అంగన్వాడీల బలోపేతంపై దృష్టి

–  ఎస్‌హెచ్‌జీలకూ భాగస్వామ్యం
– త్వరలో సరికొత్త బాలామృతం పంపిణీ
– మహిళా శిశు సంక్షేమ శాఖ సమీక్షా సమావేశంలో మంత్రి సీతక్క

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 3: ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అంగన్వాడీల బలోపేతంపై మహిళా శిశు సంక్షేమ శాఖ దృష్టి సారించింది. చిన్నారుల పోషకాహరాన్ని మెరుగుపరిచేందుకు మహిళా స్వయం సహాయక బృందాలు, స్వచ్చంద సంస్థల సహకారాన్నితీసుకోవాలని నిర్ణయించింది. మహిళా శిశు సంక్షేమ శాఖపై ఆ శాఖ మంత్రి డాక్టర్‌ దనసరి అనసూయ సీతక్క సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా అంగన్వాడీ కేంద్రాల బలోపేతం, పోషకార మిషన్‌, ఉద్యోగ ఖాళీల భర్తీ, కారుణ్య నియామకాలు, అంగన్వాడీ సేవల్లో మహిళా స్వయం సహాయక బృందాలు, స్వచ్చంద సంస్థలకు భాగస్వామ్యం, చిన్నారుల పోషకాహార మెరుగుదల కోసం అవగాహన కార్యక్రమాలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ అంగన్వాడీలను బలోపేతం చేసే దిశలో పలు కీలక సూచనలు చేశారు. శిధిలావస్థలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను తక్షణం సమీపంలోని ప్రభుత్వ కార్యాలయాల్లోకి మార్చాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల బలోపేంవశ్రీతీjతీ ముందుకు వచ్చే స్వచ్చంద సంస్థల సహకారాన్ని తీసుకునేందుకు అన్‌లైన్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తేవాలని సూచించారు. చిన్నారుల్లో పోషకాహారం మెరుగుదల పరిశీలనకు ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. చిన్నారులకు అందించే ఆహారంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించేలా వంద రోజుల ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సుప్రీంకోర్టు కేసు నేపథ్యంలో అంగన్వాడీల్లో ఖాళీల భర్తీ, కారుణ్య నియామకాలను త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు అందించే బాలామృతంలో పలు మార్పులు చేశారు. నిపుణుల సిఫారసు మేరకు పంచదార లేకుండా సరికొత్త బాలామృతాన్ని టీజీ ఫుడ్స్‌ సిద్దం చేయగా మంత్రి రుచి చూసి పలు సూచనలు చేశారు. పిల్లలకు తీపి అనుభూతి కలిగేలా కర్జూరా పౌడర్‌ను మిక్స్‌ చేయాలన్నారు. సమావేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్‌, సెర్ప్‌ సీఈఓ దివ్యా దేవరాజన్‌, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ సృజన, తెలంగాణ ఫుడ్స్‌ ఎం.డి కే.చంద్రశేఖర్‌ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.

మహిళా సంఘాలకు ఆర్డీసీ ద్వారా రూ.కోటి ఆదాయం

అర్టీసీ అద్దె బస్సుల ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలు రూ.కోటి అర్జించాయి. ఇప్పటివరకు 150 బస్సులను అర్టీసీకి మహిళా సంఘాలు అద్దె ప్రాతిపదికన అప్పగించాయి. ఒక్కో బస్సుకు ఆర్టీసీ నెలకు రూ.70 వేలు చెల్లిస్తోంది. అంటే ఒక్కో నెలకు మహిళ సంఘాలు రూ. కోటి అందుకోనున్నాయి. దీనికి సంబంధించి మొదటి నెల పేమెంట్‌ను ఆర్టీసీ మహిళా సంఘాలకు మంజూరు చేసింది. దీనికి సంబంధించిన చెక్కును ఆర్టీసీ నుంచి సెర్ప్‌ సీఈఓ దివ్యాదేవరాజన్‌ అందుకున్నారు. ఈ సందర్భంగా దివ్యాదేవరాజన్‌, సెర్ప్‌ సిబ్బంది మంత్రి సీతక్కకు మిఠాయిలు తినిపించారు. సెర్ప్‌ సీఈఓను, సిబ్బందిని, మహిళా సంఘాలను మంత్రి అభినందించారు. ఆర్టీసీలో మహిళా సంఘాలచే అద్దె బస్సులకు అవకాశం కల్పించి నెలకు రూ.కోటి ఆదాయాన్ని అర్జించేలా సహకరించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఫోన్‌ చేసి ధన్యవాదాలు తెలిపారు. ఆర్టీసీ బస్సు ఓనర్లుగా ఉన్న మహిళా సంఘాలకు ప్రజా భవన్‌లో ఈనెల 5న జరిగే చెక్కుల పంపిణి కార్యక్రమానికి హాజరు కావాలని అయనను ఆహ్వానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *