సిగాచి ప్రమాదంపై హైకోర్టులో పిల్‌

– ప్రభుత్వానికి నోటీసులు జారీ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 31: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పారిశ్రామికవాడలోని సిగాచి కర్మాగారంలో ఇటీవల జరిగిన భారీ పేలుడు ఘటనపై దర్యాప్తు నత్తనడకగా ఉందనే వ్యాజ్యంపై కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కర్మాగారంలో భద్రతా నిబంధనలు పాటించడం లేదని, బాధిత కార్మికుల కుటుంబాలకు పరిహారం చెల్లింపులో తీవ్ర జాప్యం జరిగిందని రిటైర్డ్‌ శాస్త్రవేత్త కె.బాబురావు వేసిన పిల్‌ను చీఫ్‌ జస్టిస్‌ ఏకే సింగ్‌, జస్టిస్‌ మొహియుద్దీన్‌ గౌస్‌ డివిజన్‌ బెంచ్‌ గురువారం విచారించింది. కార్మికులందరూ శాశ్వత ఉద్యోగులు కాదని, ఎక్కువగా కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న వలస కార్మికులని పిటిషనర్‌ అడ్వకేట్‌ కోర్టు దృష్టికి తెచ్చారు. కార్మికులందరికీ పరిహారం చెల్లించాలని కోరారు. ప్రమాద ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ, నిపుణుల కమిటీ నివేదికల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తున్నట్లు ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. అయితే ఈ రెండు కమిటీల ఫలితాలపై దర్యాప్తు ఆధారపడి ఉండబోదని చెప్పారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని కూడా వివరించారు. దీనిపై స్పందించిన హైకోర్టు ఇదేమీ ప్రభుత్వ వ్యతిరేకమైన వ్యాజ్యంగా భావించవద్దని స్పష్టం చేసింది. మరణించిన కార్మికుల కుటుంబాలకు సహాయం చేయడానికి రాష్ట్రం తనవంతు కృషిచేయాలంది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు దశ నుంచి కేసు దర్యాప్తు పురోగతి వరకు వివరాలు అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రాణనష్టం ఏమేరకు జరిగిందీ, కంపెనీని బాధ్యులుగా గుర్తించి కేసు నమోదు చేశారా, ప్రమాదం జరిగినప్పుడు ఫ్యాక్టరీలో ఉన్న కార్మికుల సంఖ్య ఎంత, ఎంతమంది మరణించారు, బాధిత కుటుంబాలకు ఏ మేరకు సాయం అందించారు, కార్మికులకు చెల్లించిన పరిహారం వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 27కి వాయిదా వేసింది.

ఫ్యాక్టరీల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలి: మంత్రి వివేక్‌

ఫ్యాక్టరీలలో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని కార్మిక, మైనింగ్‌ శాఖ మంత్రి డాక్టర్‌ వివేక్‌ వెంకటస్వామి స్పష్టం చేశారు. ఇకపై అన్ని జిల్లాల్లో కెమికల్‌, ఫార్మా, హైరిస్క్‌ పరిశ్రమలన్నింటికీ చెక్‌ లిస్ట్‌ను ప్రకటిస్తామన్నారు. నిబంధనలను ఉల్లంఘించే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సిగాచి ఫ్యాక్టరీ ఘటనలో ఫ్యాక్టరీల ఇన్‌స్పెక్టర్‌ ఇచ్చిన సాధారణ సూచనలను పాటించి ఉంటే కంపెనీకి రూ.20 నుంచి రూ.25 లక్షలకు మించి ఖర్చు అయ్యేది కాదన్నారు. ఇప్పుడు ప్రమాదం జరగడం వల్ల రూ.50 కోట్ల పరిహారం చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *