– అధికారికంగా తెలంగాణ క్రీడా విధానం ప్రకటన
– హాజరుకానున్న సీఎం రేవంత్, పలువురు క్రీడా సెలబ్రిటీలు
– పలు క్రీడా సంస్థలతో ఎంవోయూలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 1: రాష్ట్ర ప్రభుత్వం క్రీడా శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ హెచ్‌ఐసిసి, నోవాటెల్‌లో శనివారం నిర్వహించనున్న స్పోర్ట్స్ కాంక్లేవ్‌కు సర్వం సిద్ధమైంది. తెలంగాణ క్రీడా విధానంI2025ను యావత్ క్రీడా సమాజానికి విస్తృత స్థాయిలో పరిచయం చేసేందుకు, క్రీడా విధానం అమలులో అందరి భాగస్వామ్యం పెంచేందుకు ఉద్దేశించిన ఈ కాంక్లేవ్‌కు తగు ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ప్రఖ్యాత క్రీడా విశ్లేషకులు చారు శర్మ, భారత క్రికెట్ మాజీ ఒలింపియన్లు పుల్లెల గోపీచంద్, గగన్ నారంగ్, అంజు జార్జ్, వివిధ క్రీడా ఫెడరేషన్ల ప్రతినిధులు, క్రీడా సంఘాల ప్రతినిధులు, ప్రముఖ క్రీడా జర్నలిస్టులు విశ్వనాథన్ సభ నాయక్‌తోపాటు మరికొందరు సీనియర్ క్రీడా జర్నలిస్టులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. ఈ విధానం ప్రధానంగా పటిష్టమైన క్రీడా పరిపాలన, దీర్ఘకాలిక క్రీడల అభివృద్ధి, కెరీర్, ఉపాధి మార్గాల రూపకల్పన, క్రీడా మౌలిక సదుపాయాల కల్పన, సమగ్ర క్రీడా వాతావరణ కల్పన వంటి అంశాలపై దృష్టి సారించనుంది. గత ఏడాది కాలం నుండి సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు ఒక సమగ్రమైన, పటిష్ఠమైన క్రీడా విధానం తీసుకురావాలన్న సంకల్పంతో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఎంతో కృషిచేసింది. ఫిఫా(ఎఫ్‌ఐఎఫ్‌ఏ) వంటి గ్లోబల్ క్రీడా సంస్థలతోపాటు ప్రముఖ కార్పొరేట్లు, క్రీడా నిపుణులతో రాష్ట్రం ఎంవోయూలు చేసుకుంటోంది.
ఇది ఆరంభం మాత్రమే
తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలకు ఇది ఆరంభం మాత్రమేనని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. కాంక్లేవ్‌కు జరుగుతున్న ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలు నిర్వహించే సత్తా ఉందని అనేకసార్లు నిరూపణ అయిందని, క్రీడా శాఖ అధికారుల శ్రమ, రాష్ట్ర ప్రభుత్వ సహకారం, సీఎం రేవంత్ పట్టుదల కలిసి ఈ విధానం రూపుదిద్దుకుందని ప్రకటించారు. క్రీడా విధానం మెరుగ్గా అమలు పరచడం, దీన్ని జాతీయస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేసి వివిధ క్రీడా కార్యక్రమాలలో అందరినీ భాగస్వామ్యం చేయడం ఈ స్పోర్ట్స్ కాంక్లేవ్ ముఖ్య ఉద్దేశమని శివసేనారెడ్డి తెలిపారు.



