సిరిసిల్ల‌లో రూ.101కే ద‌హ‌న సంస్కారాలు

  • 12 అంశాల ప్ర‌జాసంక్షేమ అజెండాకు ఆమోదం
  • మున్సిప‌ల్ మొద‌టి సాధార‌ణ స‌మావేశం
  • స‌హ‌క‌రించిన స‌భ్యుల‌కు ఛైర్‌ప‌ర్స‌న్ కృత‌జ్ఞ‌త‌లు

సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర ఫిబ్రవరి28:  సిరిసిల్ల‌లో రూ.101ల‌కే ద‌హ‌న‌సంస్కారాలు (Rs 101 Cremation Scheme) నిర్వ‌హించే నూత‌న ప‌థ‌కానికి సిరిసిల్ల మున్సిప‌ల్ స‌మావేశం ఆమోదం తెలిపింది. గ‌తంలో ఈ ప‌థ‌కం అమ‌ల్లో వున్న‌ప్ప‌టికీ కార‌ణాంత‌రాల‌వ‌ల్ల మ‌ధ్య‌లో నిలిపేశారు. ఈ నేప‌థ్యంలో ఈసారి పాల‌క‌వ‌ర్గం దీనికి ప్రాధాన్య‌త‌నిస్తూ స‌భామోదం ద్వారా మ‌ళ్లీ అమ‌ల్లోకి తెచ్చింది.  మున్సిపల్ సాధారణ మొదటి సాధార‌ణ‌ సమావేశం శనివారం  మునిప‌ల్‌ అధ్యక్షురాలు జిందం కళ చక్రపాణి అధ్యక్షతన నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆమె  ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌కు సంబంధించి 12 అంశాల‌తో అజెండాను ప్ర‌వేశ‌పెట్ట‌గా స‌భ ఆమోదం తెలిపింది. ప‌ట్ట‌ణంలో స్పెషల్ సానిటేషన్ డ్రైవ్ కోసం  రూ.10ల‌క్ష‌లు కేటాయింపున‌కు స‌భ ఆమోదం తెలిపింది. వివిధ వార్డుల్లో ప‌వ‌ర్ బోర్ల నిర్వ‌హ‌ణ‌కు మ‌రో రూ.10ల‌క్ష‌లు కేటాయించారు. వీధిలైట్ల నిర్వ‌హ‌ణ కోసం రూ.5ల‌క్ష‌లు కేటాయించారు. వివిధ కారణాలవల్ల చెడిపోయిన ట్రాక్టర్లు, బ్లడ్ ట్రాక్టర్లు, ఆటోలు, జెసిబిలు మొద‌లైన‌ వాహనాలకు మ‌ర‌మ్మ‌తులు చేయ‌డానికి స‌మావేశం నిర్ణ‌యించింది. కాగా ప్ర‌జా సంక్షేమం దృష్టిలో వుంచుకొని ప్ర‌వేశ‌పెట్టిన 12 అంశాల అజెండా ఆమోదానికి స‌హ‌క‌రించిన స‌భ్యుల‌కు మున్సిప‌ల్ ఛైర్‌ప‌ర్స‌న్ జిందం క‌ళ చ‌క్ర‌పాణి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఎండి ఖాదిర్ పాషా , వైస్ చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్ సభ్యులు,మున్సిపల్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *