స్ఫూర్తినిచ్చిన రామాయణ, మహాభారతం కథలు

శ్రీమద్‌ భాగవతం-1 సినిమా షూటింగ్‌ను ప్రారంబభించిన సీఎం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 14: రామాయణం, మహాభారతం కథలు ప్రజలకు గొప్ప స్ఫూర్తినిచ్చినందున సమతుల్య విధానంతో నేడు శ్రీమద్‌ భాగవతం సినిమా నిర్మాణాన్ని చేపట్టడం చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి అన్నారు. రామోజీ ఫిల్మ్‌ సిటీలో శ్రీమద్‌ భాగవతం పార్ట్‌-1 సినిమా నిర్మాణ షూటింగ్‌ను ముఖ్యమంత్రి సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నలభయ్యేళ్ల క్రితం రామాయణం సీరియల్‌ను చిత్రీకరించి టెలివిజన్‌లో ప్రసారం చేసిన రామానంద్‌సాగర్‌ ఒక చిరస్మరణీయ వ్యక్తి అని, ఆ సీరియల్‌ సమయంలో ఎవరూ రోడ్లపై ఉండేవారు కాదని, అందరూ ఆ సీరియల్‌ చూసేవారని గుర్తు చేసుకున్నారు. ఆ సీరియల్‌ను చిత్రీకరించిన రామానంద్‌ సాగర్‌కు సంబంధించిన మోతీసాగర్‌, అమృత్‌ ఆకాష్‌, ఇతరులు మాట్లాడుతూ ఈ రోజు రామోజీ ఫిల్మ్‌ సిటీలో మహా భాగవతం పార్ట్‌-1 సినిమా నిర్మాణాన్ని చిత్రీకరించడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమన్నారు. రామాయణం సీరియల్‌ లాగానే ఈ భాగవతం మహాభారత చిత్రం కూడా అందరి ప్రశంసలు పొంది విజయవంతంగా ముందుకు సాగాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి ప్రభుత్వం అన్ని వేళలా అన్ని సహాయసహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. రామోజీ ఫిల్మ్‌ సిటీ అద్భుతమైన చిత్రాలను నిర్మించడంలో అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి పేరు తెచ్చుకుందన్నారు. కార్యక్రమంలో రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేంరెడ్డి నరేందర్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి, రోడ్లు అభివృద్ధి సంస్థ చైర్మన్‌ మల్రెడ్డి రాంరెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి చలమేశ్వర్‌ పాల్గొన్నారు. భగవత్‌ ఫిల్మ్‌ ప్రొడక్షన్స్‌ మోతీసాగర్‌, అమృత్‌సాగర్‌ చోప్రా, ఆకాష్‌సాగర్‌, రామోజా ఫిల్మ్‌ సిటీ ప్రతినిధులు, ఇతరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *