
ఎంతో ముఖ్యమైనవి, సామాజిక ప్రాధాన్యం ఉన్నవి చాలా పరిణామాలు కళ్లెదుట ఉన్నాయి. ఎంతో గొప్పగా చెప్పుకుంటూ, నిరసనల మీద గృహనిర్బంధాల నీళ్లు చల్లుతూ నిర్వహిస్తున్న ప్రపంచసుందరి పోటీలు, అభాసుపాలయ్యాయి, అందులో సౌందర్యాత్మక హింస తప్ప, సంస్కారమేమీ లేదని పోటీదారులే చాటి చెబుతున్నారు. ఈ పోటీల వ్యవహారం నిర్వాహకులకే కాదు, తెలంగాణ రాష్ట్రప్రభుత్వానికి, తెలంగాణ ప్రతిష్ఠకు కూడా మచ్చ తీసుకువచ్చింది. ఇక గద్దర్ సినిమా అవార్డుల ప్రహసనం. సినిమా అవార్డులకు గద్దర్ పేరుపెట్టడమే అసంబద్ధం. ఇక ఏర్పాటు చేసిన జ్యూరీలలో తెలంగాణ ప్రాతినిధ్యం ఒక ప్రశ్నార్థకం. రేవంత్ రెడ్డికి కానీ, కాంగ్రెస్‌పార్టీకి కానీ, తెలంగాణ స్పృహ ప్రాధాన్యంగా లేదని అవార్డుల ప్రకటన సూచిస్తోంది. తాను తిరస్కరించిన విలువలకు పట్టం గట్టినవి ఉత్తమసినిమాలుగా నిలబడడం తెలంగాణ సమాజానికి ఆవేదన కలిగిస్తున్నది. ఏడాదిన్నర కావస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. వాగ్దానాలను పరిపూర్తిచేయడంలో కానీ, చేసినంతవరకు ప్రచారం చేసుకోవడంలో కానీ, కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడంలో కానీ, ఎటువంటి విజయం సాధించకపోగా, అందాలపోటీల వంటి వాటివల్ల ఆశించిన- జనాన్ని ‘మరిపించే’ లక్ష్యాన్ని- కూడా సాధించలేకపోయింది. పదే పదే ఇన్ని ప్రతికూలతలు తెచ్చుకోవడంలో రికార్డులు బద్దలు కొట్టాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టుంది.
వీటన్నిటి నడుమ కల్వకుంట్ల కవిత వివాదం, రాష్ట్రప్రభుత్వ వైఫల్యాలను అప్రధానం చేయగలిగింది. బయటివారు ఎవరూ ఉద్దేశ్యపూర్వకంగా భారత్ రాష్ట్రసమితి ‘ఇంటి’ వ్యవహారాన్ని ‘రచ్చ’కు ఎక్కించడం లేదు. పనిగట్టుకుని ఎవరూ ఆ పార్టీ నాయకత్వాన్ని టార్గెట్ చేయడం లేదు. అదిగో పులి అంటే, ఇదిగో తోక అనే రకం అతిశయోక్తులో, చిలవలు పలవలో తప్ప, పూర్తి అసత్యాలేమీ లేవు. పొగ వ్యాపించినమాట నిజమే కానీ నిప్పు అబద్ధం కాదు. అన్నీ, స్వయంగా, కవిత నోటి వెంట వినగలుగుతున్న విశేషాలే! బిఆర్‌ఎస్ పార్టీ అభిమానులకు ఈ పరిణామాలు సహజంగానే బాధ కలిగిస్తున్నాయి. కవితకు పెద్దగా అనుయాయుల బలం ఉన్నదని, ఆమె పార్టీని చీల్చి పెద్ద ఎత్తున నష్టం చేయగలదని వారు అనుకోవడం లేదు కానీ, ‘అనవసర కలకలం’ సృష్టించే శక్తి ఈ వివాదానికి ఉన్నదని వారి భయం. ఈ వివాదంలో ఎవరూ ప్రతిస్పందించవద్దని పార్టీ శ్రేణులను అగ్రనేత కెసిఆర్ ఆదేశించినా, అభిమానులు సామాజిక మాధ్యమాలలో తమ కలవరాన్ని, బాధను, అక్కడక్కడా స్పష్టమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
ఎల్కతుర్తి సభ కు ముందూ ఆ తరువాత, హరీశ్ రావు చుట్టూ కనిపించిన వివాదాస్పద వాతావరణం, ఇప్పుడు కవిత వైపు మళ్లిందనుకోవచ్చును కానీ, చాలా విధాలుగా ఆ పోలిక అంత సరైనది కాదు. ఇద్దరికీ దాదాపు ఒకే రకమైన ఫిర్యాదులు ఉండవచ్చును కానీ, ఇందులో ఏమీ ‘ఉమ్మడి’ వ్యూహం ఉన్నట్టు లేదు. మొదటి లేఖలో హరీశ్ ను మినహాయించినట్టు కనిపించిన కవిత, తాజా విమర్శలలో ఆయనను కూడా ప్రస్తావించారు. కవిత లేఖ, వ్యాఖ్యల నేపథ్యంలో కెసిఆర్ హరీశ్ తో కూడా సంప్రదింపులు చేస్తున్నట్టు వింటున్నాము. బిఆర్‌ఎస్ పార్టీ నుంచి ఒక్క చెప్పుకోదగ్గ వ్యక్తి కూడా కవిత వెంట బహిరంగంగా నిలబడలేదు. ఆమె తన నాయకత్వం కింద నిర్మించుకున్న సింగరేణి ప్రాంత అనుచరగణం కూడా సందేహంలోనే ఉన్నారు తప్ప, స్పష్టతలో లేరు. అయితే గియితే, జాగృతి శ్రేణులు కొన్ని ఆమె వెనుక గట్టిగా నిలబడవచ్చు. ఇప్పటికిప్పుడు ఆమె సొంత బలగం గణనీయంగా లేకపోవచ్చును కానీ, సమీకరించగలిగే శక్తి ఆమెకు, ఆమె ముందుకు తెచ్చే అంశాలకు లేదని అనలేము. హరీశ్ సంగతి వేరు. ఆయనకు సిద్దిపేటలోనూ, పాత మెదక్ జిల్లా అంతటా, రాష్ట్రపార్టీలోనూ సొంత బలం కూడా ఉంది.
మొత్తంగా బిఆర్‌ఎస్ కు రాజకీయంగా గడ్డురోజులు వచ్చినా, తనకు పార్టీలో ఇబ్బందులు వచ్చినా ఆయన సొంత అనుచరులను కాపాడుకుంటూ ఉంటారు. ఆయన ఆచితూచి అడుగులేయడం తన క్షేత్రస్థాయిలో ఉన్న ప్రభావాలను నిలుపుకోవడం కోసమే. ఈటలతో పాత సాన్నిహిత్యం, హరీశ్ బిజెపికి దగ్గర కావడానికి ఉన్న మార్గమని ఇంతకాలం కొందరు వ్యాఖ్యానించగా, అదే హరీశ్-ఈటల సంబంధం ద్వారా కెసిఆర్‌కు, బిజెపికి మధ్య సంప్రదింపులు నడుస్తున్నాయన్న ఆరోపణలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. కవిత తిరుగుబాటు రూపంలో టీకప్పులోనో, లేక, సముద్రంలోనో పుట్టిన తుఫాను, చివరకు, హరీశ్ ను పార్టీ అధినేతకు మరింత దగ్గర చేసింది, కెటిఆర్ విదేశీపర్యటనలో ఉన్న నేపథ్యంలో హరీశ్‌ను కీలకమైన, ఆధారపడదగ్గ నాయకుడిని చేసింది. అదే సమయంలో, కెసిఆర్ తరువాతి స్థానాన్ని ఎప్పుడైనా తాను ఆశించగలిగితే, అందుకు కెటిఆర్ ఒక్కరే గాక, కవిత కూడా పోటీదారు కాగలరన్న తెలివిడి కూడా హరీశ్‌కు వచ్చి ఉండాలి.
కవిత ఆవేదన మీద పూర్తి సానుభూతి ఉన్నవారు కూడా, ఆమె చేసిన ‘ విలీనం’ ఆరోపణను ఒప్పుకోవడం కష్టమే. కుటుంబపార్టీ, ప్రాంతీయ పార్టీ జాతీయపార్టీలో విలీనమయ్యే అవకాశాలు అతి తక్కువ. తనను తాను రద్దుచేసుకుని, పరిహారం కళ్లకద్దుకున్న ‘ప్రజారాజ్యం’ వంటివి మినహాయింపులు. ఆ నాడు ఇచ్చిన మాట ప్రకారం, కాంగ్రెస్‌లో విలీనం కాకపోవడానికి, ఇప్పుడు బిజెపితో అటువంటి ఆలోచన కూడా చేయకుండా ఉండడానికి ప్రాంతీయ/కుటుంబ పార్టీ తర్కమే కారణం. ఇక బిజెపి, పొత్తులో ఉన్నపార్టీలను కబళించే లక్షణాలున్నది. మహారాష్ట్రలో చూశాము. ఒడిశాలో చూశాము. ఆ పార్టీ తన ప్రత్యర్థిగా కాంగ్రెస్ ఉండడాన్నే ఇష్టపడుతుంది తప్ప, ప్రాంతీయపార్టీలను కాదు. సొంతపార్టీలోనే ఇతర జనాకర్షక నాయకులుంటే సహించని బిజెపి అధినాయకత్వం, కెసిఆర్ వంటి నేతలతో సహజీవనం చేయలేదు. పైగా, తెలంగాణ నేల తనకు అనుకూలంగా, పరిపక్వంగా ఉన్నదని అనుకుంటున్నప్పుడు, ఇంకా వారితో వీరితో పొత్తులూ కాలయాపనలు ఎందుకు అన్న విచికిత్స కూడా బిజెపిలో ఉన్నది.
హరీశ్ స్వయంగా ఎప్పుడూ తన వ్యక్తిగత ఆకాంక్షలను చెప్పుకోలేదు కానీ, ఆయన మీద పార్టీ అధినేతకు ఉన్న అనుమానం, కెటిఆర్ వారసత్వానికి పోటీ పడతారేమోనని. కవిత విషయంలో ఇంతకు మునుపు అది లేదు. ఆమె రెండో స్థానానికి పోటీపడుతున్నట్టు ఎప్పుడూ కనిపించలేదు, ఇప్పుడు కూడా అట్లా స్పష్టంగా ధ్వనించడం లేదు. ఆమె అసంతృప్తి, పార్టీలో, అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో, కనీస గుర్తింపు దొరకలేదని మాత్రమే. ఆమెకు మరికొంత చోటును, ఎదగడానికి అవకాశాన్ని ఇస్తే, ఆమె ఈ రోజు మాదిరి మాట్లాడేవారు కాదు. ఆశ్చర్యం ఏమిటంటే, రెండో స్థానం కోసం ఆశపడుతున్నట్టు భావించిన హరీశ్, కెటిఆర్‌కు వారసత్వం అప్పగించినా తనకు అభ్యంతరం లేదని, క్రమశిక్షణతో పనిచేస్తానని విధేయతను పదే పదే ప్రకటించగా, ఇంతకాలం రెండోస్థానాన్ని క్లెయిమ్ చెయ్యని కవిత మాత్రం, కెటిఆర్ నాయకత్వాన్నిసవాల్ చేస్తున్నారు. కెసిఆర్ కింద తప్ప మరెవరి కిందా తాను పనిచేయనని కుండబద్దలు కొడుతున్నారు.
ఏ స్పందనా ఇవ్వకుండా ఇట్లాగే మౌనంగా ఉంటూ, కవిత విసుగు చెంది అదుపు తప్పి మాట్లాడేవరకు చూసి, అప్పుడు కెసిఆర్ ఆమె మీద ఏదైనా చర్య తీసుకోవచ్చు. ఈ సమస్యను పరిష్కరించే పనిని టాస్క్ మాస్టర్ హరీశ్ రావుకు అప్పగించి, ఒక మధ్యేమార్గాన్ని ప్రయత్నించవచ్చు. రెండోది ఫలితం సాధించే అవకాశాలు తక్కువ. ఎందుకంటే, బహుశా, ఇప్పటికే కవిత కెసిఆర్ సహనరేఖను దాటేశారు. తనను పొగుడుతూ, తనకు విధేయత ప్రకటిస్తూ ఉన్నప్పటికీ, కవిత చేస్తున్న విమర్శలు అంతిమంగా తన వ్యవహారసరళి మీదనే అని కెసిఆర్‌కు తెలుసు. చుట్టూ దెయ్యాలు ఉండడం దెయ్యాల తప్పు కాదని, అనుమతిస్తున్న కెసిఆర్ బాధ్యత అందులో ఉందని కవిత అన్యాపదేశంగా చెబుతూనే ఉన్నారు.
బిఆర్‌ఎస్‌లో అంతర్గత సమస్య చివరకు ఎట్లా పరిణమించినప్పటికీ, కవిత ఎక్కుపెట్టిన విమర్శలతో, తెలంగాణ సమాజంలో చాలాకాలంగా ఉన్న, ఆరోపణల వంటి రెండు రకాల అభిప్రాయాలకు కెసిఆర్ కుటుంబం నుంచే సమర్థన వచ్చినట్టయింది. అది ఎక్కువ సమస్యలను తెచ్చిపెడుతుంది. ఒకటి- కెసిఆర్ అందరికీ అందుబాటులో లేరు, అందుకు ఆయన చుట్టూ ఉన్నవారే అడ్డు. రెండు- బిజెపితో ఏదో ఒకరకమయిన బంధానికి బిఆర్‌ఎస్ ప్రయత్నిస్తూ వస్తోంది. మొదటిది ఎక్కువగా పార్టీ అంతర్గత అంశంగా చెప్పుకోవచ్చు. దానితో పాటు, ప్రజలకు అందుబాటులో ఉండరన్న విమర్శలో భాగంగానూ చూడవచ్చు. మంత్రులకు, అధికారపార్టీ శాసనసభ్యులకు కూడా ముఖ్యమంత్రి దర్శనం దొరకదని బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో వినిపించిన విమర్శ, ఒక ఎన్నికల ప్రచార అంశం కూడా అయింది.
చర్చలలో పడి, బిఆర్‌ఎస్ ఒక ఉద్యమం నుంచి, ఉద్యమం కోసం పుట్టిన పార్టీ అని, ప్రజాస్వామికంగా అది నడవాలని, కుటుంబంలోని వారితో పాటు, బయటి వారికి కూడా సమానావకాశాలు ఉండాలని, మనం మరచిపోతున్నాం. కుటుంబంలోనే అందరినీ ఒకేరకంగా చూడనివారు, బయటివారిని ఎట్లా చూస్తారన్న సందేహం కలగవచ్చు. వివక్ష గురించి, అసమానత గురించి అధికారకుటుంబాల లోపల ప్రశ్నలు మొలిచినప్పుడైనా, సమాజంలోని అందరూ ఈ అంశాల గురించి ఆలోచించాలి కదా! కెసిఆర్ కూడా తన తీరుతెన్నులను సింహావలోకనం చేసుకుని, మరింత మెరుగైన నేతగా తనను మార్చుకోవచ్చును కదా?
రెండవది, బిఆర్‌ఎస్ రెండో హయాంలో బిజెపితో తెరచాటు సంబంధాలపై వినిపించిన విమర్శలు. కేంద్రప్రభుత్వ వివాదాస్పద నిర్ణయాలకు బిఆర్‌ఎస్ బేషరతు మద్దతు ప్రకటించడం అందుకు ప్రధాన కారణం. తమ ఎమ్మెల్యేలను కొనడానికి బిజెపి కుట్రచేసిందని కేసులు పెట్టినా, నరేంద్రమోదీ తెలంగాణ వచ్చినప్పుడు ఆయనను కలవకపోవడం, అడపాదడపా తీవ్రమైన విమర్శలు చేయడం- జరిగినా, ప్రజలకు ఎందుకో ఒక చిన్నఅనుమానం మిగిలే ఉండింది. పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి ఎనిమిది స్థానాలు గెలవడం వెనుక, ఉద్దేశ్యపూర్వకంగా జరిగిన బిఆర్‌ఎస్ ఓట్ల బదలాయింపు ఉన్నదని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో, రాష్ట్రంలో అధికారం కోల్పోయిన స్థితిలో, తన ఉనికి కోసం తప్పనిసరిగా బిజెపితో కలసి నడవవలసి వస్తుందన్న ఊహాగానాలు పెరిగాయి. ఏకంగా విలీనం కోసమే ప్రయత్నం జరిగిందని ఇప్పుడు కవిత ఆరోపిస్తున్నారు.
కవిత ఆవేదన మీద పూర్తి సానుభూతి ఉన్నవారు కూడా, ఆమె చేసిన ‘ విలీనం’ ఆరోపణను ఒప్పుకోవడం కష్టమే. కుటుంబపార్టీ, ప్రాంతీయ పార్టీ జాతీయపార్టీలో విలీనమయ్యే అవకాశాలు అతి తక్కువ. తనను తాను రద్దుచేసుకుని, పరిహారం కళ్లకద్దుకున్న ‘ప్రజారాజ్యం’ వంటివి మినహాయింపులు. ఆ నాడు ఇచ్చిన మాట ప్రకారం, కాంగ్రెస్‌లో విలీనం కాకపోవడానికి, ఇప్పుడు బిజెపితో అటువంటి ఆలోచన కూడా చేయకుండా ఉండడానికి ప్రాంతీయ/కుటుంబ పార్టీ తర్కమే కారణం. ఇక బిజెపి, పొత్తులో ఉన్నపార్టీలను కబళించే లక్షణాలున్నది. మహారాష్ట్రలో చూశాము. ఒడిశాలో చూశాము. ఆ పార్టీ తన ప్రత్యర్థిగా కాంగ్రెస్ ఉండడాన్నే ఇష్టపడుతుంది తప్ప, ప్రాంతీయపార్టీలను కాదు. సొంతపార్టీలోనే ఇతర జనాకర్షక నాయకులుంటే సహించని బిజెపి అధినాయకత్వం, కెసిఆర్ వంటి నేతలతో సహజీవనం చేయలేదు. పైగా, తెలంగాణ నేల తనకు అనుకూలంగా, పరిపక్వంగా ఉన్నదని అనుకుంటున్నప్పుడు, ఇంకా వారితో వీరితో పొత్తులూ కాలయాపనలు ఎందుకు అన్న విచికిత్స కూడా బిజెపిలో ఉన్నది. బిజెపితో రాజకీయ అవగాహనకోసం ఒకప్పుడు ప్రయత్నించారన్న మాట కవిత ఆరోపణలతో నిమిత్తం లేకుండా ఎప్పటి నుంచో వినిపిస్తున్నది. ఆ ప్రయత్నం కూడా కవిత ను కేసుల నుంచి తప్పించడానికి చేశారని, బిజెపి విముఖంగా ఉండడంతో పొత్తు తప్పిపోయిందని కూడా చెప్పుకున్నారు.
ఎంతో ముఖ్యమైనవి, సామాజిక ప్రాధాన్యం ఉన్నవి చాలా పరిణామాలు కళ్లెదుట ఉన్నాయి. ఎంతో గొప్పగా చెప్పుకుంటూ, నిరసనల మీద గృహనిర్బంధాల నీళ్లు చల్లుతూ నిర్వహిస్తున్న ప్రపంచసుందరి పోటీలు, అభాసుపాలయ్యాయి, అందులో సౌందర్యాత్మక హింస తప్ప, సంస్కారమేమీ లేదని పోటీదారులే చాటి చెబుతున్నారు. ఈ పోటీల వ్యవహారం నిర్వాహకులకే కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ ప్రతిష్ఠకు కూడా మచ్చ తీసుకువచ్చింది. ఇక గద్దర్ సినిమా అవార్డుల ప్రహసనం. సినిమా అవార్డులకు గద్దర్ పేరుపెట్టడమే అసంబద్ధం. ఇక ఏర్పాటు చేసిన జ్యూరీలలో తెలంగాణ ప్రాతినిధ్యం ఒక ప్రశ్నార్థకం. రేవంత్ రెడ్డికి కానీ, కాంగ్రెస్‌పార్టీకి కానీ, తెలంగాణ స్పృహ ప్రాధాన్యంగా లేదని అవార్డుల ప్రకటన సూచిస్తోంది. తాను తిరస్కరించిన విలువలకు పట్టం గట్టినవి ఉత్తమసినిమాలుగా నిలబడడం తెలంగాణ సమాజానికి ఆవేదన కలిగిస్తున్నది.
ఇప్పుడు కవిత, బిజెపితో సంబంధాలను ఒక సమస్యగా ముందుకు తేవడం, తెలంగాణ రాజకీయాలకు, బిఆర్‌ఎస్‌కు కూడా మంచిదే. ప్రగతిశీల ఆలోచనలు కలిగినవారి పక్షాన తను ఉండదలచినట్టు ఆమె చేసిన సూచనలు కూడా మంచివే. పార్టీలోనే కొనసాగితే, ఆమె భావాలు ఒత్తిడి తేగలుగుతాయి. లేక, బయటకు వెళ్లవలసి వస్తే, బిజెపియేతర శక్తులకు మరొకరు తోడవుతారు. అట్లాగే, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లో కార్యశూరత్వం లేదని, తన లాగా ప్రజాసమస్యల మీద పనిచేయడం లేదని ఆమె చేసిన విమర్శలో నిజానిజాలు ఎట్లా ఉన్నా, ఆమె నుంచి రానున్న రోజులలో కొన్ని ప్రజానుకూల కార్యాచరణలను ఆశించవచ్చు.
కల్వకుంట్ల కవిత రాజకీయాలలోకి వచ్చిన తొలిరోజులలోనే, తనకంటూ ఒక ప్రత్యేక కార్యరంగాన్ని ఎంచుకుని అందులో పనిచేస్తూ వచ్చారు. అదే ఆమెను అధికారముఖ్యకేంద్రానికి దూరంగా ఉంచడానికి అధినేతకు ఆస్కారం ఇచ్చి ఉండాలి. తక్కిన కుటుంబసభ్యుల వలెనే ఆమెకు కూడా వాగ్ధాటి ఎక్కువ. పార్లమెంటు సభ్యురాలిగా ఆమె మంచి వక్తృత్వాన్ని ప్రదర్శించారు. కొన్ని ఇతర ఆరోపణలు రాకపోలేదు కానీ, లిక్కర్ కుంభకోణం ఆమెను బోనులో నిలబెట్టింది. కనిమొజి విషయంలో కరుణానిధి పోషించిన సంరక్షక బాధ్యత, కవిత విషయంలో కెసిఆర్ నిర్వహించినట్టు కనిపించదు. పైగా, ఆమె వల్లనే పార్టీకి చెడ్డపేరు వచ్చిందన్న అభిప్రాయం పార్టీలో వ్యాపించింది. పెద్దపెద్ద కుంభకోణాలలో పేర్లు వినిపించిన ప్రభుత్వ పెద్దలు క్షేమంగా, ప్రతిష్ఠతో కొనసాగుతుండగా, తానొక్కరే బలిపశువు అయ్యానని ఆమె అనుకున్నారు. కెసిఆర్ తో కోపంతోనే కదా, బిజెపి తనను ఖైదు చేసింది? అన్నది ఆమె ప్రశ్న.
ఈటలతో పాత సాన్నిహిత్యం, హరీశ్ బిజెపికి దగ్గర కావడానికి ఉన్న మార్గమని ఇంతకాలం కొందరు వ్యాఖ్యానించగా, అదే హరీశ్-ఈటల సంబంధం ద్వారా కెసిఆర్‌కు, బిజెపికి మధ్య సంప్రదింపులు నడుస్తున్నాయన్న ఆరోపణలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. కవిత తిరుగుబాటు రూపంలో టీకప్పులోనో, లేక, సముద్రంలోనో పుట్టిన తుఫాను, చివరకు, హరీశ్ ను పార్టీ అధినేతకు మరింత దగ్గర చేసింది, కెటిఆర్ విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో హరీశ్‌ను కీలకమైన, ఆధారపడదగ్గ నాయకుడిని చేసింది. అదే సమయంలో, కెసిఆర్ తరువాతి స్థానాన్ని ఎప్పుడైనా తాను ఆశించగలిగితే, అందుకు కెటిఆర్ ఒక్కరే గాక, కవిత కూడా పోటీదారు కాగలరన్న తెలివిడి కూడా హరీశ్‌కు వచ్చి ఉండాలి.
కుటుంబసంస్థ తర్కానికి లోపల, కవిత కు జరిగిన న్యాయాన్యాయాల గురించి చర్చించలేము. మన కుటుంబాలు పురుషాధిక్య, పురుషవారసత్వ సంస్థలని కూడా గుర్తుపెట్టుకోవాలి. మనది, కుమారులను, కుమార్తెలను సమానంగా చూసే సంప్రదాయం కాదు. ఇక పెద్ద పెద్ద పేట్రియార్క్ లు ఆ వివక్షను మరింత ప్రస్ఫుటంగా, సగర్వంగా పాటిస్తారు. కెసిఆర్ కు స్త్రీపురుష సమానత్వం మీద ఎటువంటి అభిప్రాయాలున్నాయో చెప్పలేము కానీ, ఆయన ఒక్క మహిళామంత్రి లేకుండా ఏళ్లతరబడి ప్రభుత్వాన్ని నడిపారని తెలుసు. హైకోర్టు చెప్పేదాకా మహిళా కమిషన్ చైర్ పర్సన్ ను నియమించలేదని తెలుసు. సమానహక్కుల కోసం కవిత పోరాడడం ఆహ్వానించదగ్గదే. ఆశలు కలిగి ఉండడానికి తక్కినవారికి ఉన్నట్టే ఆమెకూ అన్ని యోగ్యతలూ ఉన్నాయని చెప్పుకోవచ్చు.
ఈ చర్చలలో పడి, బిఆర్‌ఎస్ ఒక ఉద్యమం నుంచి, ఉద్యమం కోసం పుట్టిన పార్టీ అని, ప్రజాస్వామికంగా అది నడవాలని, కుటుంబంలోని వారితో పాటు, బయటి వారికి కూడా సమానావకాశాలు ఉండాలని, మనం మరచిపోతున్నాం. కుటుంబంలోనే అందరినీ ఒకేరకంగా చూడనివారు, బయటివారిని ఎట్లా చూస్తారన్న సందేహం కలగవచ్చు. వివక్ష గురించి, అసమానత గురించి అధికారకుటుంబాల లోపల ప్రశ్నలు మొలిచినప్పుడైనా, సమాజంలోని అందరూ ఈ అంశాల గురించి ఆలోచించాలి కదా! కెసిఆర్ కూడా తన తీరుతెన్నులను సింహావలోకనం చేసుకుని, మరింత మెరుగైన నేతగా తనను మార్చుకోవచ్చును కదా? అట్లాగే, ఈ ఇంటిచిచ్చు బిఆర్‌ఎస్ ను బలహీనపరిస్తే, అది తెలంగాణకు ఏమంత క్షేమం కాదు. బిఆర్‌ఎస్ ఉండాలి. బలంగా ఉండాలి. తిరిగి ప్రజల ఆదరణ సంపాదించుకోవాలి.




