ‌ద్ద‌ని ముఖ్య‌మంత్రి, డీజీపీల‌కు విజ్ఞప్తి చేశారు.

మావోయిస్టులకు బహిరంగ లేఖ

ఈ సందర్భంగా నిజనిర్ధారణ బృంద సభ్యులు మావోయిస్టులకు ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. తమ బృందానికి ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. చికిత్స కోసం విజయవాడకు వెళ్లిన హిడ్మా, అతని భార్య సహా మరో నలుగురిని పోలీసులు పట్టుకొని కాల్చి చంపారనే వార్తల నేపథ్యంలో ప్రజలకు వాస్తవాలు తెలిపేందుకే ఈ యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. ఆదివాసీ, దళిత, బహుజన, వామపక్ష విద్యార్ధి సంఘాల నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈనెల 2 నుండి 8 వరకు మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ 25వ వార్షికోత్సవాలు నిర్వహిస్తున్న సమయంలో ఈ యాత్రను చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *