అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 28: హైదరాబాద్ లో 185 సంవత్సరాలుగా ఉబ్బస వ్యాధిగ్రస్తులకు బత్తిని సోదరులు పంపిణీ చేస్తున్న చేప ప్రసాదం (Fish Prasad) పంపిణీ కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని హైదరాబాద్ ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) స్పష్టం చేశారు. జూన్ 8న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో లక్షలాది మంది పాల్గొనే చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో పోలీసులు పకడ్బందీ భద్రతా చర్యలు తీసుకోవాలని లా అండ్ ఆర్డర్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని బుధవారం సచివాలయంలో నిర్వహించిన చేప ప్రసాదం పంపిణీ సమీక్షా సమావేశంలో ఆయన సూచించారు. చేప ప్రసాదం కోసం వచ్చే భక్తులకు గత సంవత్సరం కంటే అదనంగా మరిన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈసంవత్సరం చేప ప్రసాదం పంపిణీ కోసం 1.5 లక్షల చేప పిల్లలను ఏర్పాటు చేసినట్లు మత్స్యశాఖ అధికారులు తెలిపారు. చేప పిల్లల ఖర్చును నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ భరించాలని సూచించారు. వచ్చే భక్తులకు క్యూ లైన్ లో ఇబ్బందులు లేకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాలని ,మహిళలకు వృద్ధులకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. వీఐపీ పాస్ లు లిమిట్ గా పెట్టడం వల్ల సామాన్య ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉంటుందని సూచించారు.
చేప ప్రసాదం కోసం బయట రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉండడంతో వారికి సరిపడ తాగునీటి సౌకర్యాలు , టాయిలెట్స్ ఏర్పాటు , స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసే బోజన సౌకర్యాలకు ఇబ్బందులు లేకుండా వారికి జీహెచ్ఎంసీ నుండి సహకారం అందించాలన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి వచ్చే వాహనాలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ చుట్టూ పది పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేసినట్టు అధికార్లు వెల్లడించారు. వాహనాలు మొరాయించినప్పుడు వాటిని తీసుకెళ్లడానికి క్రేన్ వాహనాలు సిద్ధం చేసుకోవాలని సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు.చేప ప్రసాదం పంపిణీ పూర్తయ్యే వరకు జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బంది ఉండేలా చూడాలని,మొబైల్ టాయిలెట్స్ ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని సూచించారు.గార్బేజ్ తరలింపునకు వాహనాలు సిద్ధం చేయాలన్నారు.
వెటర్నరీ డాక్టర్లు చేప పర్యవేక్షణ చేస్తారని , ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆహార పర్యవేక్షణ ఉంటుందని అధికారులు మంత్రి పొన్నం దృష్టికి తీసుకెళ్లారు. దూద్ బౌలి, నాంపల్లి లో కరెంట్ ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి రావడం కోసం ఆర్టీసీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగూడ ,చర్లపల్లి నుండి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నారు. చేప ప్రసాదం పంపిణీ జరిగే ప్రదేశాల్లో వీల్ చైర్లు ఏర్పాటు చేయాలన్నారు. నాలుగు హెల్త్ క్యాంపులు ,నాలుగు అంబులెన్స్ లు ఏర్పాటు చేస్తున్నట్టు వైద్యాధికారులు తెలిపారు. చేప ప్రసాదం వేసే వాలంటీర్లకు సీపీఆర్ శిక్షణ ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. చేప ప్రసాదం కోసం టోకెన్ లకు అదనపు కౌంటర్ లు ఏర్పాటు చేయాలన్నారు. ఐ అండ్ పీఆర్ ఎప్పటికప్పుడు ప్రకటనలు ఇవ్వడం చేప ప్రసాదం కోసం వచ్చే సౌకర్యాలు తదితర వాటిపై చూసుకోవాలన్నారు. అన్ని డిపార్ట్మెంట్ లను కోఆర్డినేట్ చేసుకోవడానికి 20 ప్రాంతాల్లో ఒక ఆర్డీవో,ఒక అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో పర్యవేక్షణ ఉంటుందన్నారు. సమీక్షా సమావేశంలో ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురశెట్టి,అడిషనల్ సిపి విక్రమ్ సింగ్ మాన్, సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి,రెవెన్యూ ,హెల్త్,ఫైర్, వాటర్ వర్క్, ఆర్ అండ్ బి , బత్తిని కుటుంబ సభ్యులు బత్తిని అమరనాథ్ గౌడ్ , గౌరీ శంకర్ ,చంద్రశేఖర్ ,శివ శంకర్ , సంతోష్ తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.





