– అధికారులకు సీఎస్ ఆదేశాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 28 : ప్రభుత్వ విద్యా సంస్థలలో బోధనలో నాణ్యత ప్రమాణాలు మరింతగా పెంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వ విద్యాలయాలస్థాయి వరకు ప్రతి విద్యా సంస్థలోనూ మెరుగైన బోధన సాగాలని, నాణ్యత ప్రమాణాలు పెంచే దిశగా కార్యాచరణ రూపొందించుకోవాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విద్యాశాఖపై సంబంధిత ఉన్నతాధికారులతో సచివాలయంలో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పాఠశాల విద్య, ఉన్నత విద్య, డిజిటల్ విద్య, ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజీల్లో పనితీరు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం తదితర అంశాలపై సమీక్షించారు. ఉన్నత విద్యా సంస్థలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో బోధన చేసి రిటైర్ అయిన మంచి అనుభవం కలిగిన ప్రొపెసర్స్, లెక్చరర్స్, టీచర్స్‌తో విద్యార్థులకు తరచుగా మూఖాముఖి కార్యక్రమాలు నిర్వహించి బోధన చేయిస్తే విద్యార్థులలో సృజానాత్మకత, మోటివేషన్, మంచి ఆలోచనలు పెరిగే అవకాశం ఉంటుందన్నారు. తద్వారా తమ భవిష్యత్తుకు సంబంధించి విద్యార్థులు ప్రణాళికలు ఏర్పరచుకొనే అవకాశం ఉంటుందని తెలిపారు.
మోడల్ హాస్టల్‌గా రూపొందించాలి
కేజిబివి, వివిధ సంక్షేమ వసతి గృహాలలో ఒక వసతి గృహాన్ని ఎంపిక చేసుకొని అందులో సోలార్ మోడల్ తరహా కిచెన్, స్టోరేజ్ రూమ్స్, మౌలిక వసతులు, తాగునీరు, టాయిలెట్స్, విద్యుత్, ఇంటర్నెట్ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి దానిని ఒక మోడల్ హాస్టల్‌గా రూపొందించాలని సీఎస్ అధికారులకు సూచించారు. దానిని ఆదర్శంగా తీసుకుని మిగతా వసతి గృహాలలో కూడా ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. కళాశాలల స్థాయిలో కెరీర్ గైడెన్స్ తరగతులు నిర్వహించాలని, బీ.ఎడ్ పూర్తి చేసిన విద్యార్థులతో ఇంటర్న్‌షిప్ కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలలో బోధన చేయించాలని, విద్యార్థులలో ఆసక్తి, నైపుణ్యాలు పెంచే విధంగా అనుభవం కలిగిన రిటైర్డ్ ఉపాధ్యాయులు, మార్గదర్శకులతో తరగతులు నిర్వహిస్తే విద్యార్థులకు మంచి ప్రయోజనం కలుగుతుందని అన్నారు. సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా, ఉన్నత విద్యా శాఖ కమిషనర్ శ్రీదేవసేన, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య, ఐటి ప్రత్యేక కార్యదర్శి భవేష్ మిశ్రా, పాఠశాల విద్యా సంచాలకుడు నవీన్ నికోలస్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




