– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్న సీఎండీ బలరామ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: పర్యావరణ హిత చర్యలు, సంక్షేమం, సౌకర్యాల కల్పనలో ఉత్తమ కంపెనీగా ఉన్న సింగరేణి సంస్థ గత ఆర్థిక సంవత్సరానికి నాలుగు బొగ్గు గనులకు జాతీయస్థాయిలో ఫైవ్ స్టార్ రేటింగ్‌ను సాధించి తన ప్రతిభను మరోసారి చాటుకుంది. ముంబయిలో గురువారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి చేతుల మీదుగా సింగరేణి సంస్థ చైర్మన్, ఎండీ ఎన్.బలరామ్ అవార్డులు అందుకున్నారు. అవార్డులను అందుకున్న గనులలో రామగుండం-3 ఏరియాకి చెందిన ఆర్‌జిఓసి-1 ఎక్స్‌టెన్షన్, ఇల్లందు ఏరియాకి చెందిన జేకే-5 ఓసి, భూగర్భ గనుల్లో శ్రీరాంపూర్ ఏరియాకి చెందిన ఆర్కే-6 గని, ఆర్కే న్యూటెక్ గనులు ఉన్నాయి. ఇలా స్టార్ రేటింగ్ ఇచ్చేందుకు బొగ్గు గని పనితీరు, రక్షణ చర్యలు, నిర్వహణ, అక్కడ గల సౌకర్యాలు, పర్యావరణహిత చర్యలు, కార్మిక సంక్షేమం వంటి 84 అంశాలను పరిగణనలోనికి తీసుకుంటారు. మొత్తం 100 మార్కుల్లో 91 కన్నా ఎక్కువ మార్కులు సాధించిన గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తారు. దీనిపై బలరామ్ తన హర్షం ప్రకటిస్తూ గనుల యాజమాన్యాలకు, కార్మికులకు తన అభినందనలు తెలియజేశారు. ఈ ఏడాది గతంలో ఎప్పుడూ లేని విధంగా నాలుగు గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్ లభించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇవేకాక 14 గనులు 100కు 80 నుండి 90 మార్కులు సాధించి ఫోర్ స్టార్ రేటింగును అందుకోవటం విశేషమన్నారు. 20 గనులకు త్రీ స్టార్ రేటింగ్ లభించింది. గతంలో కొన్ని గనులకు టు స్టార్ రేటింగులు లభించగా ఈసారి అన్ని గనులు తమ పనితీరును మెరుగుపరచుకుని త్రీ స్టార్ రేటింగ్ సాధించడం విశేషం.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





