పట్టుదలతోనే విజయం సాధ్యం

– సేవా పక్వాడాలో బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 9: ప్రతి ఒక్కరూ విజయం కోసం కష్టపడి పనిచేయాలని, విజయానికి దగ్గర దారులు లేవని, అపజయాలు ఎదురైనా పట్టుదలతోనే విజయం సాధ్యమవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు. .ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా నాచారంలోని దిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో గురువారం సేవా పక్వాడా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవాభావంతో పనిచేయాలని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. రాజకీయ నాయకులు కేవలం రాజకీయమే కాక సేవా దృష్టితో కూడా పని చేయాలని పిలుపునిచ్చారు. గతంలో 100 కోట్ల జనాభా ఉన్నప్పటికీ ఒలింపిక్స్‌లో ఒక్క మెడల్‌ కూడా రాలేదనే వార్తలు చూసేవాళ్లం. ఇప్పుడు పిల్లల్లో క్రీడలపై ఆసక్తి పెరుగుతోంది. పాఠశాలల్లో కూడా విద్యార్థులను క్రీడల వైపు ప్రోత్సహించాలి.. డ్రగ్స్‌ ఫ్రీ నేషన్‌గా మారాలంటే ఈ చెడు అలవాట్లను దాటడానికి క్రీడలు ఒక ప్రత్యామ్నాయ మార్గమని అన్నారు. ఇజ్రాయిల్‌లో 18 ఏళ్ల వయసు పూర్తయిన వ్యక్తులు మూడేళ్లు మిలటరీలో పనిచేయాలని, అది యూనివర్సిటీలో అడ్మిషన్‌ పొందడానికి అరత అని తెలిపారు. దేశాన్ని కాపాడటానికి యువత, మహిళలు, ప్రతి ఒక్కరూ ముందుకు వస్తారని, ఎన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ ఇజ్రాయిల్‌ ఒక బలమైన దేశంగా నిలిచిందని తెలిపారు. అలా దేశ భద్రత, అభివృద్ధి కోసం యువత, మహిళలు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశాన్ని వికసిత్‌ భారత్‌గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో నిర్విరామంగా కష్టపడుతున్నారంటూ ఆ స్ఫూర్తితో మనమంతా ముందుకెళ్లాలని, దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ప్రధాని మోదీకి దీర్ఘాయువుతో దేశాన్ని అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకెళ్లే అఖండ శక్తి కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో సమాజానికి సేవలందించిన విశిష్ట వ్యక్తులు, పద్మ అవార్డు గ్రహీతలను సన్మానించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *