గాంధీ సరోవర్ ప్రాజెక్టును ఆపండి

– కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షికి విన్నపం
– మూసీ జన్ ఆందోళన్ లేఖ

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 5: గాంధీ సరోవర్ ప్రాజెక్టు గురించి ‘మూసీ జన్ ఆందోళన్ (ఎంజేఏ) తీవ్ర అభ్యంతరాలు, ఆందోళనలు వ్యక్తం చేస్తోంది. మూసీ నది, దాని ఒడ్డుకు సమీపంలో నివసించే ప్రజల హక్కుల కోసం పనిచేస్తున్న ఈ సంఘం ఈమేరకు ఏఐసిసి తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కు ఒక లేఖ రాసింది. సివిల్ సొసైటీ కార్యకర్తలు, పర్యావరణవాదులు, మానవ హక్కుల సంస్థలు, స్థానిక నివాసితులతో కూడిన ఈ నెట్‌వర్క్ ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని వెంటనే ఆపాలని, ప్రజాస్వామ్య చర్చల ద్వారా పూర్తి సమీక్ష చేయాలని, తక్షణమే మీనాక్షి నటరాజన్ జోక్యం చేసుకోవాలని కోరింది. లేఖలోని సారాంశం ఇలా ఉంది. రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం బండ్లగూడ జాగీర్ గ్రామంలో 10.34 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం సంకల్పించింది.. ఇది మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్స్ నివాసులను ప్రభావితం చేస్తోంది. ప్రాజెక్టు కోసం అదనంగా 98.20 ఎకరాల రక్షణ శాఖ భూమిని బదిలీ చేయమని ప్రభుత్వం కోరింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 12న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను శంకుస్థాపన వేడుకకు ఆహ్వానించారు. ప్రజల వ్యతిరేకతను, ప్రజాస్వామ్య ప్రక్రియలను పట్టించుకోకుండా ఇలా చేయటం తగదు. ఈ ప్రతిపాదిత ప్రాజెక్టు ప్రజల వైపు నుంచి ఎన్నో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. నివాసులను తొలగించి గాంధీ విగ్రహానికి స్థలం కోసం చేసే ఈ ప్రయత్నం గాంధేయ విలువల పట్ల గౌరవం ఉన్న చర్య కాదు. దయచేసి ఇలా చేయవద్దు.. బాపూజీ బతికి ఉంటే ‘నా పేరుతో చేపట్టే ఈ ప్రయత్నాన్ని ఆపేయండి అని అనేవారు అని మహాత్మా గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ కూడా ఎక్స్(ట్విట్టర్)లో రాశారు. 2013 ఆరఎఫ్‌సీటీఎలఏఆరఆర్ చట్టం కింద సోషల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ నుండి ఈ ప్రాజెక్టుకు మినహాయింపు ఇవ్వడాన్ని ఎంజేఏ ఖండిస్తోంది. 2017లో రాష్ట్ర సవరణ ద్వారా ఈ చట్ట ఉద్దేశాన్ని, ప్రజల ప్రయోజనాలను, ఆహార భద్రతను దెబ్బతీస్తున్నారని మరోసారి చెబుతున్నాం. ప్రస్తుత విధానం నది పర్యావరణ వ్యవస్థకు, ప్రభావిత సమాజాలకు, రాష్ట్ర ప్రజలందరికీ హానికరమైన శాశ్వత పరిణామాలను తెస్తుందని హెచ్చరిస్తున్నాం. ప్రజల స్పందనలను పట్టించుకోకుండా ప్రాజెక్టు కొనసాగితే మన సహజ వారసత్వానికి తిరిగి రాని నష్టం కలిగిస్తుందని గుర్తించాలి. స్థానిక ప్రజలలో ఉన్న ఈ అసంతృప్తిని మీనాక్షి నటరాజన్ రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ అగ్ర నాయకత్వానికి తెలియజేయాలి. లేఖపై ఎంజేఏ తరఫున అఖిల్ సూర్య, జీవన్‌కుమార్, జాన్ మైఖేల్, కమల్‌నాయుడు, మీరా సంఘమిత్ర, రుచిత ఆశా కమల్, సజయ కాకర్ల, సంధ్య, సయ్యద్ బిలాల్, వెర్గీస్ తెక్‌నాథ్, విషాలి నాయుడు, ఆనంద్ తంగెళ్లలు సంతకాలు చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *