– ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు దోచుకుంటున్నారు
– గన్నులతో బెదిరిస్తుండడంతో వ్యాపారులు బేజార్
– కాంగ్రెస్ అవినీతికి భయపడుతున్న అధికారులు
– మంత్రులపై పట్టు లేని బలహీన సీఎం రేవంత్
– రేవంత్ పాలనపై ధ్వజమెత్తిన కేటీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 23 : రాష్ట్రంలో అవినీతి విలయతాండవం చేస్తున్నదని, రేవంత్‌రెడ్డి పాలనలో సెటిల్‌మెంట్లు తప్ప ఏమీ నడవడం లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఒక మంత్రి ఇంటికి టాస్క్‌ఫోర్స్ పోలీసులను ముఖ్యమంత్రి పంపడం, నిందితుడిని స్వయంగా మంత్రి తన కారులో తీసుకొని మాయమైపోవడం ఎప్పుడూ చూడలేదన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి అనుచరుడు, ఆప్తుడు రోహిన్ రెడ్డి బెదిరించారని, తుపాకీ రేవంత్ రెడ్డే ఇచ్చిండని మంత్రి కుమార్తె చెప్పారన్నారు. దీనిపై సీఎం మౌనంగా ఉండటమేమిటని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి సిగ్గు ఉంటే ఈ అంశంపై స్పందించాలని డిమాండ్ చేశారు. ఇంతటి బలహీన ముఖ్యమంత్రిని ప్రపంచంలో ఎప్పుడూ చూడలేదని, స్వయంగా నీపైన మంత్రి బిడ్డే ఆరోపణలు చేస్తే ఆ మంత్రినీ పక్కకు జరపలేవు.. నీ మంత్రులు మీపై ఆరోపణలు చేస్తున్నా కనీసం వారినీ ముట్టుకోలేవు అని ధ్వజమెత్తారు. తన పరిపాలనపైన, మంత్రులపై ఎలాంటి పట్టు లేదని తేలిపోయిందన్నారు. దావూద్ ఇబ్రహీం లాంటి ముఖ్యమంత్రిని తరిమేసుకుంటేనే తెలంగాణకు పట్టిన శని పోతుందన్నారు. కాంగ్రెస్ అవినీతికి అధికారులు కూడా భయపడుతున్నారన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తప్పుడు పనులు చేయమని వేధించడం వల్లనే వారు వలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటున్నారని ఆరోపించారు. మంచి అధికారులు కూడా పారిపోయేలా చేసే దండుపాళ్యం ముఠా రాష్ట్రంలో ఉందని హెచ్చరించారు. తను చెప్పిన పని చేయలేదని సీనియర్ ఐఏఎస్ రిజ్వీ వీఆర్‌ఎస్ తీసుకుంటే కూడా ఆయన రాజీనామా ఆమోదించవద్దని జూపల్లి కృష్ణారావు కోరారని తెలిపారు. ముఖ్యమంత్రి వేల కోట్లు సంపాదిస్తుంటే మేము వందల కోట్లయినా సంపాదించవద్దా అని మంత్రులు పోటీ పడుతున్నారన్నారు. గన్నులు పెట్టి బెదిరించడంతో ఇందిరమ్మ రాజ్యంలో వ్యాపారవేత్తలు తమ వ్యాపారాలు చేసుకోలేకపోతున్నారని తెలిపారు. పారిశ్రామికవేత్తకు తుపాకి పెట్టి బెదిరించారని పోలీసులు వెతుకుతున్న నిందితుడిని అరెస్టు చేయొద్దంటూ మంత్రిగారి కుమార్తె ఆపితే స్వయంగా మంత్రి తన కారులో తీసుకొని వెళ్లిపోయినా ఇప్పటిదాకా చర్యలు ఎందుకు లేవని నిలదీశారు. రెండుమూడు రోజులపాటు తిట్టుకొని సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి, మంత్రి ఇద్దరూ కలిసి శాలువాలు కప్పుకుని స్వీట్లు పంచుకున్నారని మండిపడ్డారు. పోలీసులు మాత్రం గన్ ఇచ్చింది కొండా మురళి, బెదిరించింది కొండా సురేఖ, ఓఎస్‌డీ సుమంత్ అని చెప్తున్నారని, రెండు అంశాల్లోనూ బెదిరింపులు గన్నుతో జరిగాయనేది వాస్తవం.. కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. పొంగులేటి నా టెండర్లలో తలదూర్చారని మంత్రి కూతురు స్వయంగా చెప్పిందని, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేశానని ఆమె చెప్పినప్పుడు ఆయన్ను పిలిచి పోలీసులు విచారించరా.. ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలోని దక్కన్ సిమెంట్ కంపెనీ యజమానిపైన గన్ను గురిపెట్టినప్పుడు కనీసం ఆయన్ను, రోహిన్ రెడ్డిని, సుమంత్‌ను పోలీసులు విచారించలేదు.. ఈ మొత్తం వ్యవహారంలో డీజీపీ ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. డీజీపీకి నిజాయతీగలవాడన్న పేరు ఉంటే గన్నుల బెదిరింపు వ్యవహారంలో చర్యలు తీసుకుని తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. మంచిరేవులలో ముఖ్యమంత్రి సోదరుడు 15 ఎకరాలు, కొండా సురేఖ 15 ఎకరాలు తీసుకొని మొత్తం 30 ఎకరాల భూమి పంచాయితీ పెట్టుకున్నారు.. ఈ భూమి మొత్తం నాకు కావాలంటే, నాకు కావాలి అని రేవంత్ రెడ్డి, కొండా సురేఖ కొట్లాడుతున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా మొత్తం బయటపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ఏం సందేశం ఇస్తుంది అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కుక్కలు చింపిన మిస్తరిలా చేస్తారని గతంలోనే కేసీఆర్ చెప్పారన్నారు. ఇంత దారుణంగా బహిరంగంగా అవినీతి అంశం తెరమీదకు వచ్చినా, బెదిరింపులు బయటపడినా బీజేపీ నేతలు స్పందించడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ-కాంగ్రెస్ జాయింట్ వెంచర్ పరిపాలన నడుస్తున్నదంటూ బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు, అమిత్ షా వంటి వాళ్ళు ఎవరు కూడా మాట్లాడడం లేదని. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు కూడా మౌనంగా ఉన్నాయని, అందుకే రాష్ట్రాన్ని బీజేపీ ఏమాత్రం కాపాడలేదని తాము చెప్తున్నామని కేటీఆర్ అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





