ఆశలు తుంచుకోవడమే, విధేయత!

భారత్‌ రాష్ట్ర సమితి అగ్రశ్రేణి నాయకులలో ఒకరైన తన్నీరు హరీష్‌ రావు పార్టీ అధినేతకు, పార్టీకి తన విధేయత గురించి మళ్లీ బహిరంగంగా వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది. కెసిఆర్‌ గీసిన గీత దాటని క్రమశిక్షణ తనదని చెప్పడమే కాదు, ఒకవేళ, కెటిఆర్‌ కు నాయకత్వం అప్పగిస్తే అందుకు తాను పూర్తిగా అనుగుణంగా ఉంటానని కూడా స్పష్టం చేయడం ఇందులో కీలకమైన ప్రకటన. ఇదేమీ కొత్తకాదు, ఇప్పుడు పార్టీ పత్రికాసమావేశంలో విలేఖరులు అడిగినప్పుడు చెప్పి ఉండవచ్చు, గతంలో ఒక వార్తాచానెల్‌ కార్యక్రమంలో కూడా ఇదే మాటను అసందర్భంగా చెప్పవలసి వచ్చింది. అప్పుడయినా ఇప్పుడయినా ఎదురయిన ప్రశ్నలకు ఒక సందర్భం ఉంది. బయట జరుగుతున్న ఒక ప్రచారం ఉంది.

ప్రచారాలు చేస్తున్నవారికేమీ సదుద్దేశాలు ఉన్నాయని చెప్పలేము. వారి మీద సైబర్‌ కేసులు పెట్టినంత మాత్రాన, అటువంటివి ఆగిపోతాయనీ అనుకోలేము. గోరంతలు కొండంతలు చేస్తుండవచ్చును కానీ, ఎంతోకొంత నిప్పు లేకుండా పొగలు పుట్టవు. హరీష్‌ రావు తన దారి తాను చూసుకోబోతున్నారన్న మాట అసత్యమే కావచ్చు కానీ, ఆయనకు అసంతృప్తో, మనస్తాపమో కలిగిన వాతావరణం ఉన్నదనేది వాస్తవమే. బాధితుడూ తానే అయి, సంజాయిషీ కూడా తానే ఇవ్వవలసి రావడం ఆయనకు ఏమంత ఆనందంగా ఉండి ఉండదు.

టిఆర్‌ఎస్‌ పార్టీలో హరీష్‌ రావు ముందొచ్చిన చెవుల వంటి వారు. పార్టీ పుట్టినప్పటి నుంచి దానితోనే ఉన్నారు. ఉద్యమంలో చాలా కీలకమయిన పాత్ర పోషించారు. కార్యకర్తలతో, క్షేత్రస్థాయి నాయకులతో మంచి సంబంధాలు పెట్టుకోగల వ్యవహర్త. అన్నిటికి మించి, సమస్యలు వచ్చినప్పుడు రంగంలోకి దిగి చక్కదిద్దగల టాస్క్‌మాస్టర్‌. పార్టీ ఆయనకు మంచి పదవులు, బాధ్యతలు ఇవ్వడంలో కానీ, ఆయన ఆశించడంలో కానీ పొరపాటేమీ లేదు. ఆయన నుంచి తీసుకోవలసిన పనులకు అంతం ఏమీ ఉండదు కానీ, ఆయన ఆశించగలిగినవాటికి ఒక హద్దు ఉంటుంది. దాన్ని ఆయన గుర్తించారనే అనుకోవాలి.

కుటుంబ సంస్థ, కుటుంబ పాలన- వీటి మీద ఎంతటి విమర్శ ఉన్నప్పటికీ, వ్యక్తుల ప్రతిభాపాటవాలను పరిగణనలోనికి తీసుకోవలసిందే. పట్టణ, ఆధునిక, విద్యాధిక శ్రేణులను ఆకట్టుకోగల వ్యక్తిత్వం, వ్యక్తీకరణ కెటిఆర్‌కు ఉంటే, ప్రజల మనిషి వంటి క్షేత్రస్థాయి ప్రతిష్ఠ హరీష్‌ రావుకు ఉన్నది. కొన్ని కొన్ని కీలక సందర్భాలలో, ఈ ఇద్దరు నాయకులు వ్యవహరించిన తీరు, చూపించిన సామర్థ్యం, తెలంగాణ ప్రజలను అమితంగా ఆకట్టుకున్నాయి. తెలంగాణ ప్రతిష్ఠను వీరు నిలబెడుతున్నారన్న భావనను, కెసిఆర్‌ నాయకత్వానికి ఒక కొనసాగింపు ఉన్నదన్న భరోసాను అందించాయి.

తెలంగాణ/ భారత్‌ రాష్ట్రసమితి పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ అని, ప్రాంతీయపార్టీ అనివార్యంగా మన దేశంలో కుటుంబ పార్టీగా కూడా ఉంటుంది అని గుర్తుపెట్టుకోకపోతే, ఈ విధేయతల చర్చ అర్థం కాదు. కుటుంబపార్టీ కావడం వల్ల మాత్రమే కెటిఆర్‌, హరీష్‌రావు పార్టీ అగ్రశ్రేణి త్రయంలో భాగమయ్యారు. తననెందుకు భాగం చేయరు అని కల్వకుంట్ల కవిత ఆవేదన చెందుతున్నది అది కుటుంబ పార్టీ కావడం వల్లనే. ఈటల రాజేందర్‌ పార్టీ నుంచి వెళ్లిపోవలసి వచ్చింది కూడా అందుకే. అధికారాన్ని కోల్పోయిన నేటి దశలో కూడా, బిఆర్‌ఎస్‌ లో కుటుంబానికి వెలుపల ముఖ్యనేతలెవరూ లేకపోవడం గమనించవచ్చు.

కుటుంబ సంస్థ, కుటుంబ పాలన- వీటి మీద ఎంతటి విమర్శ ఉన్నప్పటికీ, వ్యక్తుల ప్రతిభాపాటవాలను పరిగణనలోనికి తీసుకోవలసిందే. పట్టణ, ఆధునిక, విద్యాధిక శ్రేణులను ఆకట్టుకోగల వ్యక్తిత్వం, వ్యక్తీకరణ కెటిఆర్‌కు ఉంటే, ప్రజల మనిషి వంటి క్షేత్రస్థాయి ప్రతిష్ఠ హరీష్‌ రావుకు ఉన్నది. కొన్ని కొన్ని కీలక సందర్భాలలో, ఈ ఇద్దరు నాయకులు వ్యవహరించిన తీరు, చూపించిన సామర్థ్యం, తెలంగాణ ప్రజలను అమితంగా ఆకట్టుకున్నాయి. తెలంగాణ ప్రతిష్ఠను వీరు నిలబెడుతున్నారన్న భావనను, కెసిఆర్‌ నాయకత్వానికి ఒక కొనసాగింపు ఉన్నదన్న భరోసాను అందించాయి.

కానీ, కుటుంబంలో కూడా ఒక హెచ్చుతగ్గుల నిచ్చెన ఉంటుంది. కుటుంబ పెద్దకు తరువాత కొడుకే కీలకం. కొడుకు తరువాతే అల్లుడైనా మేనల్లుడైనా. ఆ తరువాతే ఆడకూతుళ్లు. ఈ సహజ, సంప్రదాయ అంతస్థులకు, వ్యక్తుల చొరవ, ఉత్సాహం, ప్రతిభ అడ్డం పడినప్పుడు సమస్య వస్తుంది. కొడుకు కు అధికార సంక్రమణం జరగదేమో అన్న బెంగ తండ్రికి మొదలవుతుంది. పార్టీలోను, ప్రజలలోను తిరుగులేని అభిమానం ఉన్నప్పుడు, ఆ అండతో అధినాయకుడు తన అభీష్టాన్ని స్థిరపరచాలని చూస్తాడు. ఇదంతా కలసి ఒక సంక్లిష్ట స్పర్ధావాతావరణాన్ని సృష్టిస్తుంది.

కెసిఆర్‌ ది పెద్ద కుటుంబం కాదు కానీ, విస్తృత కుటుంబమే. కెటిఆర్‌ వంటి వారసులకు కూడా తమకున్న సహజ నాయకత్వ లక్షణాల ఆధారంగా, పార్టీపగ్గాలు దక్కించుకోవాలని ఉంటుంది. ప్రత్యర్థులు తరచు విమర్శించినట్టు ‘మేనేజ్‌మెంట్‌ కోటా’లో తీసుకోవడంలో పెద్ద గౌరవమేమీ ఉండదని వారికి తెలుసు. అట్లాగని, వంశ వారసత్వం అదనపు అర్హతగా తనకున్నప్పుడు తామెందుకు వదులుకోవాలన్న పంతమూ ఉంటుంది. ప్రజలే తనను అంగీకరిస్తే ఈ ఇబ్బంది తగ్గుతుంది. కెసిఆర్‌ కు కూడా ఈ నైతిక సమస్య ఉంటుంది. ఇంతటి పరీక్ష తనకు పెట్టే బదులు, హరీష్‌ రావే కొంచెం తగ్గి ఉండవచ్చును కదా అన్న కోరికా కలుగుతుంది. హరీష్‌ రావును మంత్రివర్గంలోకి తీసుకోకుండా ఏడాది పాటు ఎడం పెట్టిన కాలంలో, ఆయన సిద్దిపేటకు మాత్రమే పరిమితమై ఉండిపోయారు. తనంతట తానే తన కార్యక్రమాల వార్తలు పత్రికల్లో రాష్ట్ర ఎడిషన్‌ లలో రాకుండా జాగ్రత్త పడేవారు. తాను మరింత ఉన్నతస్థానాలకు ఎదగాలనే ఆకాంక్షను ఆయన నిద్రాణస్థితిలో ఉంచే ప్రయత్నం చేశారు. సొంత ఉనికి ని కాపాడుకోవడం కూడా రాజకీయవాది ప్రాధాన్యాలలో ఒకటి కాబట్టి, ఆయన తన బలాన్ని, బలగాన్ని కాపాడుకోవడం, పెంచుకోవడం మాత్రం చేస్తూనే ఉన్నారు.

డిఎంకె చరిత్రలో అనేక ఉదాహరణలు దొరుకుతాయి. అయితే, సమస్యలను ఒక్కోసారి నిర్దాక్షిణ్యంగా, మరోసారి చాకచక్యంగా కరుణానిధి పరిష్కరించుకున్నారు. ఆయన కుటుంబం పెద్దది. అన్నదమ్ముల మధ్య ఒకపోటీ. కరుణానిధి మేనల్లుడు మురసోలి మారన్‌ కుటుంబంతో ఒక సమస్య. ఈ కుటుంబానికి బయట తన చొరవతో, వాగ్ధాటితో దూసుకుపోవాలని చూసిన వైగో. ఎవరి హద్దుల్లో వాళ్లు ఉండకుండా, అగ్రపీఠం వైపు వారసత్వం వైపు ఆశపడేసరికి, ఎక్కడికక్కడ కత్తిరింపులు వేయవలసి వచ్చింది. ఇప్పుడు స్టాలిన్‌ నిలదొక్కుకున్నాడు, కొడుకును తీర్చిదిద్దుకుంటున్నాడు. కనిమొజి ఢిల్లీకి పరిమితమైన నేతగా అణకువగా ఉంటున్నారు.

ఎన్టీయార్‌ కూడా తాను అభద్రతకు లోనయినప్పుడు బాలకృష్ణ తన వారసుడు అని ప్రకటించారు. అప్పటికి అతను ఇంకా సినిమారంగంలోనే ఉన్నాడు కాబట్టి, చంద్రబాబు పెద్దగా భయపడలేదు. లక్ష్మీపార్వతి విషయంలో మాత్రమే తన పునాదులు కదలిపోతున్నంత ఆందోళనకు గురయ్యారు. తన అసాధారణ ప్రతిభాపాటవాల ఆధారంగా, అదే లక్ష్మీపార్వతిని ఆయుధం చేసుకుని, వారసులందరినీ తన వెనుక మోహరింపజేసుకున్నారు. భార్యను కాదని జనం అల్లుడినే వారసుడిగా స్వీకరించారు.

కెసిఆర్‌ ది పెద్ద కుటుంబం కాదు కానీ, విస్తృత కుటుంబమే. కెటిఆర్‌ వంటి వారసులకు కూడా తమకున్న సహజ నాయకత్వ లక్షణాల ఆధారంగా, పార్టీపగ్గాలు దక్కించుకోవాలని ఉంటుంది. ప్రత్యర్థులు తరచు విమర్శించినట్టు ‘మేనేజ్‌మెంట్‌ కోటా’లో తీసుకోవడంలో పెద్ద గౌరవమేమీ ఉండదని వారికి తెలుసు. అట్లాగని, వంశ వారసత్వం అదనపు అర్హతగా తనకున్నప్పుడు తామెందుకు వదులుకోవాలన్న పంతమూ ఉంటుంది. ప్రజలే తనను అంగీకరిస్తే ఈ ఇబ్బంది తగ్గుతుంది. కెసిఆర్‌ కు కూడా ఈ నైతిక సమస్య ఉంటుంది. ఇంతటి పరీక్ష తనకు పెట్టే బదులు, హరీష్‌ రావే కొంచెం తగ్గి ఉండవచ్చును కదా అన్న కోరికా కలుగుతుంది. హరీష్‌ రావును మంత్రివర్గంలోకి తీసుకోకుండా ఏడాది పాటు ఎడం పెట్టిన కాలంలో, ఆయన సిద్దిపేటకు మాత్రమే పరిమితమై ఉండిపోయారు. తనంతట తానే తన కార్యక్రమాల వార్తలు పత్రికల్లో రాష్ట్ర ఎడిషన్‌ లలో రాకుండా జాగ్రత్త పడేవారు. తాను మరింత ఉన్నతస్థానాలకు ఎదగాలనే ఆకాంక్షను ఆయన నిద్రాణస్థితిలో ఉంచే ప్రయత్నం చేశారు. సొంత ఉనికి ని కాపాడుకోవడం కూడా రాజకీయవాది ప్రాధాన్యాలలో ఒకటి కాబట్టి, ఆయన తన బలాన్ని, బలగాన్ని కాపాడుకోవడం, పెంచుకోవడం మాత్రం చేస్తూనే ఉన్నారు.

కేంద్రప్రభుత్వం కుట్రలకు సహాయం చేసేందుకు కాక, రాష్ట్రంలో తెలంగాణ వాదాన్నికాపాడడానికి ఒక కొత్త పార్టీ అవసరమని, అది ఉద్యమపార్టీ గర్భం నుంచే రావాలని ఆశించినవారు కూడా ఉన్నారు. రాష్ట్రంలో ప్రత్యర్థులుగా రెండూ ప్రాంతీయపార్టీలే ఉండడం తెలంగాణకు, ఫెడరలిజానికి కూడా మంచిదని విశ్లేషణలు అనేకం వచ్చాయి. మరొక పార్టీ అంటూ ఏర్పడితే దానికి సారథ్యం వహించగల శక్తియుక్తులు హరీష్‌రావుకు ఉన్నాయి. తెలంగాణ ప్రయోజనాల దృష్టినుంచి చూసినప్పుడు, హరీష్‌ రావు వంటి వారి క్రియాశీల రాజకీయ జీవితం ఎంతో అవసరమైనది.

ఇంతలో తెలంగాణ రాజకీయచిత్రపటం మారిపోసాగింది. ప్రభుత్వవ్యతిరేకత పెరిగిపోయింది. మరోవైపు బిజెపి పై నుంచి గమనిస్తోంది, అట్టడుగు నుంచీ పనిచేస్తోంది. ప్రభుత్వాలను పడగొట్టే కార్యక్రమంలో ఉన్నప్పుడు, తెలంగాణలో కూడా బిజెపి అటువంటి ప్రయత్నం చేస్తుందని, అందుకు బిఆర్‌ఎస్‌ లోపలి నుంచి సహకారం తీసుకుంటారని ఒక ప్రచారం మొదలయింది. బాహుబలి సినిమా వచ్చినకాలంలో ‘కట్టప్ప’, మహారాష్ట్ర ఠాక్రే ప్రభుత్వ పతనం సమయంలో ‘షిండే’ పోషించిన పాత్రలను బిఆర్ఎస్‌లో ఎవరు పోషిస్తారన్న చర్చలు చేసేవారు. హరీష్‌రావును దృష్టిలో పెట్టుకుని మీడియాలో కథనాలు వండేవారు. రాజకీయ ప్రత్యర్థులు అటువంటి ఆపాదనలు, కుట్రసిద్ధాంతాలు చేసేవారు. ఇవి ఏ మాత్రం నైతికమయినవి కావు. పార్టీకి విధేయుడివి కావా, ఇంకో పార్టీతో రహస్యసంబంధంలో ఉన్నావా అని కెటిఆర్‌ను ఎవరూ అడగరు. ఎందుకంటే, ఆయన వారసుడు కాబట్టి. వారసత్వానికి తక్కువ అర్హత కలిగినవారు మాత్రమే ద్రోహం చేస్తారన్నట్టు, వ్యక్తిత్వాన్ని పలచబరడం అన్యాయం. పాత్రికేయులు కూడా, ఈ విధేయతలను పరమవిలువలుగా పరిగణించడం ఆశ్చర్యం.

కేంద్రప్రభుత్వం కుట్రలకు సహాయం చేసేందుకు కాక, రాష్ట్రంలో తెలంగాణ వాదాన్నికాపాడడానికి ఒక కొత్త పార్టీ అవసరమని, అది ఉద్యమపార్టీ గర్భం నుంచే రావాలని ఆశించినవారు కూడా ఉన్నారు. రాష్ట్రంలో ప్రత్యర్థులుగా రెండూ ప్రాంతీయపార్టీలే ఉండడం తెలంగాణకు, ఫెడరలిజానికి కూడా మంచిదని విశ్లేషణలు అనేకం వచ్చాయి. మరొక పార్టీ అంటూ ఏర్పడితే దానికి సారథ్యం వహించగల శక్తియుక్తులు హరీష్‌రావుకు ఉన్నాయి. తెలంగాణ ప్రయోజనాల దృష్టినుంచి చూసినప్పుడు, హరీష్‌ రావు వంటి వారి క్రియాశీల రాజకీయ జీవితం ఎంతో అవసరమైనది.

తన విధేయత గురించి, క్రమశిక్షణ గురించి హరీష్‌ రావు చెప్పుకుంటున్నప్పుడు, తాను ముఖ్యమంత్రి పదవిని ఆశించబోనని అండర్‌ టేకింగ్‌ ఇస్తున్నట్టే వినిపించింది. నిజానికి, కెటిఆర్‌, హరీష్‌ మధ్య వ్యక్తిగత సంబంధాలు ఏ ఉద్రేకాలు లేకుండా ప్రశాంతంగానే ఉన్నట్టున్నాయి. కెసిఆర్‌ అనవసరంగా అభద్రతకు లోనుకాకపోతే, పార్టీలో నాయకత్వసమస్య అర్జెంటుగా పరిష్కరించుకోవలసినదేమీ కాదు. వచ్చే ఎన్నికల నాటికి బిఆర్‌ఎస్‌ గట్టి పక్షంగా నిలబడుతుందా లేక, బిజెపికి రంగం అప్పగించి నిస్సహాయంగా నిలబడిపోతుందా అన్నది ముఖ్యమైన, కీలకమయిన సమస్య. ఈ గండాన్ని గట్టెక్కించడానికి అయితే, రామారావూ, హరీష్‌ రావూ అందరూ పార్టీకి అవసరమే. ఈ కుటుంబ గాధా చిత్రానికి తోడు, పార్టీలోని ఇతర ముఖాలను కూడా వేదిక మీదికి తెస్తే, జనబలం పెరుగుతుంది, ప్రతిష్ఠా కలుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page