సైన్స్‌ ఆవిష్కరణలకు కేంద్రం హైదరాబాద్‌

– యువ ఆవిష్కర్తలు దూసుకెళ్తున్నారు
– ప్రపంచస్థాయి వ్యవస్థల రూపకల్పనకు కేంద్రంగా తెలంగాణ
– పరిశోధనా సంస్థలు, పెట్టుబడిదారులకు స్వాగతం
– ప్రపంచస్థాయి మౌలిక వసతుల కల్పనకు కట్టుబడి ఉన్నాం
– బయో ఇన్‌స్సైర్డ్‌ ఫ్రాంటియర్స్‌- 2025 సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 22: హైదరాబాద్‌కు సైన్స్‌తో ఉన్న అనుబంధం లోతైనది, చిరకాలమైనది అని, భారత తొలి ప్రధానమంత్రి పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ నాయకత్వంలో ఈ నగరంలో అనేక శాస్త్రీయ సంస్థలు పునాది వేసుకున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వివరించారు. జేఆర్‌సీ కన్వెన్షన్‌లో బుధవారం నిర్వహించిన బయోఇన్‌స్సైర్‌ ఫ్రాంటియర్స్‌ 2025 ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ స్పేస్‌ ఎకానమీ, బయోమిమిక్రి అండ్‌ ఎక్స్‌ట్రాటెరెస్ట్రియల్‌ రిసోర్స్‌ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ప్రపంచస్థాయి వ్యవస్థల రూపకల్పనకు కేంద్రంగా తెలంగాణ నిలిచిందని, హైదరాబాద్‌కు ప్రపంచస్థాయి పరిశోధన సంస్థలు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలకు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఆహ్వానం పలుకుతున్నామని తెలిపారు. ప్రపంచస్థాయి మౌలిక వసతుల కల్పనకు సీఎం రేవంత్‌ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం కట్టుబడి ఉంన్నారు. హైదరాబాదు నగరానికి ప్రపంచ నలుమూలల నుంచి విచ్చేసిన శాస్త్రవేత్తలు, పరిశ్రమ నాయకులు, ఆవిష్కర్తలకు ఆయన స్వాగతం పలికారు. శాస్త్ర సున్నితత్వం, కల్పనాత్మకత కవిత్వం కలిసిన ఈ నగరం ఎప్పుడూ సృజనాత్మకతకు నిలయంగా నిలిచిందన్నారు. బయోఇన్‌స్పైర్డ్‌ ఫ్రాంటియర్స్‌ 2025 జీవశాస్త్రం, సాంకేతికత, అంతరిక్ష అన్వేషణల మధ్య జరుగుతున్న ఈ ప్రపంచస్థాయి సంభాషణ భారత శాస్త్రీయ గమ్యాన్ని అర్థ శతాబ్దానికిపైగా నిశ్శబ్దంగా మలిచిన ఈ నగరంలో జరుగుతుండటం గర్వకారణమని అన్నారు. నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ), మునుపటి ఎన్‌ఆర్‌ఎస్‌ఏ హైదరాబాద్‌ను భారతదేశపు ఆకాశ నేత్రంగా మార్చిందని, ఉపగ్రహ చిత్రాలను వ్యవసాయం, నీటి వనరులు, విపత్తు నిర్వహణలో వినియోగిస్తూ మార్గదర్శిగా నిలిచిందని తెలిపారు. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ఇక్కడ డీఆర్‌డీఎల్‌, డీఎంఆర్‌ఎల్‌, ఆర్‌సీఐ వంటి ప్రతిష్ఠాత్మక ప్రయోగశాలలను స్థాపించి దేశానికి క్షిపణి, పదార్థ సైన్స్‌లో నైపుణ్యాన్ని అందించిన తరతరాల శాస్త్రవేత్తలను తీర్చిదిద్ది ఘనత హైదరాబాద్‌కు సొంతం అని భట్టి వివరించారు. ఇవేకాకుండా భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌), మిశ్ర ధాతు నిగమ్‌ (మిధాని), ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌) వంటి పబ్లిక్‌ రంగ సంస్థలు కూడా ఇక్కడే ఎదిగి దేశానికి విమానయాన, లోహశాస్త్రం, ఎలక్ట్రానిక్స్‌ రంగాల్లో బలమైన పునాది వేశాయి అని తెలిపారు. ఈ దశాబ్దాల ప్రజా పెట్టుబడి, శాస్త్రీయ స్పూర్తి కలయికతో రూపుదిద్దుకున్న ఈ పరిసర వ్యవస్థే హైదరాబాద్‌కు ప్రత్యేకమైన సైన్స్‌ డీఎన్‌ఏని ఇచ్చిందని, అది క్రమశిక్షణతో కూడినది, సృజనాత్మకమైనది, స్పష్టమైన ఆశయాలతో కూడిరది అని అన్నారు. ఈ వారసత్వాన్ని నేటి యువ ఆవిష్కర్తలు కొత్త ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్తున్నారని డిప్యూటీ సీఎం ఆనందం వ్యక్తం చేశారు. స్కైరూట్‌ ఏరోస్పేస్‌ ఇక్కడే హైదరాబాద్‌లో జన్మించి, భారత దేశంలోనే ప్రైవేట్‌ రంగం ద్వారా రాకెట్‌ ప్రయోగాలు సాధ్యమని నిరూపించిందని, వారి విజయం కేవలం ఉత్పత్తి కాదు, ఒక కొత్త ఎకోసిస్టమ్‌ను సృష్టించిందని అన్నారు. ప్రొపల్షన్‌ ఇంజనీర్లు, కాంపోజిట్‌ నిపుణులు, స్పేస్‌ సరఫరాదారులు అనే కొత్త తరాన్ని పెంచిందని వివరించారు. ధ్రువ స్పేస్‌, మరో హైదరాబాద్‌ ఆధారిత సంస్థ, ఉపగ్రహ రూపకల్పన నుండి తయారీ, ప్రయోగం, గ్రౌండ్‌ స్టేషన్‌ల వరకు సంపూర్ణ పరిష్కారాలను చూపుతుందని, మనం ప్రపంచస్థాయి వ్యవస్థలను మన రాష్ట్రంలోనే రూపకల్పన చేయగలమని చూపిస్తోంది అని తెలిపారు. ఇవన్నీ చుట్టూ రోబోటిక్స్‌, పదార్థ శాస్త్రం, 3డీ ప్రింటింగ్‌ రంగాల్లో కొత్తగా ఎదుగుతున్న సంస్థలు కలిసి భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థకు కొత్త రూపాన్ని ఇస్తున్నాయన్నారు. ఇవి హైదరాబాద్‌లోని ఐఐటీ హైదరాబాద్‌, ఐఐఐటీ హైదరాబాద్‌, బిట్స్‌ పిలాని, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌, టి-వర్క్స్‌ వంటి సంస్థలతో బలమైన అనుసంధానం కలిగి ఉన్నాయని తెలిపారు. ఇదే తెలంగాణ మోడల్‌ ఆఫ్‌ ఇన్నోవేషన్‌ అని వివరించారు. ఈరోజు హైదరాబాద్‌ అదిభట్లలో ఏరోస్పేస్‌ మాన్యుఫాక్చరింగ్‌, ఈ-సిటీలో ఎలక్ట్రానిక్స్‌, జీనోమ్‌ వ్యాలీలో ఫార్మా, శంషాబాద్‌ సమీపంలోని మొబిలిటీ వ్యాలీలో రవాణా సాంకేతికతలతో ఐటీ, లైఫ్‌ సైన్సెస్‌, ఎలక్ట్రానిక్స్‌, రక్షణ, అంతరిక్ష సాంకేతికతలో ప్రపంచ నాయకులకు ఆతిథ్యం ఇస్తోంది అన్నారు.

ప్రతి క్లస్టర్‌లో మూడు విలువలు ప్రధానంగా ఉంటాయని, ఆవిష్కరణ, తయారీ, సుస్థిరత అని వివరించారు. ఇస్రో అనుబంధ సౌకర్యాలు, టెలీమెట్రీ కేంద్రాలు, ఇన్క్యుబేషన్‌ స్థలాలు హైదరాబాద్‌ను భవిష్యత్తు అంతరిక్ష మిషన్లకు ప్రధాన కేంద్రంగా నిలిపాయని డిప్యూటీ సీఎం తెలిపారు. అవి చంద్రయానం కావొచ్చు, భూమి పరిశీలన కావొచ్చు, లేదా అంతరిక్ష వనరుల వినియోగం కావొచ్చు అని అన్నారు. ఈ కాన్ఫరెన్స్‌ థీమ్‌ు బయోఇన్‌స్పైర్డ్‌ ఫ్రాంటియర్స్‌ మనకు ఒక లోతైన విషయం గుర్తు చేస్తుంది.. ప్రకృతే అసలు ఇంజనీర్‌ అని డిప్యూటీ సీఎం విశ్లేషించారు. మన కర్తవ్యం ప్రకృతిని మించిపోవడం కాదు.. దానినుంచి నేర్చుకోవడం అని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ తత్త్వాన్ని తన అభివృద్ధి దృక్పథంలో భాగం చేస్తోందన్నారు. బయోమిమెటిక్‌ డిజైన్‌, గ్రీన్‌ బిల్డింగ్‌ కోడ్స్‌, నీటి నిర్వహణ, శుద్ధ ఇంధనం రంగాల్లో దీన్ని ప్రోత్సహిస్తోంది అని వివరించారు. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ రాబోయే దశాబ్దంలో విపరీతంగా పెరగబోతోందని, ఆ వృద్ధికి తెలంగాణ లాంచ్‌ప్యాడ్‌గా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ప్రపంచంలోని పరిశోధనా సంస్థలు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలను హైదరాబాద్‌కి ఆహ్వానిస్తున్నామన్నారు. సహాయక విధాన వాతావరణం, ఇన్క్యుబేషన్‌ సపోర్ట్‌, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ రోజు ఇక్కడ మొదలైన చర్చలు భవిష్యత్తులో భూమి మీదా, అంతరిక్షంలోనూ మంచిని నిర్మించే భాగస్వామ్యాలుగా మారాలని కోరుకుంటున్నానన్నారు. జ్ఞానం, అన్వేషణ మధ్య వంతెనగా, భూమి ఆకాశం మధ్య సేతువుగా హైదరాబాద్‌ మహానగరం ఎప్పటికీ నిలవాలని డిప్యూటీ సీఎం ఆకాంక్షించారు. సమావేశంలో ట్రాన్స్‌కో సీఎండి కృష్ణ భాస్కర్‌, జేఈఓపీఏక్యూ సీఈవో ఎం. అబ్బాస్‌, లీడ్‌ స్పాన్సర్‌ సుజిత్‌ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *