“పోగాలం వచ్చినప్పుడు, అన్నీ గతులు తప్పుతాయట. మనుషులు కూడా తలకిందుల నీతితో వ్యవహరిస్తారట. న్యాయం అనేది రద్దు అవుతుందట. అటువంటి ప్రళయదశ వచ్చిందని అమెరికా అధ్యక్షుడు అంగీకరిస్తాడని అనుకోలేము. కానీ, ప్రపంచం నిలబడిన పద్ధతుల ఇరుసును తలకిందులు చేయడానికి అతను నడుం కట్టాడు. దానికి చాలా తెగింపు కావాలి. పరిహాసాస్పదంగా వ్యవహరించే ధైర్యం కావాలి. అటువంటి ఒక సాహస తత్వం నుంచి అతనికి నోబెల్ శాంతి బహుమతి మీద కోరిక కలిగింది.”

విదూషకుడూ విలనూ ఒకరే అయినప్పుడు, కొంచెం సుఖం. గాయపడుతూనే కాసింత చిరునవ్వడానికి కూడా వీలుంటుంది. క్రూరత్వాన్ని మేకతోలు కింద దాచేయడం కూడా రాని ప్రతినాయకుల ముందు నెత్తురోడడం తప్ప, చిన్నచెమరింతకు కూడా ఆస్కారముండదు. అందుకే, ఏ రాయి మెత్తది తలపగడానికి అని ప్రశ్న వచ్చినప్పుడు, ఏకైక సమాధానంగా డొనాల్డ్ ట్రంప్ నిలబడతాడు. ప్రపంచాన్నినరకయాతన పెడుతున్నాడు నిజమే కానీ, వినోదం కూడా అందిస్తున్నాడు. అడాల్ఫ్ హిట్లర్ లో విదూషకుడిని చూడడానికి చార్లీ చాప్లిన్ కావలసివచ్చాడు. ట్రంప్ విషయంలో అంతటి శ్రమ అక్కరలేదు. అతను స్వయంభువు.
ఈ ఆదివారం సాయంత్రం లోగా, తన శాంతి పథకాన్ని ఒప్పుకోకపోతే, నా తడాఖా చూసుకోండి, అంతరించిపోతారు అందరూ, నరకమే విరుచుకుపడుతుంది! అని ట్రంప్ హమాస్‌ను హెచ్చరించారు. హింస మీద హింసాత్మకంగా దాడిచేసి గెలిచిన అహింస గురించి కుటుంబరావు గారి కథలో లాగా, ట్రంప్ శాంతిలో నరకం బాగా దట్టించి ఉంది. తన మాట నెగ్గించుకోవడానికి అతను అనుసరించే మృదుభాష అదే!
పోగాలం వచ్చినప్పుడు, అన్నీ గతులు తప్పుతాయట. మనుషులు కూడా తలకిందుల నీతితో వ్యవహరిస్తారట. న్యాయం అనేది రద్దు అవుతుందట. అటువంటి ప్రళయదశ వచ్చిందని అమెరికా అధ్యక్షుడు అంగీకరిస్తాడని అనుకోలేము. కానీ, ప్రపంచం నిలబడిన పద్ధతుల ఇరుసును తలకిందులు చేయడానికి అతను నడుం కట్టాడు. దానికి చాలా తెగింపు కావాలి. పరిహాసాస్పదంగా వ్యవహరించే ధైర్యం కావాలి. అటువంటి ఒక సాహస తత్వం నుంచి అతనికి నోబెల్ శాంతి బహుమతి మీద కోరిక కలిగింది. ఈజిప్టు-ఇజ్రాయిల్ మధ్య కేంప్ డేవిడ్ ఒప్పందం అమెరికా కుదిరించినప్పుడు, అప్పటికప్పుడు అన్వర్ సాదత్ కు, బెంజమిన్ బెగిన్ కు జంటగా నోబెల్ బహుమతి వచ్చినా, తరువాత చాలా కాలానికి జిమ్మీకార్టర్‌కు కూడా వచ్చింది. ఇప్పటి దాకా నలుగురు అమెరికా అధ్యక్షులకు నోబెల్ శాంతి బహుమతి రాగా, అందులో ముగ్గురు డెమొక్రాట్లే. ఆ ఒకే ఒక్క రిపబ్లికన్ కూడా అమెరికా సామ్రాజ్యవాదిగా పరిణమించక ముందటి కాలపు అధ్యక్షుడు. రష్యా, జపాన్‌యుద్ధాన్ని ఆపినందుకు 1906లో థియోడర్ రూజ్వెల్ట్ కు నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. తాను బద్ధశత్రువుగా పరిగణించే బరాక్ ఒబామాకు కూడా నోబెల్ వచ్చినప్పుడు, తనకు రాకపోవడం అన్యాయమని రిపబ్లికన్ ట్రంప్ అసహనంగా ఉన్నారు.
“తాను చేయగలిగిన సాయం మరో చోట చేయవచ్చునని పాకిస్థాన్ అనుకుని ఉండవచ్చు. గాజాలో శాంతి పథకానికి కొన్ని ఇస్లామిక్ దేశాలతో పాటు మద్దతు ప్రకటించి, ట్రంప్ ప్రతిష్ఠ పెంచే ప్రయత్నం అందుకే చేసింది. ఆ ఇరవై సూత్రాల పథకం తమ ప్రతిపాదనలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిందే అని పాక్ ప్రభుత్వం అంటోంది. హమాస్ తనను తాను రద్దుచేసుకుని, గాజా ను అంతర్జాతీయ పర్యవేక్షణకు అప్పగించి, ఇజ్రాయిల్ నుంచి ఎటువంటి పూచీలూ లేకుండా దక్కుతున్న శాంతిని ఆనందించాలని ట్రంప్ చేస్తున్నప్రతిపాదనకు పాకిస్థాన్, మరికొన్నిదేశాలు జీ హుజూర్ అంటున్నాయి. శాంతిచర్చలకు వేదికగా ఉన్న తన భూభాగం మీదకు ఆకాశదాడులు చేసిన ఇజ్రాయిల్ ముక్కుపిండి సారీచెప్పించిన ట్రంప్ మీద ఆరాధనతో ఖతార్ కూడా ఈ గాజా శాంతి పథకానికి సై అంటున్నది. పాత సంఘీభావాలూ సమీకరణలూ ఆవిరైపోయి, అయితే సొంతలాభం లేకపోతే బ్రతుకుజీవుడా అనుకుని, తమ చేతులకూ నెత్తురుపులుముకుంటున్న ప్రేక్షకప్రపంచం ఇది!”
పౌండ్రక వాసుదేవుడికి కృష్ణుడి లాగా పించమూ వేణువూ చేతిలో చక్రమూ అన్నీ ఉంటాయి. కానీ, కృష్ణుడి గుణాలను అనుసరించే ఓపిక మాత్రం ఉండదు. అట్లాగే, ట్రంప్ కూడా శాంతి బహుమతి కోసం శాంతివాదిలాగా నటించే ప్రయత్నం కూడా చేయరు. భారత్- పాక్ ఘర్షణ ను తానే ఆపానని, అందుకు క్రెడిట్ మాత్రమే కాక, నోబెల్ నామినేషన్ కూడా కావాలని ఇండియా, పాక్ లను రెంటిని అడిగాడు. పాకిస్థాన్ ఒప్పుకునేదే కానీ, ఇండియా ససేమిరా అంది. ఈ టారిఫ్‌లూ ఎచ్‌వన్‌బీ వీసాల గొడవా అంతటి వెనుకా, నామినేషన్ రాని ఉక్రోషం కూడా కొంత ఉంది. ఒకపక్క, గాజాలో మారణహోమానికి సమర్థకుడిగా, పోషకుడిగా వ్యవహరిస్తూ, మరో పక్క ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధాన్ని రెండువైపుల నుంచి నిర్వహిస్తూ, ఇండియా పాకిస్థాన్‌లను అదిలించి యుద్ధాన్ని ఆపినందుకు నోబెల్ వస్తుందని ఎట్లా అనుకుంటారు?.. అవును,అనుకుంటారు. ప్రపంచపు కొలమానాలను మార్చగలిగినప్పుడు, నోబెల్ ప్రాతిపదికలను మార్చలేరా? అయినా, ట్రంప్ వంటి తెంపరులకు ఇవ్వడం అలవాటు లేకపోవచ్చును కానీ, అశాంతిదూతలకు బహుమతులు కొత్తేమీ కాదు కదా!
తాను చేయగలిగిన సాయం మరో చోట చేయవచ్చునని పాకిస్థాన్ అనుకుని ఉండవచ్చు. గాజాలో శాంతి పథకానికి కొన్ని ఇస్లామిక్ దేశాలతో పాటు మద్దతు ప్రకటించి, ట్రంప్ ప్రతిష్ఠ పెంచే ప్రయత్నం అందుకే చేసింది. ఆ ఇరవై సూత్రాల పథకం తమ ప్రతిపాదనలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిందే అని పాక్ ప్రభుత్వం అంటోంది. హమాస్ తనను తాను రద్దుచేసుకుని, గాజా ను అంతర్జాతీయ పర్యవేక్షణకు అప్పగించి, ఇజ్రాయిల్ నుంచి ఎటువంటి పూచీలూ లేకుండా దక్కుతున్న శాంతిని ఆనందించాలని ట్రంప్ చేస్తున్నప్రతిపాదనకు పాకిస్థాన్, మరికొన్నిదేశాలు జీ హుజూర్ అంటున్నాయి. శాంతిచర్చలకు వేదికగా ఉన్న తన భూభాగం మీదకు ఆకాశదాడులు చేసిన ఇజ్రాయిల్ ముక్కుపిండి సారీచెప్పించిన ట్రంప్ మీద ఆరాధనతో ఖతార్ కూడా ఈ గాజా శాంతి పథకానికి సై అంటున్నది. పాత సంఘీభావాలూ సమీకరణలూ ఆవిరైపోయి, అయితే సొంతలాభం లేకపోతే బ్రతుకుజీవుడా అనుకుని, తమ చేతులకూ నెత్తురుపులుముకుంటున్న ప్రేక్షకప్రపంచం ఇది!
“విధ్వంసావాసాల శకలాలూ నెత్తురూ కలగలసిన గాజా మన అంతరాత్మలను అనుక్షణం కించపాటులో, లజ్జాభావంలో ఖననం చేస్తూ వచ్చింది. దండకారణ్యం దేశమంతా అరణ్యరోదనలను విధించింది. ప్రేమ, దుఃఖం, అనుకంప, లాలన, జీవితాలను వెలిగింపజేసే ఆదర్శాలు, అన్నిటిని మన చుట్టూ చెదిరిపోయి కనిపిస్తున్న శిథిలాలలో మళ్లీ ఇప్పుడు ఏరుకోవాలి, ద్రౌపది తన పిల్లల మృతదేహాల కోసం రణరంగాన్ని తడుముకున్నట్టు. భూలోక నరకాలను ఝళిపిస్తున్న విదూషక ప్రతినాయకుల ఎదుట విధేయంగా నిలబడి, ఎడారి గుండెలలో ఒక జలను కల్పించుకోవాలి. బహుశా, మనలోపలే రేపటి మనిషిని గర్భించుకుని ఆశ్రయం ఇవ్వాలి. ట్రంపులకు నోబెళ్లు ఇచ్చి మనం కొంచెం శాంతి కొనుక్కోవాలి.”
అమానవీయమైన మారణకాండ, ఒక ఒప్పందం ద్వారా ముగుస్తున్నప్పుడు, అందులో బాధిత పక్షం సంతోషం ప్రకటించి, మధ్యవర్తికి ధన్యవాదాలు చెప్పాలి. అమెరికా ప్రతిపాదించిన గాజాపథకానికి పీడకపక్షం అయిన ఇజ్రాయిలే ఆనందంతో గెంతులు వేసింది. మరోసారి కూడా ట్రంప్ ను నోబెల్ శాంతికి నామినేట్ చేయగలిగే అవకాశం ఉంటే బాగుండును కదా అని ఇజ్రాయిల్ ఉత్సాహపడిపోయింది. ఎడతెగని ఊచకోతలు సాగిస్తున్నప్పుడే, శాంతిచర్చల ప్రతిపాదన ముందుకు నడిపినందుకు గత జులైలోనే ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ ట్రంప్‌ను నోబెల్‌కు ఒకసారి నామినేట్ చేశాడు. గాజాలో సాగుతున్ననరమేధానికి అంతం లేనట్టు కనపడుతున్నది కాబట్టి, ఇజ్రాయిల్‌ను విజేతగా స్థిరపరచే ఒప్పందాన్ని గత్యంతరం లేక హమాస్ అంగీకరించవలసివస్తే, ట్రంప్‌కు నోబెల్ వచ్చినా రావచ్చు. తానే శాంతిదూతనని లోకం ముందు ఆయన వికటాట్టహాసం చేయవచ్చు. నరేంద్రమోదీకి ఒక వెక్కిరింత కూడా ప్రసాదించవచ్చు.
ఒక వస్తాదు కూడా బలప్రయోగంతోనే తన బస్తీలో శాంతిని నెలకొల్పుతాడు. శాంతి కింద కొందరు కప్పం కడతారు. కొందరు కిక్కురుమనకుండా ఉంటారు. అందరినీ భయభ్రాంతులను చేసి, వస్తాదు చివరకు తానే రక్షకుడిగా నిలబడతాడు. వైపరీత్యాలు సాధారణమైనప్పుడు, సందుగొందుల్లో జరిగేవి రాజవీధుల్లో జరుగుతాయి. దుర్భాషలు రాజభాష అవుతాయి. హింసావాదులు పావురాలు ఎగరవేస్తారు. ప్రత్యర్థులతో రాజీలో షరతులో మాట్లాడబోరు, రాజకీయంగానో, భౌతికంగానో చచ్చిపో అని ఆదేశిస్తారు. మాటల్లో ఆ కాఠిన్యం చూసి, దేశభక్తులు పరవశించిపోతారు.
ప్రశాంతత, ప్రసన్నత ఆనవాళ్లు లేకుండా ముఖాలు చెక్కేసుకున్న నియంతలు, మనుషులందరి నుంచి తడిని లాగేసి ప్రాసెస్ చేస్తారు. ద్వేషం విషం తప్ప మరేదీ రక్తనాళాల్లో ప్రవహించకుండా కట్టుదిట్టాలు చేస్తారు. డెడ్‌లైన్ కోసం పరచుకుంటున్న కళేబరాల వరుసలను చూసి, కళ్లు నిర్జలాలవుతాయి, నిర్లిప్తాలవుతాయి. మానవసమూహాల మధ్య ఒక కనీస ప్రాతిపదికల అంతర్వాహిని ప్రవహిస్తూ ఉంటుందన్న నమ్మిక పటాపంచలై, విలువల కనిష్ఠ సామాన్య గుణిజం ఆనవాలు దొరకక, బయొనెట్ కొసలకు జీవన్మరణాల సున్నితపు త్రాసు వేలాడుతుంటుంది.
విధ్వంసావాసాల శకలాలూ నెత్తురూ కలగలసిన గాజా మన అంతరాత్మలను అనుక్షణం కించపాటులో, లజ్జాభావంలో ఖననం చేస్తూ వచ్చింది. దండకారణ్యం దేశమంతా అరణ్యరోదనలను విధించింది. ప్రేమ, దుఃఖం, అనుకంప, లాలన, జీవితాలను వెలిగింపజేసే ఆదర్శాలు, అన్నిటిని మన చుట్టూ చెదిరిపోయి కనిపిస్తున్న శిథిలాలలో మళ్లీ ఇప్పుడు ఏరుకోవాలి, ద్రౌపది తన పిల్లల మృతదేహాల కోసం రణరంగాన్ని తడుముకున్నట్టు. భూలోక నరకాలను ఝళిపిస్తున్న విదూషక ప్రతినాయకుల ఎదుట విధేయంగా నిలబడి, ఎడారి గుండెలలో ఒక జలను కల్పించుకోవాలి. బహుశా, మనలోపలే రేపటి మనిషిని గర్భించుకుని ఆశ్రయం ఇవ్వాలి. ట్రంపులకు నోబెళ్లు ఇచ్చి మనం కొంచెం శాంతి కొనుక్కోవాలి.




