మ‌హిళ‌లు ఆర్థిక స్వావ‌లంబ‌న సాధించాలి

– పురుషుల కంటే ఎక్కువ క‌ష్ట‌ప‌డితేనే గుర్తింపు
– మ‌హిళ‌ల‌కు శుభాకాంక్ష‌లు
– బీఆర్ఎస్ నేత కేటీఆర్‌
– చందాన‌గ‌ర్‌లో మ‌హిళా దినోత్స‌వ వేడుక‌లు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 7: అమ్మాయిలు తమ కాళ్ల మీద తాము నిలబడి ఆర్థిక స్వావ‌లంబ‌న సాధించే దిశగా ముందుకు సాగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆడబిడ్డలకు ఆర్థిక స్వతంత్రమే అసలైన గౌరవం ఇస్తుందని అన్నారు. తనకు కూడా 17 ఏళ్ల కూతురు ఉందని గుర్తు చేస్తూ, యువతకు ఆయన కీలక సూచన చేశారు. ఆర్థికంగా ఎవరి మీద ఆధారపడకుండా సొంతంగా ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలిచే స్థాయికి ఎదిగినప్పుడే సమాజంలో గౌరవం, గుర్తింపు లభిస్తాయన్నారు. ఆర్థిక స్వావలంబన ఉంటేనే మహిళలకు నిజమైన స్వేచ్ఛ లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
రాబోయే రోజుల్లో మహిళా రిజర్వేషన్లు అమలులోకి రానున్న నేపథ్యంలో, చదువుకున్న విద్యావంతులు, సామాజిక స్థితిగతులపై అవగాహన ఉన్న మహిళలు రాజకీయాల్లోకి రావాలని కేటీఆర్ కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించామని, భవిష్యత్తులోనూ మహిళా సంక్షేమం కోసం మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. కేసీఆర్ కిట్, కల్యాణ లక్ష్మి, షీ టీమ్స్, భరోసా వంటి పథకాలు మహిళలకు అండగా నిలిచాయని గుర్తు చేశారు. మరోసారి రాష్ట్రంలోని మహిళల ఆశీస్సులతో కేసీఆర్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని, ఆడబిడ్డల కోసం మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తీసుకొస్తుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్‌లో శ్రీమతి బొబ్బా నవతారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా పురస్కారాల ప్రదా నోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ నేటి సమాజంలో పురుషాధిక్యత అడుగడుగునా ఉందని, రాజకీయాలు కూడా దానికి అతీతం కాదని అభిప్రాయపడ్డారు. ఒక రంగంలో పురుషుడు విజయం సాధించడానికి 100 శాతం కష్టపడితే అదే రంగంలో మహిళ రాణించాలంటే 200 శాతం శ్రమించాల్సిన పరిస్థితి ఉంది. పోటీ ప్రపంచంలో మహిళలు నిలదొక్కుకోవాలంటే రెట్టింపు ప్రయత్నం చేయక తప్పదని అన్నారు. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన సోషల్ వర్కర్స్, ఆర్టిస్టులు, జర్నలిస్టులు, శానిటేషన్ వర్కర్లు, ప్రజాప్రతినిధులకు ఈ సందర్భంగా పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, నాయకులు నరేందర్, పాండురంగారెడ్డి, బొబ్బా నవతారెడ్డి పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *