– మేడారంలో కొలువుదీరిన వనదేవతలు
– కన్నుల పండువగా గద్దెపైకి సమ్మక్క రాక
– శివసత్తుల పూనకాలతో మారుమోగిన మేడారం
– గాలిలోకి కాల్పులు జరిపి స్వాగతం పలికిన ఎస్పీ
– పట్టువస్త్రాలు సమర్పించిన కలెక్టర్
– చంద్రుని వెలుగులో అమ్మవారి సాక్షాత్కారం
– అశేష భక్తజనవాహిని పారవశ్యం
(మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి )
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన మహాకుంభమేళా మేడారంలో అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది. కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం, అన్యాయాన్ని ఎదిరించిన వీరమాత ‘సమ్మక్క’ తల్లి గురువారం రాత్రి గద్దెపై కొలువుదీరింది. చిలకలగుట్ట నుంచి తల్లి రాకతో మేడారం అడవి పులకించిపోయింది. గద్దెలపై దేవతలందరూ కొలువుదీరడంతో జాతర సంపూర్ణమై, భక్తజన సంద్రం భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. తమ కోర్కెలను ఈడేర్చే సమ్మక్క తల్లి కోటి దండాలంటూ పడి పడి దండాలు పెట్టారు. శివసత్తుల పూనకాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. వాస్తవానికి సారలమ్మ తల్లి గద్దె మీదకు రావడంతోనే జాతర మొదలైంది. అయితే సమ్మక్క గద్దెకు చేరుకోవడంతో ఒకవిధంగా జాతర సంపూర్ణమైంది. దీంతో ఆదివాసీలు తరతరాలుగా తమ ఇలవేల్పులుగా కొలిచే దేవతలంతా ఒకే ప్రాంగణంలో కొలువుదీరడంతో గురువారం నాటి జాతరకు ప్రాధాన్యత చేకూరినట్లైంది. అనుకున్న సమయానికన్నా ఆలస్యంగా సమ్మక్క తల్లి గద్దెకు చేరినప్పటికీ అశేష భక్తజనం నీరాజనాలు అందుకుంది. ప్రతీసారి జాతరలో ఆ తల్లిని గద్దెపైకి తీసుకు వచ్చే ఘట్టం ఎంతో ఉద్వేగభరితంగా సాగుతుంది. ఆ ఘట్టం కనులారా చూసేందుకు తరలివచ్చిన భక్తుల రద్దీని తట్టుకుని గద్దెకు చేరడంలో జాప్యం జరుగుతూనే ఉంటుంది. ఈసారికూడా అదే విధంగా తమను పూజారులు తొక్కుకు పోయే విధంగా భక్తులు దారికి అడ్డంగా పడుకోవడం, శివ శక్తుల పూనకాలు, తల్లి గుట్ట కిందకు చేరగానే దర్శనం చేసుకోవాలని ఉత్సాహంతో తోసుకువచ్చే జన సమూహాన్ని తప్పించుకుంటూ సమ్మక్కను గద్దెకు చేర్చడమన్నది నిర్వాహకులకు పెద్ద పరీక్షే. ఆ కారణంగా ప్రతీ ఏటా అనుకున్న సమయానికన్నా గంటలకొలది జాప్యం జరుగుతూనే ఉంటుంది.
ప్రధాన పూజారి కొక్కెర క్రిష్ణయ్యది ప్రధాన పాత్ర
సమ్మక్కను తీసుకురావడంలో ప్రధాన పూజారి కొక్కెర క్రిష్ణయ్యది ప్రధాన పాత్ర. ఎందుకంటే గిరిజనులు అనుసరిస్తున్న సంప్రదాయం ప్రకారం ఆయన ఒక్కడే చిలకలగుట్ట పైకి వెళ్ళి, రహస్య పూజలు నిర్వహించడం. ప్రతీ జాతరలో అనుసరించిన విధంగానే ఈసారి కూడా సమ్మక్క తల్లి అంతర్ధాన మైందని చెబుతున్న చిలకలగుట్ట నుంచి ఆమె ప్రతిరూపాన్ని (కుంకుమ భరిణను) కిందకు చేర్చి, అక్కడినుండి మంది మార్భలం, అధికార యంత్రాంగం తోడు రాగా మేడారం గద్దెకు చేర్చినవేళ భక్తజనం పారవశ్యానికి గురైనారు. చిలకలగుట్ట నుంచి తల్లిని కిందకు చేర్చిన గుర్తుగా అలాగే తల్లికి స్వాగత సూచనగా స్థానిక ఎస్పీ గాలిలోకి పదిరౌండ్ల కాల్పులు జరిపిన సంకేతాన్ని అందుకున్నందునే, అక్కడే తల్లి రాక కోసం ఎదురు చూస్తున్న వివిధ గిరిజన వాయిద్యాల చప్పుళ్ళతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగింది. ములుగు జిల్లా కలెక్టర్ దివాకర అక్కడే సమ్మక్క పూజారులకు పట్టు వస్త్రాలను సమర్పించి స్వాగతం పలికారు. దారికి అడ్డుపడకుండా పోలీసు రోప్ పార్టీ ఎంత అదుపు చేసినా భక్తులు బిందెలతో నీళ్ళు గుమ్మరించడం, కోళ్లను, మేకలను బలిచ్చే కార్యక్రమాల్లో మునిగిపోయారు. సమ్మక్కను గద్దెకు చేర్చడానికి ముందు పూజారి కుటుంబసభ్యులు గద్దెలను శుభ్రంచేసి, ముగ్గులతో అలంకరించారు. అడవి నుంచి తెచ్చిన వెదురు కర్రలను గద్దెపై అమర్చారు. అనంతరం ఎరుపు వస్త్రాలను కప్పుకుని పూజారులు సమ్మక్కను భారీ బందోబస్తు మధ్య గద్దెకు చేర్చారు.
తుపాకీ పేల్చి స్వాగతం పలికిన ఎస్పీ 
సమ్మక్క గద్దెకు చేరిన వేళ ప్రాంగణంలోని విద్యుత్ దీపాలు ఒక్క క్షణం ఆగిపోయాయి. గద్దె వద్దకు సమ్మక్క రాగానే ఆనవాయితీ ప్రకారం ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ గాలిలోకి తుపాకీ పేల్చి స్వాగతం పలికారు. చంద్రుని వెలుగులో అమ్మవారి సాక్షాత్కారం నిజంగా అశేష జనాన్ని పారవశ్యులను చేసింది. అంత క్రితం రోజు ముందే పూనుగండ్ల నుంచి పగిడిద్దరాజును, కొండాయి నుంచి గోవిందరాజులు కొలువుతీరారు. బుధవారం మధ్యరాత్రి సంబంధిత పూజారులు భక్తి శ్రద్దలతో వారి ప్రతిమలను తీసుకువచ్చి ప్రతిష్ట చేశారు. అలాగే సారలమ్మను కూడా గద్దెకు తీసుకు వచ్చే తతంగమంతా మధ్యరాత్రి వరకు సాగింది. సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్యతో పాటు ఇతర గిరిజన పూజారులంతా కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెలకు చేర్చే తతంగమంతా అట్టహాసంగా సాగింది. సమ్మక్క గద్దెకు చేరుకునే మహా దృశ్యాన్ని స్వయంగా వీక్షించేందుకు పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులంతా గురువారం ఉదయం నుండి అక్కడ కొలువుతీరారు. కేంద్ర మంత్రులు జుయల్ ఓరమ్, కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లతోపాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి, లక్ష్మణ్‌లున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





