భూసేకరణను వేగవంతం చెయ్యండి

– పునరావాస పనులను త్వరితగతిన పూర్తిచెయ్యండి
– నీటిపారుదల శాఖాధికారులతో మంత్రి ఉత్తమ్‌ సమీక్ష

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 12: రాష్ట్రంలో పెండిరగ్‌ ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన భూసేకరణను వేగవంతం చేయాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పునరావాస పనులను త్వరితగతిన పూర్తిచేయాలని కూడా ఆదేశించారు. సచివాలయంలో నీటిపారుదల శాఖాధికారులతో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్లతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుని చట్టపరమైన, పాలనాపరమైన అంశాలను తక్షణమే పరిష్కరించేలా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఇటు భూసేకరణ, అటు పునరావాస పనులలో జాప్యం లేకుండా సమర్థవంతంగా పూర్తిచేయాలన్నారు. జిల్లాల వారీగా ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించిన ఆయన నిర్మాణంలో ఎదురవుతున్న ఆటంకాలను అధిగమించేందుకు అధికార యంత్రాంగం పనిచేయాలన్నారు. భూసేకరణలో జరుగుతున్న జాప్యం అంచనాలపై ప్రభావం చూపుతూ రెట్టింపు అవుతోందన్నారు. భూసేకరణలో ఆటంకాలను అధిగమించేందుకు భూములు కోల్పోయే రైతులతో సహృద్భావ చర్చలు జరపాలన్నారు. నష్టపరిహారం, పునరావాసం వంటి అంశాలను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ఎక్కడ నిర్లక్ష్యం వహించినా ప్రజావ్యతిరేకతతోపాటు న్యాయపరమైన చిక్కులు ఏర్పడతాయని, అలాంటి సునిశితమైన అంశాల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణాలను మంత్రి ప్రస్తావిస్తూ ఏజెన్సీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పనులను వేగవంతం చేయాలంటూ పనులలో అలసత్వం వహిస్తే అంచనాలు పెరుగుతాయన్నారు. పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టుల పూర్తికి అత్యంత ప్రాధాన్యమివ్వాలన్నారు. వర్షాల కారణంగా రాష్ట్రంలోని జలాశయాలలో పెరుగుతున్న నీటి మట్టాలపై ఆయన ఆరా తీశారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు నీటిమట్టాలను గమనించాలని అన్నారు. రాష్ట్రంలోనీ ప్రధాన ప్రాజెక్టుల నిర్మాణాలలో టన్నెల్‌ నిర్మాణాలు కీలకంగా మరాయని, వాటి నిర్మాణాలలో అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించేందుకు నీటిపారుదల శాఖలో భారత సైన్యంలో పనిచేస్తున్న ఇద్దరు ఇంజినీరింగ్‌ నిపుణులను చేర్చుకోబోతున్నట్లు వెల్లడిరచారు. భారత సేన మాజీ ఇంజినీర్‌-ఇన్‌-చీఫ్‌ జనరల్‌ హర్బల్‌ సింగ్‌ నీటిపారుదల శాఖలో గౌరవ సలహాదారుగా, అంతర్జాతీయ స్థాయిలో టన్నెల్‌ ఇంజినీరింగ్‌ నిపుణుడిగా ప్రసిద్దిచెందిన కల్నల్‌ పరీక్షిత్‌ మెహ్రాలు నీటిపారుదల శాఖల్లో చేరుటున్నట్లు తెలిపారు. రాజేంద్రనగర్‌లోని వాటర్‌ అండ్‌ ల్యాండ్‌ మేనేజ్‌మెంట్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ను మరింత బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఆ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన భూమి కబ్జాకు గురైందని, తక్షణమే సర్వే జరిపి అక్రమ కబ్జాలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. సకాలంలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయడంతోపాటు ప్రజాధనాన్ని సమర్థవంతంగా సద్వినియోగం చేయడమే ప్రభుత్వ సంకల్పమని మంత్రి ఉత్తమ్‌ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *