చెమ్మ: – వారాల ఆనంద్
నందిని సిధారెడ్డి తెలంగాణ నేలలో పుటిన కవి. అదే నేల శ్వాసను అక్షరాల్లో నింపిన కవి కూడా. ఆయన కవిత్వం ఆ ప్రాంతపు చరిత్ర, అక్కడి ప్రజల సంఘర్షణకు ప్రతిధ్వనీ ప్రతిబింబం. పల్లె జీవితం, రైతు బాట, దుమ్ము, దూళి చెరువు, బీడు ఇవన్నీ ఆయన పొందిన బాల్యానుభవాలే కాదు, ఆ తర్వాతి కాలంలో ఆయన కవిత్వానికి మూలాధారాలు కూడా అయ్యాయి. యువకుడిగా ఉన్నప్పుడే కవిత్వం వైపు ఆకర్షితుడయ్యారు. వాస్తవంగా చెప్పాలంటే ఆయన కవిత్వం కేవలం పుస్తకాల నుంచి కాకుండా, జీవితం నుంచి పుట్టింది. నందిని సిధారెడ్డి 1955 జూన్ 12న బందారంలో పుట్టారు పుట్టారు. తండ్రి బాల సిద్ధారెడ్డి, తల్లి రత్నమాల. ఆయన తండ్రి బాల సిద్ధారెడ్డి ఆ రోజుల్లో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్టు యోధుడు. నందిని సిధారెడ్డి హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. పూర్తి చేసి, ‘ఆధునిక తెలుగు కవిత్వంలో సూర్యుడు’ అంశంపై ఎం.ఫిల్, తర్వాత ‘ఆధునిక కవిత్వం, వాస్తవికత, అధివాస్తవికత’ అంశంపై పరిశోధన చేసి పి.హెచ్.డి పట్టా పుచ్చుకున్నాడు. యూనివర్సిటీలో వున్నప్పుడే పలువురు కవి మిత్రులతో కలిసి ఉస్మానియా రైటర్స్ సర్కిల్ పేర పలు కార్యక్రమాలు చేసారు. ఆ రోజుల్లోనే ఆయన కవిత్వం ఉద్యమ రూపం అందుకుంది. అనంతర కాలంలో ఆయన ‘భూమిస్వప్నం’, ‘సంభాషణ’, ‘దివిటీ’, ’ప్రాణహిత’, ‘ఒక బాధ కాదు’, ‘నది పుట్టుబడి’, ‘ఇగురం’, ‘ఆవర్థనం’, ‘నాగేటి చాల్లల్ల’ (పాటలు), ‘ఇక్కడి చెట్లగాలి’, ‘చిత్రకన్ను’ (కథాసంపుటి), ’అనిమేష’ (దీర్ఘకవిత) లాంటి అనేక రచనలు వెలువరించారు.
నందిని సిధారెడ్డికి కవిత్వం అంటే కేవలం భావాల ఆట కాదు అది జీవన ప్రతిబింబం. ఆయన రచనల్లో ప్రధానంగా తెలంగాణ భూభాగం, పల్లె జీవితం, ఉద్యమ చైతన్యం, అణగారిన వర్గాల స్వరం, భాషా స్వాభిమానం, సామాజిక అన్యాయంపై ప్రతిఘటన కనిపిస్తాయి. నిజానికి ఆయన కవిత్వం “అభివ్యక్తి” మాత్రమే కాదు ఒక న్యాయమయిన స్పందన. ఆయన వాక్యాలు గుండెల్లోంచి వస్తాయి, అందుకే అవి పాఠకుడికి నేరుగా చేరుతాయి. నందిని సిధారెడ్డి వ్యక్తిత్వం కూడా ఆయన కవిత్వంలాగే సూటిగా స్పష్టంగా మొహమాటం లేకుండా వుంటుంది. లోపలి మాటల్ని లోపలే దాచుకునే మనస్తత్వం కాదు ఆయనది. ఎదుటివారు నొచ్చుకుంటారని కూడా ఆలోచించని తనం ఆది. ఉన్నదేదో ఉన్నట్టు మాట్లాడే ఆ తత్వం తెలంగాణా పల్లెది. ఆయన సాదాసీదా జీవితం గడపడానికి ఇష్టపడతాడు. ప్రజలతో మమేకం కావడానికే కాదు తెలంగాణా భాషపై ఎంతో ప్రేమతో ఉంటాడు. ఆయన జీవితం, కవిత్వం రెంటి నడుమా పెద్ద తేడా లేదు రెండూ ఒకటే ప్రవాహం. ఆయనది మంజీరా రచయితల సంఘం, తెలంగాణా రచయితల వేదికల రూప నిర్మాణాలలో ముఖ్యమయిన పాత్ర. తర్వాత రచయితల సంఘం ఏర్పాటు చేసారు. సభలు సమావేశాలు ఆయన జీవితంలో ముఖ్య భాగం అయిపోయాయి. అదే ఆయన బలం బలహీనత కూడా. తెలంగాణా రాష్త్రం ఏర్పాటయిన తర్వాత సాహిత్య అకాడెమి అధ్యక్షుడిగా వున్నారు. ఆయనకు కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డును తెచ్చిన దీర్ఘ కవిత ‘అనిమేష’.
“అనిమేష” గురించి చెప్పుకుంటే- “Don’t mingle, Always single, When carelessness increases , Population decreases” అన్నాడో ఆంగ్లకవి. ఆ పరిస్థితిలో డాక్టర్ నందిని సిధారెడ్డి “అనిమేష” కావ్యం రాసాడు. “చూసావా ఇవ్వాళ / లోకాన్ని ఆవరించిన చీకటికి / ప్రహారీ గోడల్లేవు / అలుపెరుగకుండా విస్తరిస్తున్న చీకటికి / సరిహద్దుల్లేవు / శవాల్ని బుజానేసుకుని నిలబడ్డ / ఈ చీకటి ఎక్కడ మొదలయిందో తెలీదు / పట్టుకుందామంటే దొరకదు / ఎన్ని వలలు విసిరీ దొరక బుచ్చుకోలేము / అదంతే కడుపు చించుకుంటే కాళ్ళ మీద బడుతుంది’’ సరిగ్గా ఇదీ ఇవ్వాల్టి ప్రపంచ పరిస్థితి. బహుశా మానవాళి ఎన్నడూ కనీసం వూహించనయినా ఊహించని స్థితి. అది కరోనా రక్కసి దాడి. ఒక ప్రాంతమని కాదు ఒక మనిషని కాదు యావత్తు ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన మహమ్మారి కోవిడ్.
డాక్టర్ నందిని సిధారెడ్డి రాసిన మంచి దీర్ఘకవిత ‘అనిమేష’, ఇది ఉపద్రవగాధ కావ్యం. ఆశ్చర్యం ఇవ్వాళ లోకమంతా మాటలో, చూపులో, చేతలో, ఆలోచనలో, మనసులో, మమతలో హ్రస్వమవుతున్న వేళ సిధారెడ్డి దీర్ఘకవిత రాసారు. బహుషా తన ఆవేదనకు, తనఉద్వేగానికీ, తననుతాను వ్యక్తీకరించడానికి సరిపోయే కాన్వాస్ కోసం దీర్ఘకవితను ఎంచుకున్నారాయన. ప్రపంచాన్ని కోవిడ్19 కుదిపేసిన వేళ సిధారెడ్డి మనిషిగా కవిగా పడ్డ వేదన అక్షర రూపం దాల్చిన కావ్యం ఇది.
ఒక చోట బెర్టోల్ట్ బ్రేక్ట్ ( Bertolt Brecht) ఇలా అంటాడు “Will there be singing in bad times? Yes, singing about dark times”. అంతేకాదు ఇంకో చోట James Joyce రచయితల గురించి ఇట్లా అంటాడు “Squeeze us, we are olives” అంటాడు. దుఃఖకాలంలో సృజనకారులు ఎంతగా వేదన చెందుతారో ఎంత దుఖంతో తమను తాము వ్యక్తంచేస్తారో మనకు అర్థం అవుతుంది. అందుకే సిధారెడ్డి తన అనిమేష కావ్యంలో-
“ఎక్కడో ఎక్కడెక్కడో లోలోన కలుక్కుమంటున్న కన్నీటి స్థితి, దుస్థితి. ఎన్ని దృశ్యాలో ఎన్ని దుఖాలో, ఎన్నెన్ని భయాలో, అనుమానాలో, ఆలోచనలో కుదుపుతుంటే అవన్నీ పదాల్లోకి వొంపుదామని ఈ కావ్యం” అన్నాడు. అన్నట్టుగానే ‘అనిమేష’ ఆద్యంతం ఒక వూపులో గాధలు గాధలుగా సాగింది. ‘నిశ్శబ్దం నివ్వెరపోయింది / సముద్రం సరాయించింది / అరచేతి స్వర్గం హఠాత్తుగా కూలిపోయింది’ అంటూ ఆరంభమయి 19 గాధలుగా ఆవిష్కృతమయింది
సిధారెడ్డి తత్వ గాధలో ఇట్లా అంటాడు, ‘కాలం మాయాజాలం / కరుణ ఒకసారి / కఠినం ఒకసారి / అంతుబట్టనిది కాలం.’ అంతేగాదు- ‘గాలి లేనిదే దీపం వెలగదు / గాలి పెరిగితే దీపం మిగలదు’ అని కూడా అంటాడు. ఇట్లా అనిమేష కావ్యం సాగుతూ సాగుతూ ‘బతుకు / బతికించు / బతకనివ్వు’ అంటుంది. అనిమేష కావ్యం దుఃఖ కాలం గురించి దుర్మార్గ కాలం గురించి ఒక కవి, ఒక మనిషి పడ్డ వేదనను ఆవిష్కరించింది. ఇది మంచి దీర్ఘకవితను రాసి నందిని సిధారెడ్డి తన స్వరాన్ని మరింత కవితాత్మకంగా వినిపించాడు.