హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 3: గాంధీభవన్ (Gandhi Bhavan) కు పోలీసులు భద్రత పెంచారు. మంత్రివర్గ విస్తరణ జరుగనున్న నేపథ్యంలో, ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు ఈ చర్య తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న మంత్రివర్గ విస్తరణను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేపట్టనుండటం, పార్టీలో ఆశావహుల సంఖ్య ఎక్కువ, వున్న మంత్రిపదవులు తక్కువ అయిన నేపథ్యంలో అసంతృప్తులు ఆందోళనకు దిగవచ్చునన్న సమాచారం మేరకు ప్రభుత్వం ఈ చర్య తీసుకున్నట్టు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ అంటే తేనెతుట్టెను కదిపినట్టేనన్నది జగమెరిగిన సత్యం. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఈ విషయంతో తాత్సారం చేస్తూ వచ్చారు. కులాలు, వర్గాలు, సమీకరణలు ఎన్నో లెక్కలు వేసుకున్నా అందరినీ సంతృప్తి పరచడం సాధ్యంకాదన్నది తెలిసిందే. ఎంతో కాలం తర్వాత అధి కారంలోకి వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుల్లో మంత్రిపదవులకోసం తీవ్రస్థాయి పోటీ నెలకొంది. ఇటీవల ఎస్సీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు తమకు అవకాశం కావాలంటూ ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఎవరికి వారు మళ్లీ అధికారంలోకి వస్తామో లేదో అన్న అనుమానంతో, ఇప్పుడు తప్ప మరోసారి ఛాన్స్ దొరకదన్న రీతిలో యత్నాలు సాగిస్తున్నారు. కాంగ్రెస్ అంటేనే ప్రజాస్వామ్యం ఎక్కువ. ఈ నేపథ్యంలో మంత్రిపదవులు రానివారు తమ అనుయాయులతో విధ్వంసం సృష్టించే ప్రమాదమున్నదన్న ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు గాంధీభవన్‌కు భద్రత పెంచారు.
గాంధీ భవన్‌కు భద్రత పెంపు





