– మంత్రి వివేక్ వెంకటస్వామి
– 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఐటీఐలలో ఆధునిక కోర్సులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9: ప్రభుత్వం చేపట్టబోయే 99 రోజుల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా మల్లేపల్లి ప్రభుత్వ ఐటీఐలోని అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)లో నూతన స్వల్పకాలిక కోర్సులను కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎన్‌సీ మెషిన్ ఆపరేషన్, రోబోటిక్స్, ఈవీ టెక్నాలజీ, 2డి, 3డి ప్రొడక్ట్ డిజైనింగ్ వంటి ఆధునిక కోర్సులను ప్రారంభిస్తున్నారు. యువతకు ఆధునిక నైపుణ్యాలు పెంచి ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోందన్నారు. ఈ ప్రణాళికలో తీసుకున్న నిర్ణయాలను దశలవారీగా అమలు చేస్తున్నామని తెలిపారు. పరిశ్రమల అవసరాలÅ£నుగుణంగా నైపుణ్యాలు కలిగిన యువత అందుబాటులో లేరని అనేక పరిశ్రమలు చెబుతున్నాయని, అందుకే ఇండస్ట్రీలకు అవసరమైన స్కిల్ సెట్స్‌పై విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఏటీసీలు, ఐటీఐలు భవిష్యత్ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలతో కూడిన శిక్షణ పొందిన నిపుణులను తయారు చేస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. నేటి ప్రపంచంలో ఒక్క నైపుణ్యం సరిపోదని, యువత మల్టీ స్కిల్స్ ఉంటేనే అవకాశాలు మరింత పెరుగుతాయని తెలిపారు. ఏటీసీల నుంచి బయటకు వచ్చే ప్రతి విద్యార్థికీ ఉపాధి అవకాశాలు కల్పించేలా శిక్షణ విధానం ఉండాలని ప్రిన్సిపాల్స్‌కు సూచిస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో టాటా టెక్నాలజీస్ భాగస్వామ్యంతో వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన కోర్సులను త్వరలో ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రపంచంతో పోలిస్తే వ్యవసాయ రంగంలో మన ఉత్పాదకత తక్కువగా ఉన్నందున అగ్రి అలైడ్ సెక్టార్‌లో నైపుణ్యాలను పెంచే కార్యక్రమాలు చేపడతామన్నారు. జీనోమ్ వ్యాలీ ప్రాంతంలోని పరిశ్రమల అవసరాలను దృష్టిలో పెట్టుకొని అక్కడి పరిశ్రమలకు అవసరమైన కోర్సులను కూడా త్వరలో ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు. కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి ఉండాలని, నైపుణ్యాలను పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. అదేవిధంగా టామ్‌కామ్ ద్వారా విద్యార్థులకు విదేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పించేలా శిక్షణ అందిస్తున్నామని, విదేశాల్లో మెరుగైన వేతనాలతో మంచి అవకాశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. ఏటీసీల నుంచి ఇప్పటికే పలువురు విద్యార్థులు ఉద్యోగాల్లో చేరుతున్నారని, భవిష్యత్తులో జిల్లాల వారీగా జాబ్ మేళాలు కూడా నిర్వహించనున్నట్లు మంత్రి వెంకటస్వామి వెల్లడించారు. కార్యక్రమంలో కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్, ఉపాధి, శిక్షణ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ, అధికారులు, ట్రైనర్లు పాల్గొన్నారు. ఏటీసీ, ఐటీఐ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




