ఆత్మాభిమానం మచ్చుకైనా లేదా?

తెలంగాణ ఆత్మాభిమానం నినాదంతోనే అంత పెద్ద ఉద్యమం సుదీర్ఘకాలం పాటు సాగిందనేది నిర్వివాదాంశం. చాలా కష్టపడి, ఎన్నోనష్టాలకోర్చీ, ఉద్యమాన్ని అణచివేసేందుకు చేసిన కుట్రలన్నింటిని తట్టుకుని నిలబడి, ఎందరెందరో యువకులు నిరాశలో కూరుకుపోయి ఆత్మబలిదానాలు చేయగా వచ్చిన తెలంగాణ ఇది. మళ్లీ ఆంధ్రోళ్ల చెప్పులు మోయిస్తున్నారా  నా తెలంగాణ తో. ఎంత బాధో ఇది, ఎంత ఉక్రోషమో ఇది మాటల్లో చెప్పలేను.

నాకెందుకు ఇంత బాధగా ఉందంటే నా కెరీర్ మొదట్లోనే నమస్తే తెలంగాణ మొదలైన చాలా తొలిరోజుల్లో. అదో పత్రికా? మీరో జర్నలిస్టులు? అని హేళనలు  ఎదుర్కుంటున్న రోజుల్లోనే మా పత్రిక ఒక ఫోన్ ఇన్ రన్ చేసింది. సామాన్య ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి వాటిని ప్రచురించే కాలమ్ అది. ఆ ఫోన్లు నేనే అటెండ్ చేసి రాసి పబ్లిషింగ్ కి ఇచ్చేదాన్ని. అందువల్ల సామాన్య జనం ఎంత బలంగా తెలంగాణను కోరుకున్నారనేది నాకు బాగా తెలుసు. అందుకే ఇంత బాధ. నేను కేవలం ఆత్మాభిమానం కలిగిన జర్నలిస్టును మాత్రమే. నాకే పార్టీ మీద ప్రత్యేక అభిమానం లేదు.

special story on gaddar awards

అసలు సినిమాలే కదా మొదటగా తెలంగాణ అస్థిత్వం మీద సాంస్కృతిక దాడి మొదలు పెట్టింది. ఆ అవార్డు స్టేజి మీద నిలబడిన ఒక్కో ఆంధ్రోడి ముఖంలో ఎంతెంత అహంకారం. మాటల్లో ఎంతెంత చులకన?  స్టేజి మీదున్న ప్రజాప్రతినిధులకు. కాస్తంత కూడా అవమానం అనిపించలేదు. నిండుసభలో ముఖ్యమంత్రి పేరు మరచిపోయి ఏ రెడ్డి అని పక్కనున్న వాడు అందిస్తే ఏదో పేరు అని మాట్లాడిన పిల్ల కాకి నటుడి, స్మగ్లర్ వేషానికి ఉత్తమ నటుడనే అవార్డు పిలిచి పిలిచి ఇస్తివి కదా, అవమానంగా లేదూ? తొక్కిసలాటకు, నిండుప్రాణాలు పోవడానికి కారణమయ్యాడని అరెస్ట్ చేసినందకు ప్రతిఫలంగా ఇప్పుడీ అవార్డు ఇచ్చి రుణం తీర్చుకున్నారా ? లేక ఎవరి ప్రాపకం కోసం  ఈ పాట్లు? ఇంకొకరు  పక్క రాష్ట్ర మంత్రట, మహా నటుడట… ఈ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పేరు తెలీదు. అతను  తెలంగాణ రాష్ట్రాన్ని, స్ఫూర్తిని, ప్రజను గౌరవిస్తాడా?  ఎందుకండి ఎన్టీఆర్ అవార్డు మాకు? కాంతారావు అవార్డ్ కావాలి లేదా ప్రభాకర్ రెడ్డి అవార్డు కావాలి కాదంటే జయరాజ్ అవార్డు కావాలి. ఎవరినడిగి అవార్డులు పంచావు మహాత్మా? ఎవడబ్బ సొమ్మని? ఎంతటి అహంకారం .. లేకపోతే అవార్డు తీసుకునేందుకు కనీసం సభకు రారు వీళ్లు.

మొన్నెక్కడో చూశాను ఈ సినిమా వాళ్ల అహంకారం . శ్రీ లీల అనే ఒక పసి గ్లామర్ ఆ కార్యక్రమానికి ముఖ్య అతిధి అట. సినిమా వాళ్ల సమయపాలన మనకు తెలియనిది కాదుగా. ఆమె సభ మొదలయిన తర్వాత ఎంట్రీ ఇచ్చింది. మహారాణి వెడలే సభకు అన్నట్టు బౌన్సర్లు, మందీ మార్బలంతో. ఆ సమయానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రసంగిస్తున్నారు. సీనియర్ మోస్ట్ యాంకర్లలో ఒకరైన ఝాన్సీ కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్నారు. ఆమె ముఖ్య అతిధిని స్టేజ్ మీదకు పిలవాలి అని శ్రీధర్ బాబు గారిని పక్కకు జరిపి ఈ సదరు శ్రీ లీలకు వెనువెంటనే స్టేజీ మీదకు ఆహ్వానం పలికింది. శ్రీధర్ బాబు ప్రసంగం కంటే శ్రీ లీల ఎంట్రీకి అంత ప్రాముఖ్యత ఉందా?  అంత సీనియర్ ప్రజా ప్రతినిధి, మంత్రి, విద్యాధికుడు అనే ఆయన గౌరవం శ్రీ లీల పాటి విలువ చెయ్యదా? ఆయన ప్రసంగం అయ్యే వరకు స్టేజీ కింద ఉన్న సీట్లో శ్రీ లీల కూచోలేదా? ఆ కుర్చీలో ముళ్లేమయినా ఉన్నాయా?

సీనియర్ మోస్ట్ యాంకర్లలో ఒకరైన ఝాన్సీ కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్నారు. ఆమె ముఖ్య అతిధిని స్టేజ్ మీదకు పిలవాలి అని శ్రీధర్ బాబు గారిని పక్కకు జరిపి ఈ సదరు శ్రీ లీలకు వెనువెంటనే స్టేజీ మీదకు ఆహ్వానం పలికింది. శ్రీధర్ బాబు ప్రసంగం కంటే శ్రీ లీల ఎంట్రీకి అంత ప్రాముఖ్యత ఉందా? అంత సీనియర్ ప్రజా ప్రతినిధి, మంత్రి, విద్యాధికుడు అనే ఆయన గౌరవం శ్రీ లీల పాటి విలువ చెయ్యదా? ఆయన ప్రసంగం అయ్యే వరకు స్టేజీ కింద ఉన్న సీట్లో శ్రీ లీల కూచోలేదా?

అసలు ఈ ఆంధ్ర టాలీవుడ్ జనానికి ఇప్పటికీ కాస్త కూడా తెలంగాణ పట్ల గౌరవం లేదు. ఇక్కడ బతుకుతారు, సంపాదించుకుంటారు, అన్నీ ఇక్కడే పొందుతారు. కానీ ఇసుమంత సౌభ్రాతృత్వం లేదు.వాళ్ళను అనే ముందు మన ఆత్మగౌరవం ఏమైనట్టు? ఏదేమైనా ముఖ్యంగా టాలీవుడ్ జనం కేసీఆర్ ప్రభుత్వంలో అంతో ఇంతో అదుపాజ్ఞల్లో ఉన్నారని అనొచ్చు. ఇప్పుడు మళ్లీ ఆ బిగి తెలంగాణలో సడలిపోతుంది. తస్మాత్ జాగ్రత్త! తెలంగాణ సమాజమా, తిరిగి బానిసలు అవుతున్నారు.  మేలుకోండి దయచేసి. అసలు మనకు ఈ టాలీవుడ్ అవసరమా? ఎకరాల కొద్ది మన భూమిని స్టూడియోల పేరిట కొట్టేసి, బోలెడు సబ్సిడీలు పొంది , కోట్లకు పడగలెత్తి మన పిల్లగాండ్లను లైట్ మెన్లు గా సినీ కూలీలుగా మార్చుతున్నారు.

అంతకు మించి వీళ్లతో మనకు ఒరిగిందేమిటని ఒక్కసారి యువ తెలంగాణ సమాజం ఆలోచించాల్సిన అవసరం లేదా? తెలంగాణ సామాన్యుడు టాలీవుడ్ ను స్వచ్ఛందంగా నిషేధించాలేమో అసలు. లేకపోతే మన కళాకారులకు అస్తిత్వం ఉండదు. మన సాంకేతిక నిపుణులకు నిలువ నీడ ఉండదు. సినిమాటోగ్రాఫర్లు కావాలనుకునే వారు లైట్ మెన్ కూలీలుగా మిగిలిపోతారు, నటులు కావాలనుకునే వారు ఎక్స్ ట్రా యాక్టర్లుగా బతుకీడ్చాల్సి ఉంటుంది. దర్శకులు కావాలని ఆశపడే తెలివైన యువకులు అసిస్టెంట్లుగా తెల్లారి పోతారు. తెలంగాణ సినిమా పాలసీ వచ్చేవరకు ఏ విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలో తెలంగాణ యువ మేధావి సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉందని గుర్తించండి. సినిమా మన జోనర్ కాదనుకుంటే మన సంస్కృతి కుంటుపడిపోతుందనే గొప్ప సత్యాన్ని తెలుసుకోండి.

-భవాని 
సీనియర్ జర్నలిస్ట్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *