-40 ఏళ్లుగా సర్పంచ్ ఎన్నికలకు దూరం
– ప్రత్యేక అధికారి పాలనే గతి
– రిజర్వేషన్ మార్చాలంటూ గ్రామస్థుల డిమాండ్
మంచిర్యాల, ప్రజాతంత్ర, అక్టోబర్ 6: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గూడెం గ్రామం రిజర్వేషన్ల కేటాయింపులో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఆ కారణంగానే గత నాలుగు దశాబ్దాలుగా సర్పంచ్ ఎన్నికలు జరగని గ్రామంగా వార్తల్లో నిలిచింది. గిరిజనులు లేకపోయినప్పటికీ 1950లో ఈ గ్రామాన్ని నోటిఫైడ్ ఏరియాగా అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. 1987 నుంచి నిబంధనల ప్రకారం ఇక్కడ సర్పంచ్, వార్డు స్థానాలు ఎస్టీ ( గిరిజనులకు) కేటాయించారు. అయితే గ్రామంలో గిరిజన జనాభా (ఎస్టీ వోటర్లు) దాదాపు లేరు. ఎస్టీలకు రిజర్వ్ అయిన ఈ స్థానంలో పోటీకి అర్హులైన ఎస్టీ అభ్యర్థులు లేక గత 40 ఏళ్లుగా సర్పంచ్ ఎన్నిక జరగడం లేదు.
ప్రత్యేక అధికారి పర్యవేక్షణలోనే..
ఎన్నికలు జరగకపోవడంతో ఇక్కడి పాలనా వ్యవహారాలన్నీ ప్రత్యేకాధికారి పర్యవేక్షణలోనే కొనసాగుతున్నాయి. దీంతో తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి, ప్రభుత్వ పథకాలను నేరుగా పొందడానికి స్థానిక ప్రజలకు అవకాశం లేకుండా పోయింది. గూడెం గ్రామం అభివృద్ధికి నోచుకోకపోవడానికి ఈ పాలనాపరమైన లోపం ఒక ముఖ్య కారణంగా మారింది.
రిజర్వేషన్ మార్చాలని డిమాండ్
తాజాగా పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు చేసినప్పుడు కూడా ఈ గ్రామానికి ఎస్టీ జనరల్‌కు రిజర్వేషన్ వచ్చింది. ఎస్టీ వోటర్లు లేనందున గ్రామంలోని అత్యధిక శాతం వోటర్లు బీసీలు కాబట్టి సర్పంచ్ పదవిని బీసీ జనరల్‌కు మార్చాలని కోరుతున్నారు. రిజర్వేషన్ల పేరుతో మా ప్రాథమిక హక్కును కాలరాస్తున్నారు. మా గ్రామానికి మేమే సర్పంచ్‌ను ఎన్నుకోలేని దుస్థితి ఏర్పడిరది అని గ్రామ పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిజర్వేషన్లు మార్చకపోతే ఎన్నికలను బహిష్కరిస్తామని ప్రజలు హెచ్చరిస్తున్నారు. కాగా, రిజర్వేషన్ల కేటాయింపు రాష్ట్ర చట్టాలకు లోబడి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంగా ఉన్నందున ఎస్టీ రిజర్వేషన్లు మార్చడంపై ఉన్న చట్టపరమైన అడ్డంకులను పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





