క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రాజెక్టుల నిర్మాణం

– సిస్ట్రా గ్లోబల్‌ డిజిటల్‌ టూల్స్‌ ప్రారంభోత్సవ సభలో మంత్రి ఉత్తమ్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 31: తెలంగాణ రాష్ట్రం అత్యంత క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానంతో నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మిస్తోందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ ప్రఖ్యాత మెట్రో డిజైన్‌, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీ సంస్థ అయిన ఫ్రాన్స్‌కు చెందిన సిస్ట్రా గ్లోబల్‌ డిజిటల్‌ టూల్స్‌ సెంటర్‌ను గురువారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా 70 దేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సిస్ట్రా సంస్థ గత ఏడాది 1.25 యూరో బిలియన్‌ల ఆదాయం గడిరచిందన్నారు. అంతేగాక యావత్‌ ప్రపంచంలో నిర్మితమైన మెట్రో ప్రాజెక్టులలో ఈ సంస్థకు భాగస్వామ్యం ఉందన్నారు. భారతదేశంలోని 80 శాతం మెట్రో ప్రాజెక్టులు ఈ సంస్థ రూపొందించినవే అని మంత్రి తెలిపారు. అలాంటి పేరొందిన సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. భారత వైమానిక దళంలో ఫైటర్‌ పైలట్‌గా విధులు నిర్వర్తిస్తున్నప్పుడు ఫ్రెంచ్‌ ఇంజినీరింగ్‌ వర్క్‌ కల్చర్‌ను స్వయంగా చూశానన్నారు. ఫ్రాన్స్‌ వెళ్లడం తనకు ఎప్పుడూ ఆనందదాయకమేనని, అలాంటి ఫ్రాన్స్‌కు చెందిన సిస్ట్రా సంస్థ ఇప్పుడు హైదరాబాద్‌లో అద్భుతమైన ఫలితాలు సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ మహానగరం ప్రస్తుతం ప్రపంచ స్థాయికి ఎదిగిందని, ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలు, వాతావరణం కారణంగా బహుళ జాతి సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా మార్చుకున్నాయని చెప్పారు. అందులో భాగంగానే ఈ సంస్థ ఇక్కడ కార్యాలయాన్ని ప్రారంభించిందంటూ రాష్ట్రం చేపట్టే అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనలో సిస్ట్రా భాగస్వామ్యం కావాలని మంత్రి ఉత్తమ్‌ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలతో కూడిన ప్రాజెక్టుల నిర్మణాలకు కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. కార్యక్రమంలో సిస్ట్రా ఇండియా సీఈవో హరి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *