ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సమీక్షించిన ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి
సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : నంగనూరు మండలం నర్మెట్ట గ్రామంలో రూ. 300 కోట్లతో నిర్మితమవుతున్న ఆయిల్ పామ్ పరిశ్రమ (Oil palm factory ) ప్రారంభోత్సవానికి సిద్దమైంది. గురువారం జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ హైమావతి ఆధ్వర్యంలో తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి (Janga Raghava Reddy) , ఆయిల్ ఫెడ్ మేనేజింగ్ డైరె క్టర్ శంకరయ్య, అధికారులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్బంగా జంగా రాఘవ రెడ్డి మాట్లాడుతూ ఫ్యాక్టరీ పనులు పూర్తయ్యాయని, దీనిని రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి, మంత్రుల చేతులమీదుగా ప్రారంభించనున్నామని పేర్కొన్నారు.
ఆయిల్ పాం పరిశ్రమ ఆవరణలో ముఖ్య మంత్రి పాల్గొనే సభా స్థలం ఏర్పాట్లను జంగా రాఘవ రెడ్డి ఆయిల్ ఫెడ్ ఎం.డి శంకరయ్య, ఈడి కిరణ్ కుమార్, జనరల్ మేనేజన్ సుధాకర్ రెడ్డిలతో కలిసి పరిశీలించారు. ఎక్కడా ఎటువంటి లోపాలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు రాఘవ రెడ్డి సూచించారు. కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ అధికారులు, ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, ఇంజనీర్లు పాల్గొన్నారు.





