“ఎగువన భారీ వర్షాలు కురిసినప్పటికీ అటువంటి రెండు పెద్ద జలాశయాలు, ఆనకట్టలు ఉన్న తర్వాత 1908 లాంటి వరదలు రావడానికి అవకాశం లేదు. కాని 2025 వరదలు ఎట్లా వచ్చాయి? పోనీ, ఎగువన భారీ వర్షాలు కురిశాయా అని చూస్తే అది కూడా జరగలేదని వాతావరణ నివేదికలు చెపుతున్నాయి. అధికారులే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ల నుంచి భారీగా నీటిని విడుదల చేయడంతో, ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా, ఒక్కసారిగా అన్ని గేట్లూ తెరిచి ముప్పై వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయడంతో ఈ వరద వచ్చింది. అలా నీటిని విడుదల చేసిన అధికారులకు, కింద ప్రాంతాలు ఈ వరదతో మునిగిపోతాయనీ, బీభత్సం జరుగుతుందనీ, కనీసం హెచ్చరికలు, తరలింపులు, పునరావాస చర్యలు లేకుండా ఇలా నీటిని విడుదల చేయగూడదని తెలియదా?.. “
దశాబ్దాలుగా తాను నదినని మరిచిపోయి, మురికి కాలువను మాత్రమేనని అనుకుంటూ, కోటి మంది మల మూత్రాల సకల దుర్గంధాలను మోసుకుంటూ సాగుతున్న ఒక అనాది జీవనదికీ, దాని చుట్టూ ఉండే ప్రజానీకానికీ హఠాత్తుగా అది జీవనది అని గుర్తొచ్చిన సందర్భం ఇది. ఉప్పొంగి పోయింది మూసీ. తెప్పున్న ఎగసింది మూసీ. అటూ ఇటూ రెండు తీరాలలో వెలసిన జనావాసాలను ముంచెత్తింది. వేలాది మందిని నిరాశ్రితులనూ నిర్భాగ్యులనూ చేసింది. చివరికి తన గర్భంలో నిర్మించిన మహా వాహన స్థావరాన్నీ ముంచి తేల్చింది. ఎంత చెత్తను కొట్టుకుపోయిందో, ఎన్ని జ్ఞాపకాలనూ చరాస్తులనూ జీవితాలనూ ఊడ్చుకుపోయిందో తెలియదు గాని, ఆ క్రమంలో ఆలోచించవలసిన అనేక ప్రశ్నలను మాత్రం లేవనెత్తింది.
గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ ఛేంజ్ దుష్ఫలితాల గురించి గత కొన్ని దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు చేస్తున్న హెచ్చరికలు అక్షర సత్యాలని గత రెండు మూడు సంవత్సరాలుగా ప్రతి ఒక్కరి నిత్య జీవితానుభవంలోకి వస్తున్నది. అకాల వర్షాలు, రుతువులు మారిపోవడం, రుతువులకు లెక్కా పత్రం లేకపోవడం, మితిమీరిన ఎండలు, మితిమీరిన వర్షాలు. లేదా వర్షాభావం, కురచబారిన చలికాలాలు, మొత్తం మీద వాతావరణం కనీసం నాలుగైదు దశాబ్దాల కింద ఉన్నంత ప్రశాంతంగా కూడా ఉండడం లేదు. నిజమైన వర్షాకాలంలో కాక వర్షాలు ఎప్పుడు పడితే అప్పుడు కురుస్తున్నాయి. సాలుసరి వర్షపాతం అని గతంలో చెప్పుకునే ప్రమాణంలో సగమో పావో ఇప్పుడు ఒకటి రెండు రోజుల్లోనే కురుస్తున్నది. వర్షం అంటే ఆకాశమంతా పరుచుకున్న మబ్బుల నుంచి నింపాదిగా కురిసే ముసురు కాదు. ఒక్కసారి కుండ బోర్లించినట్టు కురిసిపోయే క్యుములో నింబస్ రాక్షస కాల మేఘాలు మాత్రమే.
ఇటువంటి అనేక ప్రకృతి వైపరీత్యాలకు క్రమక్రమగా అలవాటు పడుతున్న జనాన్ని ఈ సంవత్సరం వర్షాకాలం మొదలై రెండు నెలలు పెద్దగా వర్షాలు లేకుండానే, ఆ తర్వాత అనూహ్య భారీ వర్షాలు ఆశ్చర్యపరిచాయి. ఆ వరుసలోనే సెప్టెంబర్ చివరి వారంలో ఎడతెరిపిలేని వర్షాలు అందుకున్నాయి. ఆ వర్షాల మధ్యనే హఠాత్తుగా మూసీకి వరద వచ్చింది.
గంధంగూడ నుంచి నాగోలు దాకా మూసీకి ఇరువైపులా ఉన్న వేలాది పేద, మధ్యతరగతి ప్రజల ఇళ్లు మునిగిపోయాయి. లంగర్ హౌజ్ దగ్గర బాపూఘాట్ వంతెనను తాకుతూ, చాదర్ ఘాట్ కాజ్ వే బ్రిడ్జి మీద ఆరు అడుగుల ఎత్తులో, మూసారాంబాగ్ వంతెన మీద పది అడుగుల ఎత్తులో మూసీ మహోగ్రంగా ప్రవహించిందంటే ఒక్కసారిగా ఎంత నీరు వచ్చి ఉంటుందో ఊహించడం కూడా సాధ్యం కాదు.
నార్సింగిలో ఆదిత్య బిల్డర్స్ బహుళ అంతస్తుల భవనం సెల్లార్ లో భారీగా మూసీ వరద నీరు చేరింది. అలా వరద నీరు చేరడమే ఆ భవన నిర్మాణం నదీ గర్భంలోనో, తీరంలోనో జరిగిందనడానికి నిదర్శనం. కాని అసలు ఆ భవనం నది ఎఫ్ టి ఎల్ పరిధిలో, లేదా బఫర్ జోన్ లో ఉందా లేదా అన్నది తేల్చేందుకు ఇపుడు కొత్తగా కసరత్తు మొదలుపెడతామని అధికారులు అన్నారని వార్తలు వస్తున్నాయి. అలా సంపన్నుల అతిక్రమణలకేమో అది అతిక్రమణ అవునా కాదా తేల్చడానికి ప్రయత్నాలు ఇప్పుడు మొదలు పెడతారు. పేద, మధ్య తరగతికేమో అది అతిక్రమణే అని ముందే నిర్ధారిస్తారు!
ఈ వరదను చూసి చాలా మంది 1908 నాటి మూసీ వరదలను గుర్తు తెచ్చుకున్నారు. కాని, అప్పటి వరదలకు ప్రస్తుత వరదలకు చాలా తేడా ఉంది. అప్పటి వరదలకు కేవలం ప్రకృతే కారణం. ఎగువన అనంతగిరి, వికారాబాద్, తాండూరులలో కురిసిన భారీ వర్షాలకు మూసే పొంగి అప్పటి వరదలు వచ్చాయి. హైదరాబాద్ నగర జనాభాలో కనీసం పదిహేను వేల మంది మరణించారని అంచనా.
అటువంటి బీభత్సమైన వరదల నుంచి, జరిగిన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం నుంచి గుణపాఠం తీసుకుని, అటువంటి వరదలు రాకుండా చేయడానికే నది మీద హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నిర్మించారు. ఎగువన భారీ వర్షాలు కురిసినప్పటికీ అటువంటి రెండు పెద్ద జలాశయాలు, ఆనకట్టలు ఉన్న తర్వాత 1908 లాంటి వరదలు రావడానికి అవకాశం లేదు. కాని 2025 వరదలు ఎట్లా వచ్చాయి? పోనీ, ఎగువన భారీ వర్షాలు కురిశాయా అని చూస్తే అది కూడా జరగలేదని వాతావరణ నివేదికలు చెపుతున్నాయి. అధికారులే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ల నుంచి భారీగా నీటిని విడుదల చేయడంతో, ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా, ఒక్కసారిగా అన్ని గేట్లూ తెరిచి ముప్పై వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయడంతో ఈ వరద వచ్చింది. అలా నీటిని విడుదల చేసిన అధికారులకు, కింద ప్రాంతాలు ఈ వరదతో మునిగిపోతాయనీ, బీభత్సం జరుగుతుందనీ, కనీసం హెచ్చరికలు, తరలింపులు, పునరావాస చర్యలు లేకుండా ఇలా నీటిని విడుదల చేయగూడదని తెలియదా?
గేట్లు తెరవగానే కట్లు తెంచుకున్న జవనాశ్వాల్లా నీళ్లు నిమిషాల్లో లంగర్ హౌజ్, కార్వాన్, జియాగూడ, పురానాపూల్, చార్ ఘాట్, మూసానగర్, శంకర్ నగర్, మూసారం బాగ్, రసూల్ పురా, వినాయక వీథి, అంబేడ్కర్ నగర్ వంటి అనేక జనావాసాలను ముంచెత్తి అల్లకల్లోలం చేశాయి. నదీ గర్భంలో, నదీ తీరంలో సక్రమంగానో, అక్రమంగానో, అధికారుల అవినీతి అనుమతులతోనో నిర్మించుకున్న ఇళ్లు మునిగిపోయాయి. తాత్కాలిక ఆవాసాలు కొట్టుకుపోయాయి. నదీ తీరం నుంచి మట్టి నింపి నిర్మించిన కార్ఖానాలూ, వర్క్ షాపులూ మునిగిపోయాయి. వాటిలోని వాహనాలు కొట్టుకుపోయాయి. పురానాపూల్ శ్మశాన వాటిక నీటిలో మునిగిపోయింది. మూసీలోని లంక మీద, మరికొంత మట్టి పూడ్చి నిర్మించిన ఎంజిబిఎస్ సహజంగానే మునిగిపోయింది. దాదాపు సగం ప్లాట్ ఫారాలు మునిగిపోయి, బస్సులు నిలపడానికి వీలు లేకుండా అయ్యాయి.
ఇంత బీభత్సం జరిగిన మర్నాడు ముఖ్యమంత్రి యథావిధిగా “న్యూయార్క్ ను మరపించేలా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తాం” అని ప్రగల్భాలు పలకగలిగారంటే మన సమాజం ఎంత తలకిందులుగా నడుస్తున్నదో అర్థమవుతుంది.
అసలు మూసీకి ఇప్పుడు వరదలు ఎందుకు వచ్చాయి అనే మౌలిక ప్రశ్నకు జవాబులు ఆలోచిస్తుంటేనే మన సమాజగతి, మన రాజకీయ నాయకుల దుర్మార్గం, మన అధికార వ్యవస్థల అవినీతి, అలసత్వం, జీహుజూర్ జోహుకుం బానిసత్వం అన్నీ కనబడుతున్నాయి. ఈసారి మూసీ వరదల పాపం కచ్చితంగా ప్రకృతిది కాదు. ఇందులో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల పూర్తి సామర్థ్యపు పరిధి లోపల భవంతులు, రాజప్రాసాదాలు, ఫార్మ్ హౌజులు, రిసార్టులు నిర్మించుకున్న సంపన్న వర్గాల భవనాలను, నిర్మాణాలను రక్షించడానికి, ఆ రెండు జలాశయాల నుంచి నీటిని వదిలేయడం ఒక కారణం కావచ్చు. నగరంలో మూసీ తీరంలో ఇళ్లు నిర్మించుకుని తరతరాలుగా జీవిస్తూ, ఖాలీ చేసి వేరే ప్రాంతాలకు తరలి వెళ్లడానికి నిరాకరిస్తున్న పేద, మధ్యతరగతి వర్గాలను బెదరించి, ఖాలీ చేయించడానికి జరిగిన ప్రయత్నం ఒక కారణం కావచ్చు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారానికి వచ్చిన కొత్తలోనే, లండన్ పర్యటించి వచ్చి, థేమ్స్ నదీ తీరంలో జరిగిన అభివృద్ధి లాంటిది ఇక్కడ కూడా చేస్తానని, మూసీ సుందరీకరణ పథకం ప్రారంభిస్తున్నానని చేసిన ప్రకటనకు కొనసాగింపు ఒక కారణం కావచ్చు.
మొదటి కారణం నిజం కావచ్చుననడానికి ప్రధాన సాక్ష్యం అంతా హడావుడిగా నీరు వదలడం. ఆ రెండు జలాశయాల్లో ఎగువ నుంచి నీరు చేరుతున్నదంటే, అలా వచ్చి చేరుతున్న ప్రవాహ వేగం ఎంత, అది పూర్తి జలాశయ సామర్థ్యాన్ని నింపడానికి ఎంత సేపు పడుతుంది, అదే క్రమంలో ఎన్ని గేట్లు ఎట్టి ఎంత నీరు వదిలితే ప్రమాదకరం కాని పద్ధతిలో జలాశయం పూర్తిగా నిండుతుంది అని అధికారుల దగ్గర అంచనాలు ఉంటాయి. ఆ అధికారుల విద్యా, శిక్షణా, ప్రస్తుత భారీ వేతనాలూ అందుకోసమే. కాని, అప్పటికే ఆ జలాశయాల ప్రాంతంలో భవన నిర్మాణాలు జరగగూడదని ఆంక్షలు విధించిన జీఓ 111 ను ఎత్తివేశారు గనుక, ఎఫ్ టి ఎల్ పరిధి లోపల ఎందరో సంపన్నులు, రాజకీయ నాయకులు, సినిమా తారలు, పారిశ్రామికవేత్తలు ఎన్నో నిర్మాణాలు చేపట్టి ఉన్నారు గనుక, ఆ నిర్మాణాలను అధికారులు అవినీతి కొద్దీనో, పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకో చూసీ చూడనట్టు వదిలేశారు గనుక, అంత వాగాడంబరంతో, అట్టహాసంతో మొదలైన హైడ్రా కూడా ఆ భవన నిర్మాణాల విషయంలో చీమ తలకాయంత పని కూడా చేయలేదు గనుక, ఇప్పుడిక జలాశయ అధికారులకు, ప్రభుత్వాధికారులకు మిగిలిన ఏకైక మార్గం, ఆ బడా బాబుల ఇళ్లలోకి, ఫార్మ్ హౌజులలోకి, రిసార్టుల లోకి జలాశయాల బ్యాక్ వాటర్స్ చుక్క కూడా చొరబడకుండా చూడడమే. అదే వారి విధి నిర్వహణ. అదే వారి విద్యుక్త ధర్మం.
అందుకనే చెప్పా పెట్టకుండా అన్ని గేట్లూ తెరిచి వేలాది క్యూసెక్కుల నీరు కిందికి వదలడం. కింద కొట్టుకుపోతారా, చనిపోతారా, ఇళ్లు మునిగిపోతాయా, బట్టలూ బడిపిల్లల పుస్తకాలూ వంట సామానూ, వాహనాలూ కొట్టుకు పోతాయా, పోనీ, వాళ్లందరూ పేద, కూలీ నాలీ, మధ్యతరగతి జీవులే గనుక ఏమీ ఫర్వాలేదు. ఇంకా కావాలంటే కర్మ సిద్ధాంతం ఉంది. వారి కర్మ పరిపాకం వల్లనే మూసీ పొంగిందనవచ్చు.
రెండో కారణం నిజం కావచ్చుననడానికి, ప్రభుత్వం ముంపుకు గురైన బాధితులకు సహాయ, పునరావాస కార్యక్రమాల కన్నా ఎక్కువ ప్రాధాన్యతతో నదీ తీర ముంపు ప్రాంతాల డ్రోన్ పరిశీలనలు జరపడమే నిదర్శనం. రెండు సంవత్సరాలుగా ప్రత్యామ్నాయ పునరావాస ఏర్పాట్లు చూపకుండా ఖాలీ చేయమని బెదిరిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు నదిని తామే ఉద్దేశపూర్వకంగా పొంగించి, ఆ వరద సమయంలో నది ఎఫ్ టి ఎల్ లెక్కగట్టడానికి డ్రోన్ పరిశోధనలు జరిపి, రేపు వరద తీయగానే ఆ లెక్కల ప్రకారం వేలాది మందిని నిర్వాసితులను చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నదా? అంటే వరదల కల్పన దురుద్దేశంతోనే జరిగిందా? చెప్పలేం. ఏమైనా జరిగి ఉండవచ్చు. నార్సింగిలో ఆదిత్య బిల్డర్స్ బహుళ అంతస్తుల భవనం సెల్లార్ లో భారీగా మూసీ వరద నీరు చేరింది. అలా వరద నీరు చేరడమే ఆ భవన నిర్మాణం నదీ గర్భంలోనో, తీరంలోనో జరిగిందనడానికి నిదర్శనం. కాని అసలు ఆ భవనం నది ఎఫ్ టి ఎల్ పరిధిలో, లేదా బఫర్ జోన్ లో ఉందా లేదా అన్నది తేల్చేందుకు ఇపుడు కొత్తగా కసరత్తు మొదలుపెడతామని అధికారులు అన్నారని వార్తలు వస్తున్నాయి. అలా సంపన్నుల అతిక్రమణలకేమో అది అతిక్రమణ అవునా కాదా తేల్చడానికి ప్రయత్నాలు ఇప్పుడు మొదలు పెడతారు. పేద, మధ్య తరగతికేమో అది అతిక్రమణే అని ముందే నిర్ధారిస్తారు!
మూడో కారణం, మూసీ సుందరీకరణ పథకానికీ, ప్రస్తుత మూసీ వరదకూ కూడా సంబంధం ఉండి ఉండవచ్చు. కొత్త ప్రభుత్వం రాగానే జనవరిలో లండన్, దుబాయి పర్యటించిన వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ లో థేమ్స్ నది ఇరు పక్కలా రోడ్లు, సుందరమైన ఉద్యానవనాలు చూసి, మూసీ తీరాన్ని కూడా అలా చేస్తానని అన్నారు. ముప్పై ఆరు నెలల లోపల మూసీ పునరుద్ధరణ జరుపుతామని ప్రకటించారు. వెంటనే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు గుజరాత్ లో సాబర్మతీ, వారాణసిలో గంగా, దిల్లీలో యమునా నదీ తీరాలలో జరుగుతున్న కార్యక్రమాలను పరిశీలించి వచ్చారు. తర్వాత ఆ పథకం పేరు వినబడడం తగ్గిపోయినా, లోలోపల జరుగుతున్న ప్రయత్నాలకూ ప్రస్తుత వరదలకూ సంబంధం ఉండవచ్చు. 2024 జనవరి 3న రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిపాదించినప్పుడు దాని వ్యయం రు. 58,000 కోట్లు అన్నారు. ఆరు నెలలు తిరిగే సరికి ఆ వ్యయం రు. 70,000 కోట్లు అన్నారు. తర్వాత రు. 1,50,000 కోట్లు అన్నారు. అంత భారీ ప్రాజెక్టు, అంతగా ముడుపులు అందే ప్రాజెక్టు ఏదో ఒకరకంగా జరపాలనే పాలకులు కోరుకుంటారు.





