జాతరలో టీజీఎస్‌సీవో స్టాల్ నిర్వ‌హించాలి

– నేతన్నలను ప్రోత్సహించేందుకు చేనేత చీరలు కొనాలి
– అబిడ్స్ లోని షాప్‌ను సందర్శించిన మంత్రి సీతక్క

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 22ః ఆబిడ్స్‌లో ఉన్న రాష్ట్ర చేనేత సహకార సంస్థ (టీజీఎస్‌సీవో_ షాప్‌ను మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ద‌న‌స‌రి అన‌సూయ సీతక్క సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ టీజీఎస్‌సీవో షాప్‌న‌కు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. చేనేత కార్మికులు ఎంతో కష్టపడి, నైపుణ్యంతో, తరతరాలుగా వచ్చిన అనుభవంతో అద్భుతమైన డిజైన్లతో చీరలు తయారు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇక్కడ లభిస్తున్న చీరలు సంప్రదాయానికి ప్రతీకగా ఉండటంతోపాటు, ఆధునిక మహిళలకు కూడా నచ్చే విధంగా ఉన్నాయన్నారు. రాబోయే సమక్క-సారలమ్మ జాతరలో భక్తులకు అందుబాటులో ఉండేలా చేనేత చీరలను విక్రయించాలని, అందుకోసం అక్కడ ఒక స్టాల్ ఏర్పాటు చేయాలనిటీజీఎస్‌సీవోను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆ ఉద్దేశంతోనే ఈ రోజు అబిడ్స్‌లోని షాప్‌ను సందర్శించామన్నారు. చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ మంత్రి సీతక్కకు స్వాగతం పలికి షాప్‌లోని వివిధ విభాగాలను వివరించారు. షాప్‌లో ప్రదర్శనకు ఉంచిన చేనేత కార్మికులు నేసిన చీరలను పరిశీలించిన మంత్రి సీతక్క వాటి నాణ్యత, రంగులు, డిజైన్లపై ప్రశంసలు కురిపించారు. అనంతరం కొన్ని చీరలను కొనుగోలు చేశారు. ఇక్కడి చీరలు తనకు ఎంతో నచ్చాయని, మంచి రంగులు, ఆకర్షణీయమైన డిజైన్లతో చేనేత వస్త్రాలకు నిజమైన గుర్తింపునిస్తున్నాయని మంత్రి సీతక్క అన్నారు. చేనేత కార్మికుల ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా వారి శ్రమకు, కష్టానికి గౌరవం ఇచ్చిన వారమవుతామని చెప్పారు. ప్రజలంతా టీజీఎస్‌సీవో వంటి చేనేత వస్త్రాలయాలను సందర్శించి పండుగలు, శుభకార్యాల సందర్భంలో ఇక్కడి ఉత్పత్తులను కొనుగోలు చేసి చేనేత కార్మికులను ప్రోత్సహించాలని ఆమె పిలుపునిచ్చారు.


 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *