( మండువ రవీందర్‌రావు )
గత వారంరోజులుగా కాంగ్రెస్ పార్టీలో పెద్ద గందరగోళాన్ని సృష్టించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళిధర్‌రావు ఎపిసోడ్ చివరకు నీటి బుడగలా తేలిపోనుందా అంటే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మాటలు అవుననేవిధంగా ఉన్నాయి. వరంగల్ జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల మధ్య నెలకొన్న విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. పార్టీలో కొండా దంపతులైనా ఉండాలి, తామైనా ఉండాలన్న స్థాయిలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఒకటి కాగా, తాము ఎవరికీ భయపడేదిలేదంటున్న కొండా మురళి వివాదం రాష్ట్రాన్ని దాటి కేంద్రంలోని అధిష్టానం దృష్టికి వెళ్ళడంతో జిల్లాలో కాంగ్రెస్‌కు ఇక గడ్డుకాలమే ఎదురయ్యేట్లుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయం పై శుక్రవారం సమావేశమైన పార్టీ క్రమశిక్షణా కమిటీ పార్టీ జిల్లా అద్యక్షుడు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డిని పిలిచి వరంగల్‌లో పార్టీ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
అలాగే కొండాపై అధిష్టానానికి ఫిర్యాదు చేసిన అయిదుగురు ఎమ్మెల్యే లతోనూ మాట్లాడేందుకు వారికి కబురు చేసినట్లు తెలుస్తున్నది. క్రమశిక్షణా కమిటి ముందు హాజరైన నాయిని రాజేందర్‌రెడ్డి మాత్రం అది చాలా చిన్న విషయమని తేల్చిపారేశారు. అందరూ అనుకున్నట్లు ఎవరూ ఎవరిమీద ఫిర్యాదు చేయలేదని, చిన్న చిన్న అభిప్రాయభేదాలు చోటుచేసుకున్నాయని, అది ఏ పార్టీలోనైనా సహజంగా వొచ్చేవేనని, వాటిని బూతద్దంలో చూడాల్సిన పనిలేదని మీడియా ముందు పేర్కొనడాన్ని బట్టి ఇరువర్గాలను శాంతపరచి పంపే ఆలోచనలోనే అధిష్టానం ఉన్నట్లు స్పష్టమవుతున్నది. ఈ అభిప్రాయభేదాలు నీటి బుడగలాంటివని, అవి కూర్చుని మాట్లాడుకుంటే సమసిపోయేవంటూనే, ఎంతటివారైనా పార్టీ అధిష్టానం ఆదేశాలకు లోబడే పనిచేయాల్సి ఉంటుందని ఆయన చివరలో ఇచ్చిన ముక్తాయింపు కొండా మురళి ఎపిసోడ్ అందరూ ఊహించినట్లు కాకుండా నాయకుల మధ్య సయోధ్య కుదిర్చే అవకాశాలున్నట్లు స్పష్టమవుతున్నది.

వరంగల్‌లో గత నెల 19న రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకల సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో పెద్ద సంచలనానికి కారణమైనాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్‌లోని ఆ పార్టీ ఎమ్మెల్యే లకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. ప్రధానంగా ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్‌రెడ్డిని టార్గెట్ చేయగా, ఎమ్మెల్యేలు కెఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ, ఎంపీ కడియం కావ్య, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, కాంగ్రెస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తదితరులు కొండా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు వారు ఒకటికి రెండుసార్లు పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సమావేశమై చాలకాలంగా తామంతా కొండా దంపతులతో విసిగిపోతున్నామని, వారిపైన చర్యలు తీసుకోవాలంటూ పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, ఏఐసిసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షీ నటరాజన్‌తోపాటు టిపీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లురవికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో కొండా దంపతులు కూడా తమ నుండి సహాయం పొందినవారే తమమీద ఫిర్యాదు చేస్తున్న విషయాన్ని అధిష్టానానికి అర్థమయ్యేరీతిలో ఆరుపేజీల సుదీర్ఘ లేఖలో వివరించడంతో ఈ వివాదం కాంగ్రెస్ పెద్దలకు పెద్ద తలనొప్పిగా తయారైంది.
దీనిపై క్రమశిక్షణా కమిటి శుక్రవారం సమావేశం ఏర్పాటు చేసి వాస్తవ పరిస్థితిని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే , హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డిని అడిగి తెలుసుకున్న క్రమంలో నాయిని మీడియా ముందు పై విధంగా స్పందించారు. వాస్తవానికి రాష్ట్ర కాంగ్రెస్ రెండు మూడు రోజులుగా చాలా బిజీబిజీగా ఉంది. శుక్రవారం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే రాష్ట్రానికి రావడాన్ని పురస్కరించుకుని ఏర్పాట్లలో తనమునకలై ఉంది. కాగా, కొండా దంపతులపై ఫిర్యాదులు చేసిన ఆయిదుగురు ఎమ్మెల్యేలు పార్టీ క్రమశిక్షణా కమిటిపై తీవ్రంగా ఒత్తిడి తేవడంతో ఈ నెల 5వ తేదీలోగా తమకు వొచ్చిన ఫిర్యాదులపై వివరణ ఇవ్వాల్సిందిగా క్రమశిక్షణ కమిటి చైర్మన్ మల్లు రవి కొండా మురళిని కోరారు.

కాగా క్రమశిక్షణాకమిటి చైర్మన్ మల్లు రవి శుక్రవారం దీనిపై ముందస్తుగా నాయిని రాజేందర్‌రెడ్డితో విచారణ ప్రారంభించినప్పటికీ, మల్లిఖార్జున ఖర్గే రాష్ట్రంలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఈ విచారణను సోమవారానికి వాయిదా వేశారు. ఏదిఏమైనా నాయిని రాజేందర్‌రెడ్డి చెప్పినట్లు కొండా ఎపిసోడ్‌ను కాంగ్రెస్ అధిష్టానం కాఫీకప్పులో తుఫాన్‌లా కొట్టిపారేసే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే త్వరలో రానున్న స్థానిక ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నది. ఎట్టిపరిస్థితిలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలని శుక్రవారం రాష్ట్రానికి విచ్చేసిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే పార్టీ నాయకత్వానికి సూచించారు కూడా. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ధీటుగా ఎదుర్కునేందుకు బిఆర్‌ఎస్, బిజేపిలు కూడా సిద్ద మవుతున్న తరుణంలో నాయకుల విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టకపోతే స్థానిక ఎన్నికలపై దీని ప్రభావంపడే అవకాశాలు లేకపోలేదు.





