– ఆయన పేరు వింటే తెలంగాణ ప్రజల హృదయాలు ఉప్పొంగుతాయి
– పటేల్ 150వ జయంతి కార్యశాలలో రామచందర్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 19: సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు వింటే తెలంగాణ ప్రజల హృదయాలు గర్వంతో నిండుతాయి. ఎందుకంటే ఆయన కృషి వల్లే ఈరోజు తెలంగాణ భారతదేశంలో భాగమైంది. చరిత్రను వక్రీకరించి రాజకీయ లాభం కోసం కొన్ని పార్టీలు సత్యాన్ని దాచిపెట్టినా బీజేపీ మాత్రం నిజమైన చరిత్రను ప్రజలకు స్పష్టంగా తెలియజేస్తోంది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సర్దార్ 150వ రాష్ట్రస్థాయి కార్యశాల జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ రాష్ట్రం భారత దేశంలో విలీనం అయిన రోజును తెలంగాణ ప్రభుత్వాలు అధికారికంగా జరపకపోయినా నరేంద్ర మోదీ ప్రభుత్వం, బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్ విమోచన దినోత్సవంగా జరుపుతోందన్నారు. దేశ ఏకీకరణలో సర్దార్ పటేల్ పాత్ర అమోఘం. 560 సంస్థానాలను ఒక్క జెండా కింద కలిపి భారత దేశాన్ని ఏకం చేశారని చెప్పారు. ఆయన కాంగ్రెస్ నాయకుడైనా, ఆయన దేశ సేవ మనకు స్ఫూర్తి అని అన్నారు. ఒకవైపు సర్దార్ పటేల్ దేశాన్ని ఏకం చేస్తే అదే పార్టీలోని కొంతమంది ఈరోజు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారుని ఆరోపించారు. అయితే మన అభినవ సర్దార్ పటేల్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నాయకత్వంలో నక్సలిజం దేశంలో దాదాపు నిర్మూలన జరిగిందన్నారు. పోలీసు కుటుంబాలు, కానిస్టేబుళ్ల ప్రాణాలను బలిగొన్న నక్సలిజాన్ని ఎవరు ప్రోత్సహించారు అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశ ఏకత్వం కోసం సర్దార్ పటేల్ చేసిన త్యాగాన్ని భావితరాలకు తెలియజేయడం మనందరి బాధ్యత అని అన్నారు. ఈనెల 31న సర్దార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమం పార్టీకి సంబంధించింది కాదు, ఇది భారత ప్రభుత్వానికి చెందిన జాతీయ కార్యక్రమం. అయినప్పటికీ పార్టీ కార్యకర్తలు అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుతున్నాను. తెలంగాణ ప్రజలందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.