దానం అనర్హత పిటిషన్ పై స్పీకర్ విచారణ

– కౌశిక్ రెడ్డి పిటిషన్ ఆధారంగా క్రాస్ ఎగ్జామిన్
– సమయం కోరిన బీజేపీ నేత మహేశ్వరెడ్డి
– 18న విచారణకు హాజరు కావాలని గడువు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 30 : పార్టీ ఫిరాయింపు కేసులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విచారణ పూర్తయ్యింది. దానంపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి వేసిన పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ చేపట్టారు. ముందుగా పాడి కౌశిక్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. దానం తరఫున న్యాయవాదులు కౌశిక్ రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఈ క్రమంలో తన వద్ద ఉన్న ఆధారాలను స్పీకర్‌కు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అందజేశారు. బీఆర్‌ఎస్ నుంచి దానం పోటీ చేసి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందడం, ఆ తరువాత కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయడం, దానం ప్రచార ఫొటోలు, వీడియోలు.. దానం కాంగ్రెస్ కండువా వేసుకున్న ఫొటోలను స్పీకర్ ముందు ఉంచారు పాడి కౌశిక్ రెడ్డి. దానం అనర్హత పిటిషన్‌పై సాక్ష్యాలను మహేశ్వర్ రెడ్డి అఫిడవిట్ రూపంలో దాఖలు చేశారు. ఆయన తరఫు న్యాయవాదులు స్పీకర్ ముందు హాజరయ్యారు. నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించేందుకు ఎవిడెన్స్ అఫిడవిట్‌ను పొందుపరిచానని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తాను వ్యక్తిగతంగా హాజరుకాలేనని తెలిపారు. ఫిబ్రవరి 20 తరువాత సమయం ఇస్తే తాను విచారణకు వ్యక్తిగతంగా హాజరవుతానని అఫిడవిట్‌లో మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. దీంతో బీజేపీ పిటిషన్‌పై ఫిబ్రవరి 18న స్పీకర్ విచారించనున్నారు. ఇక పార్టీ ఫిరాయింపుల కేసు కీలక దశకు చేరుకుంది. ఇప్పటివరకూ పదిమంది ఎమ్మెల్యేలపై ఆరోపణలు రాగా ఎనిమిది మందికి సంబంధించిన విచారణ పూర్తి అయ్యింది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి విచారణ జరగాల్సి ఉండగా దానంను స్పీకర్ విచారించారు. దానం చెప్పే విషయాలను స్పీకర్ పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. గతంలో ఎనిమిదిమంది ఎమ్మెల్యేల విచారణ సమయంలోనూ ఇదే జరిగింది. విచారణ సమయంలో ఏ పార్టీలో ఉన్నారనే విషయాన్ని ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కుంటున్న ఎమ్మెల్యేలను స్పీకర్ ప్రశ్నించగా వారంతా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నామని సమాధానం ఇచ్చారు. ఇక దానం కూడా మొన్నటి వరకు తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని, అవసరమైతే ఉపఎన్నికకు వెళ్లేందుకు సిద్ధమని ప్రకటించారు. అయితే రెండ్రోజులుగా దానం యూటర్న్ తీసుకున్నారు. తాను బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని, పార్టీకి ఇంకా రాజీనామా చేయలేదని చెబుతున్నారు. స్పీకర్ తనపై అనర్హత వేటు వేస్తే ఉప ఎన్నికకు సిద్ధమని పదేపదే చెబుతున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *