ఖర్గే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా

– దిల్లీ లీడర్లా కాదు.. గల్లీ లీడర్లా వ్యాఖ్యలు
-వరుస వైఫల్యాలతో కాంగ్రెస్‌లో అసహనం
– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 5: కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిన్నటి హైదరాబాద్‌ సభలో బిజెపి నాయకులు ఆడా కాదు, మగా కాదు అంటూ చేసిన అసభ్యకర, అభ్యంతరకర, అనాలోచిత వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తీవ్రంగా ఖండిరచారు. ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు తన స్థాయి మరచి ఇంతటి నీచమైన వ్యాఖ్యలు చేసి దిల్లీ లీడర్‌ కాస్తా గల్లీ లీడర్‌ స్థాయికి దిగజారిపోయారని, ఇది కాంగ్రెస్‌ పతనానికి మరో నిదర్శనమని అన్నరు. 80 ఏళ్ల వయస్సు గల ఖర్గే ఈ స్థాయికి దిగజారుతారని ఎవరూ ఊహించలేదున్నారు. ఈ వ్యాఖ్యలు ఆయన సొంతమా? లేక ఎవరైనా ఇచ్చిన స్క్రిప్ట్‌ చదివారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ వరుస వైఫల్యాలతో కట్టలు తెంచుకున్న అసహనంతో తమ అధినాయకత్వాన్ని ఏమీ అనలేక చేష్టలుడిగి బీజేపీిపై విరుచుకుపడ్డారని భావించాల్సి వస్తోందన్నారు. మోదీ ప్రభుత్వం పీవోకేను స్వాధీనం చేసుకోకపోవడాన్ని ఖర్గే తప్పుబట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. భారత్‌ ఆధీనంలో ఉండాల్సిన కశ్మీర్‌ పాక్‌ వశమవడం కాంగ్రెస్‌ పాపమే కాదా.. 1948లో నెహ్రూ ప్రభుత్వం తప్పిదమే పుపీవోకే పుట్టుకకు కారణం కాదా.. ఆరోజు భారత సైన్యాన్ని అక్కడినుంచి వెనక్కు ఎందుకు రప్పించారో చెప్పగలరా అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. 1971లోనూ భారత సైన్యం పాకిస్తాన్‌పై విజయం సాధించినప్పటికీ నాటి ప్రధాని ఇందిరాగాంధీ పీవోకేను స్వాధీనం చేసుకోలేదని, పైగా బందీలుగా పట్టుబడిన 90వేల మంది పాక్‌ సైనికులను ఎలాంటి షరతుల్లేకుండా విడిచిపెట్టారని గుర్తు చేశారు. కానీ, మోదీ ప్రభుత్వం పహల్గాం దాడి తర్వాత పీవోకేలో ఉన్న ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిందన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌, అంతకుముందు బాలాకోట్‌ వైమానిక దాడులు, సర్జికల్‌ స్ట్రైక్స్‌ మోదీ పాలనలో వృద్ధి చెందుతున్న భారత సామర్థ్యానికి నిదర్శనమన్నారు. యూపీఏ పాలనలో ఏనాడైనా ఉగ్రదాడులకు జవాబిచ్చారా? ముంబై దాడులు, పార్లమెంటుపై దాడి, ఎన్నో బాంబు పేలుళ్లు జరిగినా ఏమీ చేయలేక అన్నీ ముడుచుకొని మౌనం దాల్చడం వాస్తవం కాదా? అని అడుగుతున్నాను. మోదీ ప్రభుత్వం భారత సైన్యానికి స్వేచ్ఛనిచ్చి ఉగ్రదాడులకు దీటుగా బదులిస్తే.., మీరు, మీ నాయకులు రాహుల్‌ గాంధీ సర్జికల్‌ స్ట్రైక్స్‌ ఆధారాలు చూపించండి, ఆపరేషన్‌ సిందూర్‌లో కూలిపోయిన యుద్ధ విమానాల లెక్క చెప్పండి అంటూ పాకిస్తాన్‌ భాషలో మాట్లాడారు. రాజ్యాంగ పీఠికలోని సెక్యులర్‌, సోషలిస్ట్‌ పదాల విషయంలోనూ ఖర్గే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంలోనూ బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్లు రద్దు చేస్తారని కాంగ్రెస్‌ భయంకరమైన విష ప్రచారానికి తెరలేపిందని, ఇప్పుడు తెలంగాణలో వైఫల్యాలను, అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు మళ్లీ అదే తరహా దుష్ప్రచారం చేస్తోందని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ఒక్కటీ అమలు చేయక ప్రజలను నిట్టనిలువునా మోసం చేసినందకు ఖర్గే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని, లేకపోతే ప్రజల ఆగ్రహ జ్వాలలో కాంగ్రెస్‌ కొట్టుకుపోవడం ఖాయమని కిషన్‌రెడ్డి హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *