– రూ.100 కోట్లతో అత్యాధునిక పరికరాలు
– రాష్ట్రస్ధాయిలో అత్యుత్తమ శిక్షణ కేంద్రం
– క్షేత్రస్ధాయి వరకు అడ్వాన్సుడ్ వెదర్ స్టేషన్లు ఏర్పాటు
– రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖa మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 28: ప్రకృతి విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కొని వీలైనంతవరకూ ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్ధ (డిజాస్టర్ మేనేజిమెంట్) విభాగాన్ని బలోపేతం చేసి దేశానికి ఒక రోల్ మోడల్‌గా ఉండేలా తీర్చిదిద్దుతున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఎలాంటి విపత్తులనైనా ఎదుర్కొనేలా రూ.వంద కోట్లతో అత్యాధునిక పరికరాలను కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో విపత్తుల నిర్వహణ విభాగం, ఫైర్ సర్వీసెస్, ఎస్‌డిఆర్‌ఎఫ్, హైడ్రా, ఐసిసిసి విభాగాలతో సమావేశం నిర్వహించి ఎలాంటి పరికరాలను కొనుగోలు చేయాలన్న విషయంపై బుధవారం సుదీర్ఘంగా చర్చించారు. అత్యవసర పరిస్థితుల్లో త్వరితగతిన స్పందించడానికి ఖచ్చితమైన సమాచార వ్యవస్థ, రియల్‌టైమ్ మానిటరింగ్ సాధ్యమయ్యేలా విపత్తు ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, డ్రోన్లు, శాటిలైట్ ఆధారిత కమ్యూనికేషన్, ఆధునిక రెస్క్యూ పరికరాలు, అత్యాధునిక ఫైర్ అండ్ సెర్చ్ ఆపరేషన్ల సాంకేతికతను రెవెన్యూ-విపత్తు నిర్వహణ విభాగాలకు అందుబాటులోకి తెస్తామని మంత్రి వెల్లడించారు. వాతావరణ పరిస్ధితులను క్షేత్రస్ధాయి వరకు ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసేలా మండలస్ధాయి వరకు అడ్వాన్సుడ్ వెదర్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. భారీ వర్షాలు, వరదల సమయంలో వాగులు, వంకలు, చెరువుల్లో చిక్కుకున్నవారిని రక్షించడానికి ఎయిర్‌లిఫ్ట్ మెకానిజం తయారు చేసుకోవాలని, ప్రమాదాల్లో చిక్కుకున్న వారిని తరలించడానికి 70 నుంచి 80 కిలోల బరువును ఎత్తే డ్రోన్లను కొనుగోలు చేయాలని సూచించారు. హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలోనైనా మాట్లాడడానికి వీలుగా సిమ్ ఆధారిత వీహెచ్‌ఎఫ్ రేడియో సిస్టమ్స్ అందుబాటులోకి తేవాలని, ఈ వ్యవస్దను క్షేత్రస్ధాయి వరకు తీసుకువెళ్లాలని సూచించారు. హైదరాబాద్ నగరంలో హైరైజ్డ్ భవనాలలో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేలా అవసరమైన పరికరాలను కొనుగోలు చేయాలని హైడ్రా కమిషనర్‌కు సూచించారు. 77 హైస్పీడ్ బోట్‌లను కొనుగోలు చేయాలన్నారు. రాష్ట్రంలో 12 ఎస్డీఆరఎఫ్ బృందాలు ఉన్నాయని, ఒక్కో బృందంలో వెయ్యిమంది వరకు ఉన్నారని, వీరందరికీ ఎప్పటికప్పుడు శిక్షణ ఇవ్వాలని సూచించారు. సమావేశంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, అగ్పిమాపక శాఖ డైరెక్టర్ విక్రమాన్ సింగ్, హైడ్రా కమిషనర్ రంగనాధ్, ఐసిసిసి డైరెక్టర్ కమల్‌హాసన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మేడారం జాతర ఏర్పాట్లపై మంత్రి పొంగులేటి ఆరా
మేడారం మహా జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని మంత్రి పొంగులేటి అన్నారు. కోట్లాది భక్తుల కొంగు బంగారం, తెలంగాణ కుంభమేళా సమ్మక్క సారలమ్మ జాతరలో అత్యంత పవిత్రమైన మొదటి ఘట్టం బుధవారం ప్రారంభమైన నేపధ్యంలో సచివాలయం నుండి హై ఫ్రీక్వెన్సీ వాకీటాకీతో మేడారంలో ట్రాఫిక్ విధులను పర్యవేక్షిస్తున్న సిబ్బందితో మంత్రి మాట్లాడారు. తొలి రోజున భక్తుల సంఖ్య, సారలమ్మ రాక ఏర్పాట్లు, సౌకర్యాల కల్పన, ఇతర అంశాలపై మంత్రి ఆరా తీశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పోలీసు వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలని, భక్తుల సౌకర్యార్థం తాగునీరు, రవాణా సౌకర్యాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




