ఉప‌కార‌ వేత‌న ఆధారిత విద్య‌

– క‌నీస ఉప‌కార వేత‌నం రూ.7వేల‌ నుంచి గ‌రిష్టంగా రూ.24వేలు
– నైపుణ్య విద్య‌పై దృష్టి
– అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం వి.సీ ఆచార్య చక్రపాణి

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూలై 7 : విద్యార్ధుల్లో చదువుతో పాటు నైపుణ్యాన్ని పెంచడంతోపాటు, ఉపకార వేతన ఆధారిత విద్యను డా. బి.ఆర్. అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం అందిస్తోందని వైస్ ఛాన్సలర్ ఆచార్య ఘంటా చక్రపాణి వెల్లడించారు. విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో రిటైల్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఆర్ ఏఎస్‌సీఐ) తో అంబేద్కర్ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. ఎల్వీకే రెడ్డి, రిటైల్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఆర్ ఏఎస్‌సీఐ) ఎగ్జిక్యూటివ్ హెడ్ జేమ్స్ రాఫెల్ లు  అవగాహన ఒప్పందం పై సంతకాలు చేశారు.  అనంతరం ఉపకులపతి చక్రపాణి మాట్లాడుతూ రిటైల్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంస్థతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్న తొలి సార్వత్రిక విశ్వవిద్యాల యమన్నారు. విద్యార్థుల్లో చదువుతో పాటు నైపుణ్యం పెంచేందుకు ఈ అవగాహన ఒప్పందం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. స్టైఫండ్ ఆధారిత విద్యను (స్టైఫండ్ బేస్డ్ అప్రెంటిషిప్ ప్రోగ్రాం–ఎస్ ఏపీ) సద్వినియోగం చేసుకోవాలని విద్యార్ధులను కోరారు. త్వరలోనే  యూనివర్సిటీ వెబ్ పోర్టల్‌లో వివరాలను పొందుపరుస్తామని వెల్లడించారు.  రిటైల్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తో ఉమ్మడి ప్రవేశ నోటిఫికేషన్ ఇస్తామన్నారు.  ప్రతి విద్యార్థి కి చదువుతో పాటు ఉద్యోగ అవకాశం కల్పించడం, లేదా వాళ్ళను వ్యాపారవేత్తలుగా చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ ప్రోగ్రాం లో చేరడం ద్వారా నెలకు కనీసంగా రూ. 7వేల నుంచి గరిష్టంగా రూ.24 వేలు లేదా అంత కంటే ఎక్కువ సంపాదించుకునే అవకాశం ఉందన్నారు. తమ విశ్వవిద్యాలయం నుంచి ఇప్పటికే డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు కూడా అర్హులేనని వెల్లడించారు. ఈ ప్రోగ్రాంలో చేరడానికి 18-28 సంవత్సరాల వయసు గల విద్యార్ధులు అర్హులని పేర్కొన్నారు.  రిటైల్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కార్యనిర్వాహక అధిపతి జేమ్స్ రాఫెల్ మాట్లాడుతూ వ్యక్తిగతంగా ప్రతి విద్యార్థికి ప్రయోజనం కలిగించేందుకు తమ సంస్థ పనిచేస్తుందన్నారు. ఉద్యోగానికి సిద్ధంగా ఉన్న విద్యార్థులను ఎంపిక చేసి వారికి చదువుతున్నప్పుడే ఆర్ధికంగా సహాయ పడేలా స్టయి ఫండ్  అందించనున్నట్లు వెల్లడించారు. ఈ విధానం ద్వారా విశ్వవిద్యాలయ విద్యార్థులకు చాలా ప్రయోజనం కలుగుతుందన్నారు. రిటైల్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధి సమీర్ నర్సాపూర్ మాట్లాడుతూ పరిశ్రమనే ఉత్తమ ఉపాధ్యాయుడ‌న్నారు. వృత్తిపరమైన ప్రమాణాలను రూపొందించుకోవాలని  సూచించారు.  ఒక నిర్దిష్ట ఉద్యోగంపై పాఠ్యాంశాలను దృష్టిలో ఉంచుకుని, పాఠ్యప్రణాళిక, అప్రెంటిషిప్ ఉంటుందని వెల్లడించారు. రిటైల్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ, అకాడమిక్ (సౌత్ రీజియన్) జనరల్ మేనేజర్  చందా వడ్డే మాట్లాడుతూ ఈ ప్రోగ్రాం ద్వారా విద్యార్ధులు ప్రొఫెషనల్‌గా మారడంతో పాటు డిగ్రీ సర్టిఫికెట్ ను కూడా పొందొచ్చని పేర్కొన్నారు. స్థానికంగా ఉండే రిటేయిల్, పెద్ద పెద్ద సంస్థల్లో, బహుళ జాతి సంస్థల మాల్స్ లో పనిచేసేందుకు  విద్యార్థులకు చదువుతో పాటు ఆర్ధికంగా వనరులను సమకూర్చుకోవడానికి అవకాశం ఉంటుందని వెల్లడించారు. విశ్వవిద్యాలయ అకడమిక్ డైరెక్టర్ ప్రొ. పుష్పా చక్రపాణి మాట్లాడుతూ ఈ కొత్త ప్రోగ్రాంతో ప్రతి విద్యార్థి మరింత ఆర్థికంగా స్వావలంభన సాధించొచ్చని పేర్కొన్నారు. రిజిస్ట్రార్ డా. ఎల్ విజయ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ విశ్వవిద్యాలయ అధ్యయన కేంద్రాల సహాయంతో గ్రామీణ ప్రాంతాలలో విస్తృత ప్రచారం చేపడతామని, విద్యార్ధులకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. రిటైల్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంస్థ వివరాలను, అవగాహన ఒప్పంద వివరాలను ఈ.ఎం.ఆర్.ఆర్.సి. డైరెక్టర్ ప్రొ. రవీంద్రనాథ్ సోలమన్ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *