విద్యార్థులు, యువతకు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 26: తెలంగాణ ప్రాంతానికి ఒక గొప్ప చరిత్ర ఉంది.. నిజాంలకు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన వీరులు పుట్టిన గడ్డ ఇది.. ఆ పోరాట స్ఫూర్తి నుంచే తెలంగాణ ఉద్యమం మొదలైంది.. ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్లాల్సిన రాష్ట్ర యువత డ్రగ్స్ మహమ్మారికి బలవడం న్యాయమా అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మాదక ద్రవ్యాలపై ఆలోచన చేస్తే వెన్ను విరుస్తామని తాము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే హెచ్చరించాం. ఉద్యమాల గడ్డ తెలంగాణలోని పాఠశాలలు, కళాశాలల్లో డ్రగ్స్ మహమ్మారికి పిల్లలు బలవుతుంటే చూస్తూ కూర్చుందామా అని ప్రశ్నించారు. ప్రపంచంలో 68 శాతం యువత ఉన్న ఏకైక దేశం భాóరత్.. శత్రు దేశాలు మన దేశాన్ని నిర్వీర్యం చేసేందుకు వివిధ మార్గాలను ఎంచుకుంటున్నాయి.. అందులో డ్రగ్స్ మహమ్మారి ఒకటి. తెలంగాణలో యువత నిర్వీర్యం కాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు. ఏ పాలసీ లేని తెలంగాణలో తాము అధికారంలోకి రాగానే స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చామన్నారు. యువతలో నైపుణ్యం పెంచేందుకు స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్నారు. నల్లమల నుంచి వచ్చిన తాను జెడ్పీటీసీ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగా.. తనలాగే విజయ్ దేవరకొండ నల్లమల నుంచి వచ్చి ఈ స్థాయికి ఎదిగారు.. కష్టం, కమిట్మెంట్ లేకుండా ఈ స్థాయికి రాణించలేరు అని వివరించారు. అందుకే మాదక ద్రవ్యాల నియంత్రణకు కలిసికట్టుగా ముందుకు రండి.. నో డ్రగ్స్‌కు మీరే వారధులుగా మారండి అని యువతకు పిలుపునిచ్చారు. మీరు మేము కలిస్తే ప్రపంచానికే ఆదర్శవంతంగా తెలంగాణను తీర్చిదిద్దగలుగుతామని ఆయా సంస్థల యాజమాన్యాలకు, పిల్లల తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. టీజీన్యాబ్ ఇకనుంచి ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్సుమెంట్(ఈగల్)గా మారిందన్నారు. ఈ విభాగం నేటినుంచే పని ప్రారంభించిందని, తెలంగాణలో ఎక్కడ గంజాయి పండిరచినా పసిగడుతుందని, అక్రమ రవాణాను సరిహద్దుల్లోనే పసిగడుతుందని తెలిపారు. చదువు, ఆటల్లో రాణించి హీరోలుగా నిలవండ.. ఉద్యోగాల్లోనే కాదు రాబోయే రోజుల్లో రాజకీయాల్లోనూ స్పోర్ట్స్ పర్సన్స్‌కు ప్రత్యేక అవకాశాలు కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. కాగా, ఈ కార్యక్రమంలో ’ఈగల్‘ లోగోను సీఎం రేవంత్, దేవరకొండ విజయ్ తదితరులు ఆవిష్కరించారు.





