ప్రధాని మోదీకి సంకటస్థితి!
భారత దేశ అంతర్గత రాజకీయాల్లో ప్రధాని పదవి చేపట్టినప్పటి నుండి తాము కొమ్ములు తిరిగిన వారమనుకొనే మహానేతలైన జాతీయ ప్రాంతీయ పార్టీల నేతలను చేతికిందకు తెచ్చుకోవడమో లేక నేల కూల్చడమో అప్రతిహతంగా సాగిస్తున్న నరేంద్ర మోదీ చివరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేతికి చిక్కి అపకీర్తి మూట గట్టుకున్నారు. జయ జయ ధ్వానాలు జేజేలు పలికే ప్రజల ముందు చులకనై పోయారు. ఇది ప్రధాన మంత్రి స్వయంకృతాపరాధమే! గత నాలుగు రోజులుగా తాను పన్నిన ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ ను ఏలా బదనాం చేసిందీ మట్టి గరిపించిందీ -దేశ ప్రజలనుద్దేశించి ఒక వేపు గంభీరోపన్యాసం చేస్తుండగా మరో వేపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొత్తంగా గాలి తీసేశారు. భారత్ సైనిక బలగాల ముందు పాకిస్తాన్ తోక ముడిచి అంతర్జాతీయంగా అన్ని దేశాలను వేడుకున్న ఫలితంగానే కాల్పుల విరమణ జరిగిందని ప్రధాన మంత్రి మోదీ చెబితే ఇరు దేశాలు కాల్పుల విరమణను కట్టుబడక పోతే మొత్తంగా వాణిజ్యం నిలిపి వేస్తానని తాను చేసిన హెచ్చరికతో కాల్పుల విరమణ జరిగినట్లు అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. ఇప్పుడు ఇందులో ఏది నిజం?
అంతేకాదు. భారత దేశ ప్రజలకు తెలియని మరో అంశం కూడా అమెరికా అధ్యక్షుడు బయట పెట్టారు. రెండు దేశాలు అణ్వస్త్రాలు కలిగి వున్నాయని ఆలాంటి యుద్ధమే జరిగితే కోట్లాది మంది ప్రజలు మృత్యువాత పడతారని కూడా వెల్లడించారు. అంటే ఇదే ఉద్రిక్తత వాతావరణం మరి కొన్ని రోజులు కొనసాగి వుంటే భారత్ పాక్ దేశాల మధ్య అణు యుద్ధం జరిగేదా? ఆపరేషన్ సిందూర్ ప్రకటన చేసినపుడు ఈ విపత్కర పరిస్థితి గురించి ప్రధాని మోదీ ఊహించ లేదా? అమెరికా అధ్యక్షుడు నోట మాట రావడమంటే ఆషామాషీగాదు. పిచ్చోడి చేతిలో రాయిలాగా తొలుత అణ్వస్త్రాలు ఎవరు ప్రయోగించుతారనేది సమస్య కాదు. పరాజితుడుకి కసి ఎక్కువ. ఏమీ చేయలేనపుడు పాకిస్తాన్ అందుకు తలపడ వచ్చనే అభిప్రాయం అమెరికా అధ్యక్షుడు ప్రకటన తర్వాత భావించడం తప్పు కాదు.
ప్రధాన మంత్రి మోదీ కూడా తన ప్రసంగంలో అణ్వస్త్రాలు గురించి ప్రస్తావన తెచ్చి అందుకు భయపడేది లేదన్నారు.
ఇది అత్యంత గర్హనీయమైన భయంకరమైన అంశం. అణ్వస్త్రాల యుద్ధం గురించి ప్రధాన మంత్రి అంత తేలికగా మాట్లాడారంటే సగటు భారతీయుడు ఆ దురదృష్టకర భయానక మారణహోమం గురించి ఊహించనైనా అవకాశముందా? కేవలం నలుగురు ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు పాక్ బేస్ చేసుకున్న ఉగ్రవాదాన్ని తుదముట్టించే క్రమంలో కోట్లాది మంది ప్రజల ప్రాణాలను బలి పెడతారా?ఉగ్రవాదాన్ని నిర్మూలించాలంటే యుద్ధమొకటే మార్గమా? యుద్దాలతో ఉగ్రవాదాన్ని నిర్మూలించిన ఒక్క సందర్భం ఇంతకు ముందు వుందా ? ఇవన్నీ మిలియన్ డాలర్ల ప్రశ్నలుగా వున్నాయి. ఇంతకీ ఇప్పుడు ఎవరు గెలిచారు? ఎవరు ఓడి పోయారు? అనే ప్రశ్నలకు జవాబుగా ఇద్దరూ ఓడి పోయి అమెరికా గెలిచిందని ఒక మిత్రుడు చేసిన వ్యాఖ్య సమంజసంగా వుంది.
వాస్తవంలో ఆపరేషన్ సిందూర్ మొదలు పెట్టిన తర్వాత భారత్ భద్రత బలగాలు పైచేయి సంపాదించాయి. అంత కన్నా ఎక్కువగా దేశంలోని రాజకీయ పార్టీలతో పాటు దేశ ప్రజలంతా ప్రధాన మంత్రి మోదీ వెంట నిలచి జేజేలు పలికారు. మరీ మీడియా అయితే తామే యుద్ధం చేసినట్లు రెచ్చి పోయి వార్తలు ఇచ్చాయి. పైగా పాక్ పై దొరికిన పట్టును బిగిద్దామని ప్రధాన మంత్రి మోదీ నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయించారు. అంతలోనే మే నెల 10 వతేదీ సాయంత్రం 5.30 గంటలకల్లా ఆయుధాలు పడేయడం ఈ దేశ ప్రజలు జీర్ణించుకోలేకున్నారు. ఈ పరాభవం జీర్ణించుకోలేక పోయారంటే యుద్ధం కావాలని వాంఛించడం అంత కన్నా కాదు. దేశంలో ఉద్రిక్త వాతావరణాన్ని అంత ఉచ్చ స్థితి తీసుకెళ్లిన వారి అవ్యక్తం మాత్రం ఇందుకు జవాబు చెప్పాలి? కాల్పుల విరమణ కూడా ముందుగా అమెరికా అధ్యక్షుడు ప్రకటించడం అగ్గిలో గుగ్గిలం వేసిన చందమైంది. అంత క్రితమే అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రకటన ప్రస్తావన లేకుండా భారత్ కాల్పుల విరమణ ప్రకటన చేసి ఎన్నో యక్ష ప్రశ్నలను మిగిల్చింది . జయ జయ ధ్వానాలు పలికించుకొన్న నోళ్ల నుండే అమెరికా అధ్యక్షుడు ముందుగా ఏలా ప్రకటిస్తారని నిలదీత ఎదుర్కొన వలసిన దుస్థితి వచ్చింది? ఎంత అవమాన భారం? కాల్పుల విరమణను అంగీకరించే ముందు కనీసం ఇంకా పాక్ లో వున్న కరుడు కట్టిన ఉగ్రవాదులైన జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్, లష్కరే తొయిబా వ్యవస్థాపకుడు సయీద్ లను అప్పగించాలనే షరతు కూడా లేదు.
మరీ చోద్యమేమంటే మే నెల 10 వతేదీ సాయంత్రం వరకు ఇండియా పాక్ ఉద్రిక్తతలు సైనిక చర్యలు మాకేమీ సంబంధం లేదంటూ మాట్లాడుతుందని అమెరికా షడన్ గా రంగ ప్రవేశం చేసి వాణిజ్యం బూచి చూపి అణు యుద్ధం నివారించినట్లు ప్రపంచ శాంతి కాముకుడుగా ఫోజ్ పెట్టడం ఎంత వరకు నమ్మ గలం? తెర వెనుక ఏం జరిగింది? ఇంత వరకు ద్వైపాక్షిక అంశంగా వున్న కాశ్మీర్ సమస్యలో ఇప్పుడు మూడో వ్యక్తి ప్రవేశంపై నేడు భారత్ ఎన్ని వివరణలు ఇచ్చుకున్నా పూడ్చలేని నష్టం జరిగి పోయింది. నెహ్రూ హయాంలో కాశ్మీర్ అంశం జటిలం అయిందని ఇంత కాలం నెపం వేస్తుండిన కేంద్ర ప్రభుత్వ నేతలు ఇప్పుడు సమాధానం చెప్పుకోలేని స్థితిలో పడ్డారు. ఆర్టికల్ 370 రద్దు కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడం వరకు తాము సాధించిందేమీ లేదని నేడు బహిర్గతమైంది. కాశ్మీర్ ప్రజల మనోభావాలతో నిమిత్తం లేకుండా గైకొనే ప్రతి చర్య వికటిస్తుందని తేలి పోయింది. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వకుండా ప్రజలే ముందుకు వచ్చి వారిని అప్పగించే వాతావరణం
కాశ్మీర్ లో ఏర్పడినపుడే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. వారికి ఆ విశ్వాసం నమ్మకం ఏర్పడే వరకు కాశ్మీర్ లో ఎవ్వరూ ఏమి చేయ గలిగిందేమీ లేదు.
భారత్ లో అత్యధికులు పాక్ తో యుద్ధాన్ని కోరుకోలేదు. ఇంతకీ కాశ్మీర్ ప్రజలు అంత కన్నా వాంఛించ లేదు. యుద్ధ మిగిల్చే దుష్ఫలితాలను కాశ్మీర్ ప్రజలతో పాటు సరి హద్దు రాష్ట్రాలు ఇది వరకే చవి చూచి వున్నారు. తిరిగి పాక్షికంగా ఈ పక్షం రోజుల్లో చవి చూచారు. యుద్ధాల ఫలితంగా వేలాది కుటుంబాల్లో తండ్రులను పోగొట్టుకున్న పిల్లలు భర్తలను పోగొట్టుకున్న భార్యలు విషాద విషణ్ణ గాథలు హృదయ విదారకంగా గుండెలు పిండే విధంగా వుంటాయి. తెలుగు రాష్ట్రాలకు చెంది మురళి నాయక్ ను కోల్పోయాము.ఆ కుటుంబం గోష్ట భాషకు అందనిది. గత పక్షం రోజులుగా ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని యుద్ధం వద్దన్న వారిని దోశ ద్రోహులుగా ముద్ర వేశారు. దాదాపు పాక్ తోక ముడిచే దశలో అర్థాంతంగా కాల్పుల విరమణ ఎందుకు చేశారని అడిగే వారిని ఇప్పుడు దేశ ద్రోహులుగా పరిగణించడమే నేటి విషాదం! యుద్ధం వద్దన్న వారిని పాక్ వెళ్ల మని హేళన చేసిన బడుద్దాయిలు ఇప్పుడు అమెరికా వెళతారా అని ప్రశ్నించే వారికి ప్రాతిపదిక వుంది.
వి. శంకరయ్య
విశ్రాంత పాత్రికేయులు





