స్వేచ్ఛ మృతికి కేసీఆర్‌తోపాటు పలువురి సంతాపం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 28: తెలంగాణ ఉద్యమ జర్నలిస్టు స్వేచ్ఛ వొటార్కర్ మరణం పట్ల బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. సామాజిక స్పృహ ఉన్న కవయిత్రిగా, జర్నలిస్టుల్ణగా ఎదుగుతున్న స్వేచ్ఛ మరణం విషాదకరమన్నారు. ఆమె ఆకస్మిక మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో స్వేచ్ఛ తల్లిదండ్రులు శంకర్, శ్రీదేవిలు చురుకుగా పాల్గొన్నారంటూ బిడ్డను కోల్పోయి శోకతప్త హృదయులైన వారికి కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సీనియర్ జర్నలిస్ట్ స్వేచ్ఛ అకాల మరణంపట్ల సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సిహెచ్. ప్రియాంక తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. చురుకైన జర్నలిస్టు, రచయిత అయిన స్వేచ్ఛ మరణంతో రాష్ట్రం ఒక మంచి జర్నలిస్టును కోల్పోయిందన్నారు. తెలంగాణవాది అయిన జర్నలిస్టు స్వేచ్ఛ అకాల మరణం ఎంతో బాధాకరమని మాజీ మంత్రి టి.హరీష్‌రావు అన్నారు. భవిష్యత్తులో ఎంతో ఉన్నతిని సాధించగల మంచి జర్నలిస్టుగా ఎదుగుతున్న ఆమె జీవితం ఇంత అర్ధాంతరంగా ముగిసిపోవడం విషాదకరమన్నారు. ఈ బాధను తట్టుకునే ధైర్యాన్ని ఆమె కుటుంబానికి దేవుడు ప్రసాదించాలని, స్వేచ్ఛ ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నానని హరీష్‌రావు తెలిపారు.





