ప్రపంచం ముందు పొంచిఉన్న ఆర్థిక  సంక్షోభం..?

   హోర్ముజ్ జలసంధి గుండా సురక్షితమైన నౌకాయానం పై ఇంకా అనిశ్చితి నీడలు కమ్ముకుని ఉండటంతో, ప్రపంచ వాణిజ్యం లోని కీలక భాగం భవితవ్యం సందిగ్ధంలో పడింది. గత వారాంతంలో అమెరికా మరియు ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు అనేక అంశాలపై, ముఖ్యంగా టెహ్రాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలు మరియు జలసంధి పై దాని పట్టు విషయంలో ఇరు పక్షాల మధ్య గల భారీ విభేదాలతో ముగిశాయి. ఈ నౌకా రవాణా మార్గం పై తన సార్వభౌమాధికారాన్ని వదులుకోవడానికి టెహ్రాన్ నిరాకరించినట్లు కనిపిస్తోంది. ఒకవేళ ఇరాన్ దీనికి అంగీకరించి ఉంటే, అది అమెరికా కు స్పష్టమైన విజయంగా ఉండేది—అయితే అసలు ఈ సమస్యకు కారణం అమెరికా ప్రారంభించిన యుద్ధమే.
జలసంధిలో ఉన్న మైన్లను (సముద్రపు బాంబులను) తొలగించడానికి తమ రెండు సైనిక నౌకలు అక్కడికి వెళ్లాయని అమెరికా పెంటగాన్ పేర్కొంది. కానీ, నీటి అడుగున డ్రోన్లతో పహారా కాస్తున్న టెహ్రాన్, ఆ వాదనను అబద్ధమని కొట్టిపారేసింది. గల్ఫ్ ప్రాంతంలోకి ప్రవేశించడానికి లేదా బయటకు రావడానికి ప్రస్తుతం ఉన్న ఏకైక సురక్షిత మార్గం ఇరాన్ తీరాన్ని ఆనుకుని వెళ్లడమేనని తెలుస్తోంది; ఇప్పటికే అనేక సరుకు రవాణా నౌకలు ఇరాన్ అనుమతి తో ఈ మార్గాన్నే ఎంచుకున్నాయి.
ఇస్లామాబాద్ చర్చలకు ముందు, హోర్ముజ్ జలసంధిని బలవంతంగా తన ఆధీనంలోకి తెచ్చుకోవాలనే సంకేతాలను అమెరికా ఇచ్చింది, ఇప్పుడు అందుకు అది సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే, ఇటువంటి సాహసోపేత చర్యలు సరైన వ్యూహం అనిపించుకోవు. మరిన్ని చర్చలు జరపడమే సరైన మార్గం అయ్యేది. కానీ ఇప్పుడు అమెరికా సైనిక చర్య అనివార్యంగా కనిపిస్తుండటంతో, ప్రపంచం మరిన్ని ఆర్థిక కష్టాలను ఎదుర్కోవాల్సి రావచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *