– మీ భాషను ప్రజలు ఈసడించుకుంటున్నారు
– రేవంత్‌రెడ్డిపై సిరికొండ విమర్శనాస్త్రాలు
హన్మకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్ 25ః నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం కేసీఆర్‌ను రానివ్వనని అంటున్న రేవంత్ రెడ్డి గారూ.. ముందు మీరు రాజకీయాల్లో, అధికారంలో ఉండేది ఈ మూడేళ్లే అన్న సత్యాన్ని గుర్తుంచుకోండి అని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రాష్ట్ర శాసనసభ తొలి స్పీకర్, ఎమ్మెల్సీ, శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి హితవు పలికారు. బాలసముద్రంలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో గురువారం ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న భాషతో ప్రజలు ఇప్పటికే ఈసడించుకుంటున్నారన్నారు. రేవంత్ రెడ్డి పరాన్నజీవి (పారసైట్) అయితే కేసీఆర్ స్వయం ప్రకాశమైన నాయకుడు అని చెప్పారు. తెల్లారి లేస్తే కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామనే మీ అజెండా తప్ప అభివృద్ధి కాదని మరోసారి రుజువైందన్నారు.కేసీఆర్ ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి కేవలం పదేళ్లలోనే దేశంలోనే నెంబర్–1 రాష్ట్రంగా నిలిపిన గొప్ప పాలనాదక్షుడని కొనియాడారు. కేసీఆర్ మీకు రెండేళ్ల సమయం ఇచ్చారు.. గంభీరంగా అన్నీ గమనిస్తు వచ్చారు.. కానీ ఈ మీరు సాధించిన ఘనకార్యాలేమిటి అని ప్రశ్నించారు. గురుకుల హాస్టళ్లలో వరుస ఘటనలతో విద్యార్థుల హాహాకారాలు, యూరియా కోసం రైతుల పడిగాపులు, ఫ్యూచర్ సిటీ, హిల్ట్ పేరుతో రియల్ ఎస్టేట్ దందాలు, ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రచారాల్లో తెలంగాణలో అమలు చేయని పథకాలను అమలు చేసినట్టు అబద్ధపు ప్రచారాలు, అటకెక్కిన ఆరు గ్యారంటీలు, 420 హామీలు, .జాబ్ క్యాలెండర్ అటకెక్కింది, తులం బంగారం అటకెక్కింది.. మహిళలకు ₹2500, విద్యార్థినులకు స్కూటీలు అటకెక్కాయని విమర్శించారు. కేసీఆర్ కిట్ లాంటి అనేక ప్రజా సంక్షేమ పథకాలు అటకెక్కాయన్నారు. అడవి సోమన్‌పల్లి చెక్‌డ్యామ్‌ను పేల్చివేశారని.. ఇవే మీ రెండేళ్ల పాలనలో సాధించిన ఘన కార్యాలు అని ఎద్దేవా చేశారు. వీటన్నిటిని గమనించిన కేసీఆర్ ఇటీవల ప్రెస్‌మీట్‌లో మీ అసమర్థ, అవినీతి, దిశదశ లేని పాలనను ఎండగట్టారన్నారు. ఇక రానున్న రోజుల్లో సభలు, సమావేశాలు జరిగితే ప్రజలు ఎక్కడ తిరగబడతారో అన్న భయం ఆవహించి దాన్ని కప్పిపుచ్చుకునేందుకు బజారు భాష మాట్లాడటం అత్యంత దుర్మార్గమైన, నీతిమాలిన, హేయమైన చర్య.అన్నారు. గతంలో కూడా కాళేశ్వరం రిపోర్టుపై చర్చకు అసెంబ్లీకి రండని సవాలు చేసి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని కేరళకు పరారైన చరిత్ర మీది. ఒట్లు వేయించుకోవడం తర్వాత పలాయనం చిత్తగించడం ఇదే మీకు తెలిసిన రాజకీయ విద్య అన్నారు. ఫార్ములా ఈ- రేస్‌ను కేటీఆర్ రాష్ట్రానికి తీసుకొస్తే దుబారా అంటారు.జ ఫుట్‌బాల్ ఆటగాడు మెస్సితో ఈవెంట్ పెట్టి సింగరేణి నిధులు ఖర్చు చేస్తే దుబారా కాదా అని నిలదీశారు. మీ అరాచకాలను ప్రశ్నిస్తున్న హరీష్ రావు, కేటీఆర్‌లపై కూడా దిగజారుడు భాషే. ఎదిరిస్తే కేసులు.. ప్రశ్నిస్తే లాగులు, తొండలు –ఇదే మీ పాలనా శైలి అని విమర్శించారు. రేవంత్ రెడ్డి గారూ.. బజారు భాష వదిలి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నామన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మోసం చేశాడన్నారు. కెసిఆర్ అమలు చేసిన అనేక పథకాలను అమలు చేయడం లేదు. సంపద సృష్టించడం చేతకావడం లేదు.. ఏం చేశాడని రేవంత్ రెడ్డి మళ్లీ గెలిపిస్తారని ప్రశ్నించారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు, ఏనుమాముల మార్కెట్ కమిటీ చైర్మన్ చింతల సదానందం, కార్పొరేటర్ చెన్నం మధు, మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్, నాయకులు పులి రజినీకాంత్, శోభన్, నాయీముద్దీన్, రామ్మూర్తి, బుద్దె వెంకన్న, వినీల్ రావు, తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





