– మావోయిస్టులకు ముఖ్యమంత్రి రేవంత్ హామీ
– సీఎం సమక్షంలో లొంగిపోయిన 130మంది మావోయిస్టులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 7: శాంతియుత మార్గాల ద్వారానే సమస్య పరిష్కారమవుతుందని బలంగా నమ్మే దేశం మనది.. శాంతియుత పోరాటంతో మహాత్మా గాంధీ ఒక యుద్ధాన్ని జయించి దేశానికి స్వాతంత్య్రం తెచ్చారు.. ఎంత పెద్ద సమస్య అయినా చర్చలే పరిష్కారం అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. దేశాల మధ్య యుద్ధాలు జరిగితే చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకుంటున్న పరిస్థితి ఈ రోజుల్లో ఉందంటూ అజ్ఞాతంలో ఉన్న గణపతి సహా ఇతర మావోయిస్టులు కూడా లొంగిపోవాలని ముఖ్యమంత్రిగా పిలుపునిస్తున్నానన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో 130మంది మావోయిస్టులు తుపాకులతో శనివారం లొంగిపోయారు. వీరిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక రీజినల్ కమిటీ సభ్యుడు, పదిమంది డివిజనల్ కమిటీ సభ్యులు, 46మంది ఏరియా కమిటీ సభ్యులు, 70మంది పార్టీ సభ్యులు ఉన్నారు. లొంగిపోయిన వారు 124 తుపాకులను పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఐసీసీసీలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ జనజీవన స్రవంతిలో కలవాలన్న రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు ఆయుధాలతో లొంగిపోయిన మావోయిస్టుల ప్రాణాలకు ఎలాంటి హాని కలగకుండా వారికి ఆర్థిక, ఇతర వసతులను ప్రభుత్వం కల్పిస్తుందని నమ్మకం కలిగించిన పోలీసు ఉన్నతాధికారులను అభినందిస్తున్నానన్నారు. మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత మాది.. ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురండి అని విజ్ఞప్తి చేశారు.
అమిత్ షా దృష్టికి కేంద్ర కమిటీ సభ్యుల ప్రతిపాదనలు 

ఇటీవల లొంగిపోయిన దేవ్‌జీ, దామోదర్, ఇతర కేంద్ర కమిటీ సభ్యులతో సమావేశమైనప్పుడు కొన్ని ప్రతిపాదనలు వారు తన ముందుంచారని, ఆ ప్రతిపాదనలను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. ఇవాళ 124 అత్యాధునిక ఆయుధాలతో 130మంది మావోయిస్టులు లొంగిపోయారని, బుల్లెట్ ద్వారా కాదు బ్యాలెట్ ద్వారా సమస్యలు పరిష్కారమవుతాయని నమ్మి జనజీవన స్రవంతిలో కలిసిన అందరికీ అభినందనలు అని అన్నారు. 2024 జనవరి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 721 మంది మావోయిస్టులు లొంగిపోయారంటూ లొంగిపోయిన మావోయిస్టులకు మంచి ఆర్ధిక ప్యాకేజీని పెంచే అంశంపై త్వరలోనే అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఒకేసారి ఇంతమంది ఆయుధాలతో లొంగిపోయిన దాఖలాలు గతంలో లేవన్నారు. లొంగిపోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లతోపాటు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో హింస కుదరదు.. హింస ద్వారా సమస్యలు పరిష్కారం కావు.. అజ్ఞాతంలో ఉన్న నక్సలైట్లకు సూచన ఒక్కటే.. సమస్యలను ప్రజాస్వామ్యబద్ధంగా పరిష్కరించుకుందాం.. ఆయుధాలతో లొంగిపోతే మీకు అన్ని విధాలా ప్రభుత్వం సహకరిస్తుంది.. ఆరోగ్యం, ఆర్ధిక వెసులుబాటు, నివాసానికి ఇండ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి స్వేచ్ఛ ఇచ్చింది.. అజ్ఞాతంలో ఉన్న గణపతి సహా మిగతా కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోవాలని పిలుపునిస్తున్నా అని అన్నారు. జనజీవన స్రవంతిలో కలిసి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములవండి అని పిలుపునిచ్చారు. నక్సలైట్ల పట్ల ప్రభుత్వం సానుభూతితో.. సానుకూలంగా ఉంది. అవకాశం ఉన్న కేసులను ఎత్తివేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కేసుల పరిశీలనకు అవసరమైతే ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో లొంగిపోయిన మావోయిస్టులు పోలీసులకు అప్పగించిన అత్యాధునిక తుపాకులను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఈ ఆయుధాలలో ఒక ఇన్‌సాస్ ఎల్‌ఎంజీ రైఫిల్, 31 ఏకే-47 రైఫిళ్లు, 21 ఇన్‌సాస్ రైఫిళ్లు, 20 ఎస్‌ఎల్‌ఆర్ రైఫిళ్లు, 18- 303 రైఫిళ్లు, 33 ఇతర తుపాకులు ఉన్నాయి. ఈ కార్యకష్ట్రక్రమంలో డీజీపీ శివధర్‌రెడ్డి తదితర ఉన్నతాధికారులు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




