సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి

– ములుగు జిల్లాలో రెండో పంటకు నీరందించడమే లక్ష్యం
– భూ సేకరణ వేగవంతం చేసి పనులు త్వరగా పూర్తిచేయాలి
– ఆదేశాలు జారీ చేసిన మంత్రులు ఉత్తమ్, సీతక్క, పొంగులేటి

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 4: ములుగు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి రైతులకు త్వరితగతిన నీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని ముగ్గురు మంత్రులు ఆదేశించారు. జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రాధాన్యతగా తీసుకుని వేగంగా పూర్తి చేస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క, వరంగల్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. భూ సేకరణకు సంబంధించి 15 రోజుల్లో అంచనాలు, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో కొనసాగుతున్న ప్రధాన ప్రాజెక్టుల పనుల స్థితిగతులు, నిధుల వినియోగం, అడ్డంకులపై మంత్రులు సచివాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. ములుగు నియోజకవర్గ పరిధిలో 1,10,632 ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా సాగునీటి ప్రాజెక్టులు అమలులో ఉన్నాయని అధికారులు వివరించారు. దేవాదుల, ఎస్సారఎస్పీ స్టేజ్-1, రామప్ప-పాకాల లిఫ్ట్ ఇరిగేషన్, సమ్మక్క సారలమ్మ ప్రాజెక్టు, పోట్లాపూర్ ఎత్తిపోతల, పాలెం వాగు ప్రాజెక్టు, మోడికుంట వాగు, ఫ్లడ్ బ్యాంకులు తదితర పనుల స్థితిగతులపై సమీక్షించారు. అవసరమైన అనుమతులు త్వరితగతిన మంజూరు చేస్తామని, అన్ని ప్రక్రియలు పూర్తయితే పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రులు తెలిపారు. భూములు కోల్పోయే రైతులకు అమోదయోగ్యమైన మంచి ప్యాకేజీ అందించి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. స్వయంగా తామే రైతుల వద్దకు వెళ్లి భూ సేకరణ ప్రక్రియ చేపడతామని మంత్రులు స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వం అని, రామప్ప-లక్నవరం ఇంటర్ లింకింగ్ పనులకు అదనపు నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. జిల్లా అధికార యంత్రాంగం, ఇరిగేషన్ శాఖలు సమన్వయంతో పనిచేసి ములుగు రైతులకు త్వరితగతిన సాగునీరందించాలని ఆదేశించారు. దేవాదుల ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణపై 15 రోజుల్లో మరోసారి ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు. సమ్మక్క-సారలమ్మ ప్రాజెక్టు విషయంలో ఛత్తీస్‌గఢ్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోందంటూ అక్కడ ముంపు బాధితులకు తగిన పరిహారం చెల్లించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. పెండింగ్ పనుల జాప్యంపై కాంట్రాక్టర్లపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. పనుల కొనసాగింపులో ఇబ్బందులుంటే వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలన్నారు.

రెండో పంటకూ సాగు నీరందించడమే ప్రధాన లక్ష్యం : మంత్రి సీతక్క

అనంతరం మంత్రి సీతక్క తన ఛాంబర్‌లో ములుగు పరిధి ఇరిగేషన్ ప్రాజెక్టుల పనుల వేగవంతంపై అధికారులతో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. వాటి పురోగతిపై ప్రతి వారం నివేదిక సమర్పించాలని ఆదేశించారు. గత పాలకుల నిర్లక్ష్యంతో ములుగు తలాపున గోదావరి ప్రవహిస్తున్నప్పటికీ నీటిని వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో రెండో పంటకు సాగునీరందించడమే లక్ష్యంగా అధికారులు కృషి చేయాలని స్పష్టం చేశారు. ప్రతి వాగులో ఏడాది పొడవునా నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైనచోట చెక్‌డ్యామ్‌లు నిర్మించి సాగు, తాగునీటి అవసరాలు తీర్చాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ప్రతిపాదించిన సాగునీటి పనులను సమయానికి పూర్తిచేసి ములుగును సస్యశ్యామలం చేస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. సమావేశానికి ములుగు కలెక్టర్ టీఎస్ దివాకర్, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు, జిల్లా ఇరిగేషన్ అధికారులు హాజరయ్యారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *