‘రాజా రవి వర్మ’, ‘రాజా దీన్‌ దయాళ్‌’, – ఈ ఇద్దరు కలిసిన వారసత్వం ‘‘రవివర్మ’’ నారాయణ

 కాకతీయ కలగూర గంప – 14

‘ రాజా రవివర్మ ‘ కాన్వాస్‌ నూ, బ్రషునూ, రంగులనూ ఉపయోగించిన ఒక మహోన్నత పెయింటర్‌. ‘రాజా దీన్‌ దయాళ్‌’’ కెమెరానూ,ఫోటో ఫిల్ములనూ, లెన్సులనూ ఉపయోగించిన అద్భుత ఫోటోగ్రాఫర్‌. ఇద్దరికీ ‘రాజా’ అనేది బిరుదైనా, ఇద్దరూ వారి వారి కళాత్మక పనిలో నిజమైన ‘రాజులే’. ఇద్దరూ తమ తమ రంగాలలో 19 వ శతాబ్దపు మహారాజులే! ఈ ఇద్దరి ప్రస్ఠానం తర్వాత ఇద్దరి వృత్తి కళారంగ నైపుణ్యాన్ని కలిపి పుణికి పుచ్చుకున్న మహా కళాకారుడు – ఒక గొప్ప పెయింటర్‌, ఒక ఉత్తమ ఫోటోగ్రాఫర్‌ గత శతాబ్దం చివరి వరకు మన మధ్యనే తిరుగాడిన, వరంగల్‌ కు సంబంధించినంత మటుకు దాదాపు అందరికీ తెలిసిన రవివర్మ ఫోటో స్టూడియో యజమాని బిట్ల నారాయణ గారు.

కాళోజీ గారు ఎప్పుడైనా తన సాధారణ వ్యాపకాలకు దూరంగా వుండాలంటే తన తమ్ముడి ఇంటికి పోయి ఒకటి రెండు రోజులు అక్కడ ప్రశాంతంగా గడిపే వారట (ఇది 1960, 70 దశకాల సంగతి). ‘అరె, కాళోజీ గారికి అన్న రామేశ్వర్‌ రావు గారున్నారని తెలుసు కాని ఈ తమ్ముడెవరూ అనే సందేహమా?’ ఈయన స్వంత తమ్ముడు కాకున్నా అంత కంటే ఎక్కువ. ఆయనే బిట్ల నారాయణ గారు. కాళోజీ సోదరులిద్దరూ ఆయనను స్వంత తమ్ముడి లాగానే చూసుకునేవారు.

బిట్ల నారాయణ కు ప్రాణ స్నేహితులు పాములపర్తి సదాశివరావు గారు. తన అన్ని సాధక బాధకాలకు ఆయన సంప్రదించేది సదాశివ రావునే.1960 వ దశకం లో వారానికి 5 రోజులైనా వీరిద్దరూ ఫోటో స్టూడియోలోనో లేకుంటే ప్రక్కనే వున్న టీ వీ రెడ్డి గారి ఎలక్ట్రానిక్‌ షాప్‌ లోనో మిత్ర బృందం తో గడిపే వారు. ‘జనధర్మ’ ఎం ఎస్‌ ఆచార్య గారు నారాయణ గారికి గురు తుల్యులు. శ్రేయోభిలాషులు. నెమ్మదిగా, తక్కువగా మాట్లాడే ఆయన మాటను నారాయణ కాదన్నది లేదు.

image.png
ఆ రోజుల్లో అది ప్రభుత్వ సమావేశమైనా, ప్రైవేట్‌ ఫంక్షన్‌ ఐనా మంచి ఫోటోలు కావాలంటే రవివర్మ స్టూడియోకు ఆ పని అప్పచెప్పాల్సిందే. మీకు నూటికి నూరు శాతం సంతృప్తి కరమైన ఫోటోలు అందించడం వారి పని. ఇక బిట్ల నారాయణ అంటే ఆయన అందరి వాడు. ఆయన గురించి తెలియని పుర ప్రముఖులు లేరు, సామాన్య జనులూ లేరు. ఆయనంటే పుర ప్రముఖులందరికీ ఒక విధ మైన ఆప్యాయతా, గౌరవం వుండేవి. ఆ రోజుల్లో దాదాపు వరంగల్‌ లో వున్న ప్రతి ఇంట్లో ఎవరో ఒకరిద్దరైనా ఆయన స్టూడియోలో ఫోటో తీసుకొని వుంటారు. బిట్ల నారాయణ 1925 లో జనగామ తాలూకాలోని కుందారం గ్రామంలో పేద కుటుంబంలో జన్మించారు. తండ్రి నేత కార్మికుడు. మొత్తం ఏడుగురు సంతానం లో ఈయన 5 వ వారు. నారాయణ గారి తెలివి తేటలు, చురుకు దనం కనిబెట్టిన తండ్రి ఈయనను బాగా చదివించి ప్రభుత్వ వుద్యోగం చేయించాలనుకున్నాడు. కాని కుటుంబ ఆర్ఠిక పరిస్ఠితుల దృష్ట్యా జరిగింది వేరొకటి.ఈయన రెండవ తరగతిలో వున్నప్పుడు ఈయనకు పాఠం చెప్పే ఉపాధ్యాయుడు ఈయనకు పలక మీద ఒక వైపు ఆంజనేయుడి బొమ్మను గీసి ఇచ్చారట. ఈయన వెంటనే, ఆ బొమ్మకు ఏ మాత్రం తేడాలేని అంజనేయుడి బొమ్మను పలక రెండవవైపు దించి ఆ ఉపాధ్యాయుడికి చూపించారట. ఆయన బాగా మెచ్చుకొని ప్రోత్సహించారు.

ఈయన వయస్సు 9 ఏండ్లప్పుడు 4 వ తరగతి చదువుకున్నప్పుడు జరిగిన సంఘటన ఈయన సునిశిత బుద్ధిని, మెరుగు పడుతున్న చిత్ర కళా నైపుణ్యతను తెలుపుతుంది. ఈయన చెల్లికి బాలశిక్ష కావల్సి వచ్చింది. ఆ రోజుల్లో దాని వెల 12 పైసలు. తండ్రి దగ్గర అన్ని పైసలు లేవు కనుక కొనడం వీలు కాలేదు. అప్పుడు నారాయణ 2 పైసలతో రెండు తెల్ల ఠావు సైజు కాగితాలను కొని వాటిని బాల శిక్ష పుస్తకం సైజు లోకి కత్తిరించుకొని పుస్తకం లాగా కుట్టి, బాల శిక్ష పుస్తకం లోని బొమ్మలను, అక్షరాలను ఈ తెల్ల కాగితం పుష్తకం లో తన డ్రాయింగ్‌ నైపుణ్యంతో రంగు పెన్సిల్లతో గీసి మరొక బాల శిక్షను తయారు చేసారు. దీనిని చూసిన అప్పటి హెడ్‌ మాస్టర్‌ ‘షహ బాష్‌’ అని వెన్ను తట్టడమే కాకుండా ఏదో బహుమతి గూడా ఇచ్చారు. అప్పటినుండి బిట్ల నారాయణను అందరూ ‘బొమ్మల’ నారాయణ అనే వారు.

image.png

.‌పీవీ,కాళోజీ, పాములపర్తి (1974)
నారాయణ వయస్సు 15 సంవత్సరాలప్పుడు (1940 లో) ఉదర పోషణార్థం కుటుంబమంతా షోలాపూర్‌ పోవడం జరిగింది. అంటే గ్రామం నుండి టౌన్‌ వాతావరణానికి. ఇక్కడ ఆయనకు ‘మహాత్మా ఫోటో స్టూడియో’ యజమాని శరణప్ప గారి పరిచయ మేర్పడి 6 నెలల వరకు జీతం లేకుండా అక్కడ పనిచేయడం జరిగింది. ఇక్కడ ముందుగా ఫొటోగ్రఫీకి సంబంధించిన కెమెరా పని తీరు, డెవలపింగ్‌, ప్రింటింగ్‌ పనుల ఓనమా లను దిద్ది ఆయన మెప్పు పొంది, మెలకువలు కూడా నేర్చుకున్నారు. చిత్రమేమంటే శరణప్పగారు గొప్ప పెయింటర్‌. ఫోటో గ్రఫీ ఆయన సైడ్‌ బిజినెస్‌. కాబట్టి ఆయిల్‌ పెయింటింగ్‌ కు సంబంధించిన మెలకువలు గూడా ఈయనే నేర్పారు.1950 లో షోలాపూర్‌ లో ఒక చిత్రలేఖన పోటీలో ఈయన గీసిన ‘స్టాలిన్‌’ పెయింటింగ్‌ కు బహుమతి వచ్చింది. తర్వాత కొన్ని కారణాల వల్ల కొంత కాలం (1950 -53) బొంబాయి లో మకాం. ఇక్కడ ఆయనకు సుద్దాల హనుమంతు గారు దగ్గరి స్నేహితులయ్యారు. ఆ సమయంలో బొంబాయి లో రాజ్‌ కపూర్‌ ‘ఆర్‌ కే స్టూడియో’ కట్టినపుడు అక్కడే దగ్గరగా వున్న మూడు సినిమా హాళ్ళ లో సినిమా పోస్టర్ల పెయింటింగ్‌, పాస్‌ పోర్ట్‌ సైజ్‌ ఫోటోలను చూసి వ్యక్తుల పెయింటింగులు గీయడం చేసే వారు. అదే టైంలో ఒక మిత్రుడు ‘వరంగల్‌ పట్టణంలో ఫొటో స్టూడియో పెట్టుకుంటే ఎక్కువగా రాణిస్తావు’ అని సలహా ఇవ్వడం జరిగింది.

ఆ విధంగా 1956 కల్లా వరంగల్‌ కు రావడం ‘రవి వర్మ ఫోటో స్టూడియో’ ఏర్పరచడం జరిగింది. త్వరలోనే ప్రముఖ ఫోటో గ్రాఫర్‌ గా, ఆయిల్‌ పెయింటింగ్‌ చిత్రకారుడిగా పేరొందారు. స్టూడియోలోకి రాగానే కనబడేట్లు ఆయన తండ్రిగారి పెద్ద పెయింటింగ్‌, ప్రక్కనే పెద్దగా ఎన్లార్జ్‌ మెంట్‌ చేయబడిన ఆయన రెండవ కూతురు ఫోటో, దాని ప్రక్కనే ఆయన ప్రియ మిత్రుడు పాములపర్తి సదాశివ రావు ఫోటో లుండేవి. స్టూడియో ముందు పెట్టిన ‘రవి వర్మ ఫొటో స్టూడియో’ బోర్డ్‌ పై ఆయన రెండవ కుమారుడు రవి వర్మ ఫోటో వుండేది. ఆయన ఫొటో స్టూడియోలో 1962 లో కాళోజీ, పాములపర్తి సదాశివరావు గార్లను తీసిన ఫోటో ఒకటి, పీ వీ గారు, కాళోజీ, సదాశివరావు గార్లు కలిసివున్న 1974 లో దిగిన మరొక ఫోటో జతపరుస్తున్నాను. ఆయనకు ఈ ముగ్గురినీ ‘నువ్వు ‘ అని పిలిచేటంత సాన్నిహిత్యముండేది.

1958 లో వరంగల్‌ లోజరిగిన ఒక చిత్రకళా పోటీలో తన కుడి చేతి బ్రొటన వేలుతో గీసిన ‘గాంధీ’ చిత్రానికి బహుమతి రావడమే కాకుండా అందరిచే ప్రశంసించ బడ్డాడు. చిన్న నాటి నుండి ఆర్య సమాజ్‌ నియమాలను పాటించి మద్య పానం, మాంసాహారం, ధూమపానం త్యజించారు. నారాయణ గారు ఎందరి ఫోటోలనో తీసారు. ఆయన గురించి రాసేముందు ఆయన ఫోటో దొరకుతుందేమో అని గూగుల్‌ సెర్చ్‌ చేస్తే, ఆయన ఫోటో లభ్యం కాలేదు కానీ అంతకంటే అమూల్యమైంది లభ్యమైంది. అదే ‘నా అంతరంగ తరంగాలు’ అనే ఆయన ఆత్మ కథ … కాదు, కాదు… ఆయన బ్రతుకు జీవన పోరాటం. దీనిలో, అలనాటి నిజాం రాష్ట్రపు ఉర్దూ తెలుగు మిశ్రిత తెలంగాణా గ్రామీణ కుటుంబ వ్యవస్థా, ముఖ్యంగా బడుగు వర్గాల దిన దిన జీవన పోరాటం, అప్పటి కులాచారాలు కూలంకషంగా వివరించారు. అదే విధంగా షోలాపూర్‌ లాంటి మరాఠీ వ్యవస్థలో కూడా ఈ బడుగు వర్గాల జీవన పోరాటాన్ని సమగ్రంగా తెలిపారు ఎవరో చెప్పింది కాకుండా తాను స్వయంగా అనుభవించింది తన మాటల్లో చెప్పడం వల్ల ఇందులో ఎలాంటి అతిశయోక్తులూ, ఊహాజనిత రచనా విన్యాసాలూ లేవు.

దీన్ని చలన చిత్రం గా తీస్తే అలనాటి నిజాం తెలుగు రాజ్యమే కాకుండా బ్రిటిష్‌ షోలాపూర్‌ పరిసరాల మరాఠీ గ్రామ వ్యవస్థను మన కళ్ళెదుటకు తెచ్చేది.
1996 లో అనుకుంటా ఒక సారి ఆయన గొర్రెకుంటలో ఒక వృద్ధాశ్రమంలో వున్నాడని తెలిసి అక్కడ ఆయనను పోయి కలిసాం. స్టాండ్‌ పై కాన్వాస్‌, బ్రష్షులూ, పెయింటింగు రంగులూ… యివి ఆయన వ్యాపకాన్ని సూచిస్తున్నాయి. రెండు గంటలు గడిపాం. ఎన్నో మాట్లాడుకున్నాం. కళ్ళతో నవ్వుతున్నా అది గుండె లోతుల్లోంచి కాదని తెలుసుకున్నాం. రెండున్నర దశాబ్దాలు ఒక ప్రముఖ వ్యక్తి గా వరంగల్‌ నగర పుటలలో నిలచిన ఆయన జీవిత చరమాంక దశలో ఆయన దగ్గరకు మళ్ళీ ఆ చిన్ననాటి బాధల మితృత్వం చేరువైంది. ఆయన లేడు. కానీ ఆయన గీసిన మా నాన్న గారి పెద్ద ఆయిల్‌ పెయింటింగ్‌ ఆయన్ను మా నాన్నతో బాటు మా జీవిత కాలం వరకు మా ఇంట్లోనే వున్నట్టు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page