కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18: తమ నాయకుడు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో గిగ్ వర్కర్స్ సంక్షేమానికి ప్రత్యేక పాలసీ రూపొందిస్తున్నామని రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ చెప్పారు. ఈ పాలసీపై త్వరలో సదస్సు నిర్వహిస్తామన్నారు. బుధవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మిక, మైనింగ్ శాఖల అభివృద్ధికి తన శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. మంత్రిగా తనకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, తమ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. తమ తండ్రి వెంకటస్వామి, అన్న గతంలో నిర్వహించిన కార్మిక శాఖనే తనకు కేటాయించడం పట్ల సంతోషంగా ఉందన్నారు. మంత్రి పదవి ద్వారా మరోసారి కార్మిక, బలహీనవర్గాలకు సేవ చేసే అదృష్టం లభించిందంటూ తాను ప్రాతినిధ్యం వహించే చెన్నూరు/పెద్దపల్లి నియోజకవర్గంలో కూడా సింగరేణి మైనింగ్‌తోపాటు వేలాదిమంది కార్మికులు ఉన్నారని, వీరితోపాటు రాష్ట్రంలో ఉన్న కార్మికుల సంక్షేమానికి సాధ్యమైనంత మేరకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న కార్మిక సంక్షేమ పథకాలు, చట్టాలను పటిష్టంగా అమలు చేసి కార్మికులకు అండగా ఉంటానని తెలిపారు. ఇసుకను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకు మంచి పాలసీ రూపొందిస్తున్నామని వివరించారు. టాటా టెక్నాలజీస్‌తో కలిసి ఐటీఐలలో స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించిన మొదటి ఫైల్‌పౖౖె సంతకం. రూ.2076 కోట్ల వ్యయంతో 46 అడ్వాన్స్‌డ్ కొత్త కోర్సులు ప్రారంభిస్తున్నామని వివరించారు. ఇవి దేశంలోనే రోల్ మోడల్‌గా ఉంటాయని వివేక్ చెప్పారు.





