– విలువలు పాటిస్తూ వృత్తి గౌరవాన్ని పెంచుకోవాలి:
– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
– ఘనంగా టీయూడబ్ల్యూజే(ఐజేయూ) నగర కమిటీ మహాసభ
ఖమ్మం టౌన్, ప్రజాతంత్ర, జూలై 13: ఖమ్మం జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. టీయూడబ్ల్యూజే(ఐజేయూ) ఖమ్మం నగర మహాసభ జెడ్పీ సమావేశ మందిరంలో నగర అధ్యక్షుడు మైసా పాపారావు అధ్యక్షతన ఆదివారం జరిగింది. ముఖ్య అతిథిగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలకు భంగం కలగకుండా వాస్తవాలను ప్రజలకందించి వృత్తిని విలువను పెంపొందించుకోవాలని విలేకరులకు సూచించారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో జర్నలిస్టులతో తనకెంతో అనుబంధం ఉందన్నారు. వారి సమస్యలు తనకు తెలుసనని, ఖమ్మం జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారానికి ఇప్పటికే కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశామని, కలెక్టర్ నివేదిక ఆధారంగా సీిఎంను కలిసి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. హెల్త్‌కార్డులు, అక్రిడిటేషన్లు, పెన్షన్లు తదితర సమస్యలపై రాష్ట్రస్థాయిలో చర్చిస్తామన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఐజేయూను మంత్రి అభినందించారు.
బీమా పథకంలో జర్నలిస్టులను చేర్చండి: రాంనారాయణ
ప్రభుత్వ బీమా పథకంలో జర్నలిస్టులను కూడా చేర్చాలని టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రాంనారాయణ కోరారు. సుప్రీం కోర్టు తీర్పుకు, ఖమ్మం ఇళ్ల స్థలాల జీవోకు సంబంధం లేదన్నారు. హెల్త్‌కార్డులు పనిచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. వెంటనే అక్రిడిటేషన్లు ఇవ్వాలని, జర్నలిస్టులపై దాడులను నియంత్రించాలని కోరారు. ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాటేటి వేణుగోపాల్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ సామినేని మురారి, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర నాయకుడు నర్వనేని వెంకట్రావ్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి వనం వెంకటేశ్వర్లు, ఏనుగు వెంకటేశ్వరరావు, కోశాధికారి శివానంద, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యదర్శి కనకం సైదులు, సీనియర్ జర్నలిస్టు నలజాల వెంకట్రావ్, కెమెరామెన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఆలస్యం అప్పారావు, ఫొటో జర్నలిస్టుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కమతం శ్రీనివాస్, డెస్క్ జర్నలిస్టు అధ్యక్షుడు కొమ్మినేని ప్రసాదరావు, సీనియర్ జర్నలిస్టులు భూపాల్, మహేందర్, మొహియుద్దీన్, నామా పురుషోత్తం, పసుపులేటి సత్యనారాయణ, కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం నియోజకవర్గ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల నిమిత్తం గత ప్రభుత్వం కేటాయించిన భూమిని స్తంభాద్రి జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీకి అప్పగించాలని మంత్రికి సమర్పించిన వినతిపత్రంలో కోరారు. అలాగే హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్‌లో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా మీడియా పీఆర్‌వో లేదా లైజనింగ్ ఆఫీసర్‌ను నియమించాలని కూడా కోరారు.
ఖమ్మం నగర కమిటీ ఎన్నిక
టీయూడబ్ల్యూజేె ఖమ్మం నగర కమిటీని మహాసభలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా చెరుకుపల్లి శ్రీనివాసరావు(సూర్య), ప్రధాన కార్యదర్శిగా జనర్దనాచారి(నవభూమి), కోశాధికారిగా ఏలూరు వేణుగోపాల్(న్యూస్‌బూమ్) ఎన్నికయ్యారు. అలాగే టీయూడబ్ల్యూజే అనుబంధమైన ఖమ్మం ప్రెస్‌క్లబ్ నూతన కమిటీని మహాసభలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నామా పురుషోత్తం(మనం), ప్రధాన కార్యదర్శిగా శీలం శ్రీనివాస్(నమస్తే తెలంగాణ), కోశాధికారిగా కల్యాణ్ చక్రవర్తి(ముద్ర) ఎన్నికయ్యారు. ఎలక్ట్రానిక్ మీడియా నగర కమిటీ అధ్యక్షుడిగా గుండ్ల రాంబాబు(10 టివి), ప్రధాన కార్యదర్శిగా కారుమంచి శ్రీనివాస్(సాక్షి టివి), కోశాధికారి వందనపు ఉమేష్ (స్టూడియో ఎన్) ఎన్నికయ్యారు.
\


