గిరిజన రైతుల కోసం సౌర విద్యుత్ పంపుసెట్లు అందిస్తున్నాం..
అభివృద్ధి కార్యక్రమా కోసం అటవీ చట్టాలను సంస్కరించాలి
పంచాయితీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క
కేంద్ర పథకాలపై సౌత్ ఈస్ట్ జోన్ రాష్ట్రాల సమీక్ష సమావేశం
హైదరాబాద్ తాజ్ డెక్కన్ హోటల్ లో పిఎం. జన్మన్, ధర్తి ఆబ జన జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ అనే కేంద్ర పథకాలపై సౌత్ ఈస్ట్ జోన్ కు చెందిన రాష్ట్రాల సమావేశం జరిగింది. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఛత్తీస్‌గఢ్, ఒడిషా, తెలంగాణ రాష్ట్రాల గిరిజన సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ ఎస్డీఎఫ్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడంతో పాటు రాష్ట్ర గిరిజనులకు ప్రత్యేకంగా 22 వేల పై చిలుకు పక్కా గృహాలను కట్టిస్తోందని చెప్పారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా “ఇందిరా సౌర గిరి జల వికాసం” పథకం పేరిట పోడు భూముల పట్టాలు పొందిన గిరిజన రైతుల భూములను సేద్యం చేసుకునేందుకు వీలుగా సౌర విద్యుత్ – పంపుసెట్లను అందించడం ద్వారా నీటి పారుదల వసతులను కల్పిస్తున్నదని తెలిపారు.
గిరిజనులు అడవిలోనే నివసిస్తారు కాబట్టి వారి అభివృద్ధి కోసం చేపట్టే కార్యక్రమాలను అడ్డుకోకుండా అటవీ చట్టాలను సంస్కరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ పి.ఎం. జన్మన్, ధర్తి ఆబ జన జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ స్కీములలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని, ఆ దిశలో పయనిస్తున్నామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలుపరుస్తున్న ప్రతి పథకం ఫలితాలు అడవుల్లో జీవిస్తున్న ప్రతి గిరిజనుడికి అందుతుందని అన్నారు. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి మనీష్ ఠాకూర్ పాల్గొని రాష్ట్రాల్లో పథకాల అమలు తీరును సమీక్షించడంతో పాటు ఆయా పథకాలను ఇంకా సమర్థవంతంగా ఎలా అమలుపరచాలో పలు సూచనలు చేశారు. తెలంగాణలో అమలు జరుగుతున్న పథకాలను ప్రశంసించారు.
కార్యక్రమాన్ని తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎ.శరత్ సమన్వయం చేయగా, ట్రైఫైడ్ ఎండీ హృదేశ్ కుమార్, ఛత్తీస్ఘడ్ గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సోన్ మోని బోరొ, ఒడిశా గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు పోమ తుడు, తెలంగాణ ఐటీడీఏల ప్రాజెక్టు ఆఫీసర్లు, తెలంగాణ 17 డిపార్ట్మెంట్ల ఉన్నతాధికారులు, గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు వి.సర్వేశ్వర్ రెడ్డి, ఛీప్ ఇంజనీర్ శంకర్, జీసీసీ జీఎం వి.సీతారాం, టీసీఆర్ టీఐ డైరెక్టర్ డా. వి.సముజ్వల పాల్గొన్నారు.





